700 ఏండ్ల తర్వాత తన పూర్వీకుల స్వస్థలానికి విచ్చేసిన కాకతీయుల వారసుడు కమల్‌చంద్ర భంజ్‌దేవ్‌కు రాష్ట్ర మంత్రులు ఘన స్వాగతం పలికారు. కాకతీయ సామ్రాజ్య వైభవాన్ని ప్రపంచానికి చాటేందుకు ప్రభుత్వం వారం రోజులపాటు కాకతీయ వైభవ సప్తాహాన్ని నిర్వహిస్తున్నది. ఏడురోజులపాటు జరిగే ఈ ఉత్సవాలను కాకతీయుల 22వ తరం వారసుడు కమల్‌చంద్ర భంజ్‌దేవ్ ప్రారంభించనున్నారు. ఇందులో భాగంగా ఆయన వరంగల్‌లోని భద్రకాళి ఆలయానికి చేరుకోగా… ప్రభుత్వ చీఫ్ విప్ దాస్యం వినయ్ భాస్కర్, మంత్రులు శ్రీనివాస్ గౌడ్, సత్యవతి రాథోడ్ ఘనంగా స్వాగతం పలికారు. ఉత్సవాల్లో భాగంగా కాకతీయుల విశిష్టత, గొప్పతనం తెలిపేలా కార్యక్రమాలు నిర్వహించనున్నారు. ఉమ్మడి వరంగల్ జిల్లాలోని పలు చారిత్రక కట్టడాల వద్ద ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. జిల్లా వ్యాప్తంగా వారంరోజులపాటు సాంస్కృతిక కార్యక్రమాలు, సదస్సులు నిర్వహిస్తారు.