వరంగల్ కాకతీయ మెడికల్ కళాశాల ఆడిటోరియంలో మిషన్ కాకతీయ, దేవాదుల, మేజర్ ఇరిగేషన్ లపై భారీ నీటిపారుదల శాఖామంత్రి హరీష్ రావు ఈరోజు సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ, కాకతీయుల స్ఫూర్తితోనే మిషన్ కాకతీయ చేపట్టామని, గతంలో చెరువుల మరమ్మతులు జరిగినా పూడిక సరిగ్గా తీయలేదని అన్నారు. ఉద్దేశపూర్వకంగానే గత పాలకులు తెలంగాణలోని చెరువులను విధ్వంసం చేశారని మండిపడ్డారు. వరంగల్ జిల్లాలో 5,685 చెరువులు ఉన్నాయని, ప్రాముఖ్యత కలిగిన ఈ చెరువుల్లో కొన్నిటినైనా వచ్చే ఖరీఫ్ నాటికి పునరుద్ధరిస్తామని హరీష్ రావు చెప్పారు.
అనంతరం కడియం శ్రీహరి మాట్లాడుతూ, చెరువుల పునరుద్ధరణ వల్ల నిరుపయోగంగా ఉన్న లక్షల ఎకరాల భూమి సాగులోకి వస్తుందని, చెరువుల పునరుద్ధరణ కోసం ప్రతి ఒక్కరూ సహకరించాలని కోరారు. గత ఆరునెలల్లో రాజకీయ అవినీతి బాగా తగ్గిందని, దీనిని నియంత్రించిన సీఎం కేసీఆర్ కు ఎంపీ అభినందనలు తెలిపారు. చెరువుల టెండర్లలో నేతలు ఎవరైనా కమిషన్ అడిగితే తమకు చెప్పమని కడియం పేర్కొన్నారు.