mt_logo

తప్పుడు ప్రచారాన్ని తొక్కుకుంటూ మెట్రో ప్రాజెక్టు ముందుకు సాగుతుంది!

మెట్రో రైలు అలైన్ మెంట్, హుస్సేన్ సాగర్ ప్రక్షాళన, హైదరాబాద్ లో భూకబ్జాలు, పేదలకు ఇండ్ల స్థలాల పంపిణీ తదితర అంశాలకు సంబంధించి మంగళవారం ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్ రావు అధ్యక్షతన అన్ని పార్టీల నేతలతో అఖిలపక్ష సమావేశం జరిగింది. ఈ సందర్భంగా సీఎం మాట్లాడుతూ, హైదరాబాద్ నగరానికి తలమానికంగా మారనున్న మెట్రో రైలుపై కొన్ని శక్తులు కుట్రలు చేస్తున్నాయని, ఆ కుట్రలు, తప్పుడు ప్రచారాన్ని తొక్కుకుంటూ మెట్రో రైలు ప్రాజెక్టు ముందుకు సాగుతుందని అన్నారు. నగరంలోని చారిత్రక కట్టడాలు, వారసత్వ సంపద, ప్రార్ధనా మందిరాలకు ఆటంకం కలగకుండా మెట్రో ప్రాజెక్టును ముందుకు తీసుకుపోవాలని ప్రభుత్వం భావిస్తున్నదని, అందుకే మూడుచోట్ల అలైన్ మెంట్ మార్చాలని భావిస్తున్నట్లు తెలిపారు.

ప్రపంచంలో మరే నగరానికి లేనటువంటి గొప్ప అవకాశం, అదృష్టం హుస్సేన్ సాగర్ వల్ల హైదరాబాద్ కు కలిగిందని, కానీ హుస్సేన్ సాగర్ మురికికూపంగా మారడం దురదృష్టకరమని సీఎం పేర్కొన్నారు. దీన్ని పూర్తిస్థాయిలో ప్రక్షాళన చేయాలని ప్రభుత్వం నిర్ణయించిందని, హుస్సేన్ సాగర్ కు చుట్టూ ఆకాశహర్మ్యాలు నిర్మించడం ద్వారా తెలంగాణ అభివృద్ధి, ఆర్ధికస్థితి యావత్ ప్రపంచానికి తెలుస్తాయని కేసీఆర్ అన్నారు. దీనిపై స్పందించిన వివిధ పార్టీలకు చెందిన నేతలు హుస్సేన్ సాగర్ ను పూర్తిస్థాయిలో శుద్ధిచేయాలని, అందుకు అవసరమైన చర్యలు తీసుకునే విషయంలో ప్రభుత్వానికి అండగా ఉంటామని హామీ ఇచ్చారు.

అంతేకాకుండా బడాబాబులు ఆక్రమించుకున్న పేదల స్థలాలు స్వాధీనం చేసుకోవాల్సిందేనని, హైదరాబాద్ లో చాలామంది పేదవారు పొట్ట చేతపట్టుకుని వివిధ జిల్లాలనుండి వస్తున్నారని, వారు మురికివాడల్లో అత్యంత దీనస్థితిలో ఉన్నారని సీఎం ఆవేదన వ్యక్తం చేశారు. వారు నివాసం ఉంటున్న ప్రాంతాల్లో గుడిసెలు వేసుకున్న స్థలాన్ని ప్రభుత్వమే వారికి ఉచితంగా ఇవ్వాలని భావిస్తున్నదని కేసీఆర్ చెప్పారు. 80 నుండి 125 గజాల స్థలాన్ని పేదలకు వారి పేరిట పట్టాలు ఇవ్వాలని, ఉచితంగా వాటిని క్రమబద్దీకరించాలని సీఎంతో సహా అన్ని పక్షాలు సమావేశంలో నిర్ణయించాయి. ప్రభుత్వం భూ కబ్జాల నియంత్రణకు కఠినమైన చట్టాన్ని రూపొందిస్తే సహకరిస్తామని కూడా అఖిలపక్షం తెలిపింది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *