తెలంగాణ కుకింగ్ గ్యాస్ డెలివరీ వర్కర్స్ యూనియన్ తొలిసంవత్సర మహాసభ ఆదివారం హైదరాబాదులో జరిగింది. ఈ కార్యక్రమానికి కాంగ్రెస్ ఎంపీ మధుయాష్కీ గౌడ్, టీఆర్ఎస్ ఎమ్మెల్యే ఈటెల రాజేందర్ హాజరయ్యారు. ఎంపీ మధుయాష్కీ మాట్లాడుతూ, తెలంగాణ బిల్లును ఫిబ్రవరి 15న పార్లమెంటులో ప్రవేశబెడ్తారని, 21న బిల్లు ఆమోదంపొంది తెలంగాణ రాష్ట్రం ఏర్పడుతుందని విశ్వాసం వ్యక్తం చేశారు. తెలంగాణ ఏర్పాటును అడ్డుకోవడానికి సీమాంధ్రకు చెందిన నాయకులు ఎన్నోవిధాలుగా ప్రయత్నిస్తున్నారని, తండ్రి శవం పక్కనేపెట్టుకొని జగన్ ముఖ్యమంత్రి పదవికోసం పాకులాడాడని ఆయన తీవ్రంగా మండిపడ్డారు. తెలంగాణ వచ్చిన తర్వాత కొందరు పైరవీకారులు హైజాక్ చేస్తారని, తెలంగాణ ప్రజలంతా అప్రమత్తంగా ఉండాలని ఈటెల రాజేందర్ అన్నారు. టీ మాలమహానాడు అధ్యక్షుడు అద్దంకి దయాకర్ మాట్లాడుతూ, గ్యాస్ డీలర్లు ఖచ్చితమైన నిబందనలు పాటించకుండా అన్ని ఖర్చులనూ కార్మికులపై మోపుతున్నారని వ్యాఖ్యానించారు. పోరాటాల ద్వారానే హక్కులను సాధించుకుంటామని పీటీఎఫ్ ఉపాధ్యక్షుడు వేదకుమార్ తెలిపారు. శ్రీనివాస్ గౌడ్ మాట్లాడుతూ, తెలంగాణ రాష్ట్రం రాగానే పండగ కాదని, అసలైన కథ అప్పుడు మొదలవుతుందని అన్నారు.
ఆదివారం జరిగిన పీఆర్టీయూ తెలంగాణ సంఘం డైరీ ఆవిష్కరణలో ఈటెల రాజేందర్, కేకే పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఈటెల రాజేందర్ మాట్లాడుతూ, సీమాంధ్ర నేతలు మాట్లాడిన అసత్యాలకు సోమవారం జరిగే అసెంబ్లీ సమావేశాల్లో సమాధానం చెబుతామన్నారు. చర్చకు గడువు పెంచినా, 14కల్లా పార్లమెంటుకు బిల్లు చేరి 21న ఆమోదం పొందుతుందని టీఆర్ఎస్ జనరల్ సెక్రెటరీ కే. కేశవరావు స్పష్టం చేశారు.