గురుకుల ట్రస్ట్ భూములతో ప్రారంభమైన కేసీఆర్ సంకల్పం మొత్తం భూకబ్జాల లెక్కలు తీయాల్సిందే. మన తెలంగాణ ప్రయోజనాలకు, సంక్షేమానికి, మన భూములు ఉపయోగపడవలసిందే. తెలంగాణ ముఖ్యమంత్రి సంకల్పానికి ప్రజలు, ఉద్యమకారులు సహకరించి ఆంధ్రుల చెర నుంచి తెలంగాణ భూములకు విముక్తి కల్పించే యజ్ఞాన్ని ఉద్యమంలా నిర్వహించవలసిందే. అదే మన అస్థిత్వ అధికార చిహ్నం.
మనరాష్ట్రంలో.. మన ప్రభుత్వం…మన ముఖ్యమంత్రి కేసీఆర్ హైదరాబాద్ భూముల కబ్జాలపై కదనభేరి మ్రోగించారు. ముదావహం. తెలంగాణ ముఖ్యమంత్రి ఇది మొదటి ప్రాధాన్యతగా భావిస్తున్నందుకు తెలంగాణ ప్రజల ఆకాంక్షలో ప్రధాన ఘట్టానికి తెరలేచింది. కబ్జాల భూముల విముక్తికి ఇది నాంది. హైదరాబాద్ భూముల కబ్జా రాస్తే రామాయణమంత…చెప్పుకుంటే భారతమంత. ఒక ఒడువని కథ. భూసంపదకు కొరవలేని హైదరాబాద్‌ను చూసి, అప్పటికే హైదరాబాద్‌లో అభివృద్ధి చెందిన మౌలిక వసతులను చూసి, కన్నేసిన సీమాంధ్రులు తెలంగాణను కలుపుకొని ఆంధ్రప్రదేశ్ ఏర్పాటు చేయాలని కేంద్రంలో లాబీయింగ్ చేసి సాధించారు. తెలంగాణ ఆకాంక్షలకు వ్యతిరేకంగా విలీనం జరిగింది. వండి వడ్డించిన విస్తరి లాంటి హైదరాబాద్‌ను ఆంధ్రప్రదేశ్ ఏర్పాటయిన తర్వాత సీమాంధ్ర పాలకులు పొక్కిలి చేశారు.
పొరుకపోడు చేశారు. ఆత్మగల్ల ఈ నగరాన్ని నిస్సారం చేసి, విధ్వంసం చేసి, ప్లాట్లు ప్లాట్లుగా విభజించి రియల్ ఎస్టేట్‌గా కబ్జా చేసి అపార సంపదను అక్రమంగా మూట గట్టుకున్నారు. అందుకే హైదరాబాద్ ఉమ్మడి రాజధాని అని సాకునాలు తీకునాలు తీసి, కేంద్రం వద్ద ఒప్పించుకోగలిగారు. హైదరాబాద్‌ను ఆంధ్రులు విడిచిపెట్టిపోవడానికి ఇష్టపడకపోవడానికి ప్రధాన కారణం ఇక్కడి భూసంపదపై వారు పెట్టిన అక్రమ కబ్జాలే. అందుకే తెలంగాణ ఉద్యమం పొడవునా ప్రజల నుంచి, ఉద్యమం నుంచి, ఇంటి పార్టీ టీఆర్‌ఎస్ శ్రేణుల నుంచి ఒకే ఒక్క డిమాండ్ ప్రధానంగా వినపడ్తున్నది. సజీవంగా ఉన్నది. అదేమంటే హైదరాబాద్ భూముల్లో అక్రమంగా తిష్టవేసిన సీమాంధ్రుల కబ్జాల నుంచి విముక్తి లభిస్తుందా? మన రాష్ట్రం ఏర్పడినాక మన ప్రభుత్వం కబ్జాకోరుల నుంచి హైదరాబాద్ భూములకు విముక్తి కలిగించాలి అనేదే ప్రధాన డిమాండ్‌గా ముందుకు వస్తున్నది. కేసీఆర్ నేతృత్వంలోని మన ప్రభుత్వం భూకబ్జాలను సీరియస్‌గా తీసుకొని, వచ్చిన నెలరోజులలోపే ప్రజల ఆకాంక్ష అయిన భూకబ్జాల విముక్తి ప్రాధాన్యతగా భావించినందువల్ల ఇప్పుడొక కార్యాచరణ జరగవలసి ఉన్నది. ఇది అంతం కాదు ఆరంభం మాత్రమే.
హైదరాబాద్ భూకబ్జాల్లో అతి ప్రధానమైనది గురుకుల ట్రస్ట్ భూదందా. అందుకే దరిదాపు ఇరవై వేల కోట్ల రూపాయల విలువచేసే గురుకుల్ ట్రస్ట్ భూములపై తెలంగాణ ప్రభుత్వం మొదట దృష్టి పెట్టింది. గురుకుల్ ట్రస్ట్ భూముల చరిత్ర పెద్దది. ఇప్పటికీ మహబూబ్‌నగర్ టీఆర్‌ఎస్ బాధ్యులు విఠల్‌రావు ఆర్య లాంటి వాళ్లు ఈ ట్రస్ట్ భూముల చరిత్ర మొత్తం చెబుతారు. పుణ్యాత్ములు కొందరు పుణ్యకార్యం కోసం, సేవా దృక్పథంతో దళితులు, అణగారిన వర్గాలకు విద్యను అందించాలన్న పట్టుదలతో అక్షరాల 627 ఎకరాల భూమిని ట్రస్ట్‌కు ఇస్తే, పాపాత్ములు ఇప్పుడా భూములను చెరబట్టి కైంకర్యం చేసుకున్నారు. బన్సీలాల్ వ్యాస్ అనే వ్యక్తికి ఆయన మామ ఇచ్చిన భూమి ఇది. కానీ సీమాంధ్రులు వంతులు వేసుకొని, మరీ ముఖ్యంగా చంద్రబాబు, వైఎస్ రాజశేఖర్‌రెడ్డిలు ఈ భూములను కబ్జాకోరులకు ధారాదత్తం చేశారు. తెలంగాణ ముఖ్యమంత్రి టి. అంజయ్య ఈ భూములు ట్రస్టీకి మాత్రమే ఉండాలని పకడ్బందీ ఏర్పాటు చేసి, చట్టపరమైన చర్యలు తీసుకుంటే ఆ తర్వాత ముఖ్యమంత్రులు ఈ భూములను భూక్రమబద్ధీకరణ క్రిందకు తెచ్చి, ఈ భూములు అమ్మకూడదు, కొనకూడదన్న హైకోర్టు తీర్పులనూ ఉల్లంఘించి అడ్డగోలుగా క్రమబద్ధీకరించారు. చంద్రబాబు హయాంలో అడ్డికి పావుశేరు అనేక సంస్థలకు వందల ఎకరాలు కట్టబెట్టారు. ఒక దశలో ఆయన భార్య పేరిట కూడా ఐదెకరాల భూమి రాయించుకున్నారని ఆరోపణలు కూడా వచ్చాయి. సినీ నటుడు నాగార్జున ఎన్‌కన్వెన్షన్ సెంటర్ మొదలుకుంటే, వై.ఎస్. రాజశేఖర్‌రెడ్డి బావమరిది రవీంద్రరెడ్డి, తమ్ముడు వివేకానందరెడ్డి దాకా ఈ భూములు క్రమబద్ధీకరించుకున్న వారి జాబితాలో ఉన్నారు. గురుకుల ట్రస్ట్ ఏ సదుద్దేశాలతో ఏర్పడిందో? ఆ ఉద్దేశాలన్నీ గాలికి పోయాయి. యజ్ఞశాల మాయమయింది.
నిధులు లేక ట్రస్ట్ కునారిల్లింది. ట్రస్ట్‌లోనే చిచ్చుపెట్టి సీమాంధ్రులు ఎల్లికి మల్లిని పుట్టిచ్చినట్టు జీపీఏలు పుట్టిచ్చి, ఒకరి నుంచి ఒకరికి కైంకర్యం చేసి 627 ఎకరాలనూ కబ్జా చేశారు. అయ్యప్ప సొసైటీ పేరిట జీపీఏల మీద గురుకుల ట్రస్ట్ భూములను కాజేశారు. నమస్తే తెలంగాణ ఆవిర్భవించిన కొద్దిరోజుల్లోనే గురుకుల భూం ఫట్ పేరిట ఏడు వరుస కథనాలను ప్రచురించింది. కేసీఆర్ కూడా అప్పుడు తెలంగాణ ఉద్యమ నేతగా అప్పటి సీఎం కిరణ్‌కుమార్‌రెడ్డికి నీతీ నిజాయితీ ఉంటే ఈ గురుకుల ట్రస్ట్ భూములన్నీ కబ్జా నుంచి విడిపించాలని సవాల్ చేశారు. అప్పుడు మన ప్రభుత్వం లేదు. ఇప్పుడు మన ప్రభుత్వం వచ్చింది. అప్పటి ఉద్యమనేత ఇప్పటి మన ముఖ్యమంత్రి. స్వయంగా కేసీఆర్‌కు ఈ భూములపైన స్పష్టమైన అవగాహన ఉన్నది. అక్రమంగా ఆక్రమించుకున్న ఈభూములకు అప్పటి రాజశేఖర్‌రెడ్డి హయాంలో జీహెచ్‌ఎంసీ అక్రమ అనుమతులు ఇస్తే, మిగతా శాఖలు అన్నింటికీ అనుమతులు ఇచ్చారు. ఒక కాంక్రీట్ జంగిల్‌గా అక్కడ నూరుశాతం అక్రమాలతో, నూరు శాతం కబ్జా చేసిన భూముల్లో బహుళ అంతస్తులు, స్టార్ హోటళ్లు కొలువుదీరాయి. ఇప్పుడిక ఈ ప్రక్షాళన జరగవలసి ఉన్నది. ప్రజల ఆకాంక్ష ఫలించవలసి ఉన్నది. హైదరాబాద్ భూములు సర్ఫేఖాజ్‌లు, అసైనీ భూములు, కాందిశీకుల భూములు, లావోనీ పట్టాలు ఎన్ని అయినా, ఏరకమైనా నిన్నటి మొన్నటి కిరణ్‌కుమార్‌రెడ్డి హయాంలో ఆక్రమించుకున్న భూముల దాకా అన్నీ బయటపడవలసిందే. గురుకుల ట్రస్ట్ భూములతో ప్రారంభమైన కేసీఆర్ సంకల్పం మొత్తం భూకబ్జాల లెక్కలు తీయాల్సిందే. మన తెలంగాణ ప్రయోజనాలకు, సంక్షేమానికి, మన భూములు ఉపయోగపడవలసిందే. తెలంగాణ ముఖ్యమంత్రి సంకల్పానికి ప్రజలు, ఉద్యమకారులు సహకరించి ఆంధ్రుల చెర నుంచి తెలంగాణ భూములకు విముక్తి కల్పించే యజ్ఞాన్ని ఉద్యమంలా నిర్వహించవలసిందే. అదే మన అస్థిత్వ అధికార చిహ్నం.
నమస్తే తెలంగాణ సౌజన్యంతో..