mt_logo

జిల్లా కలెక్టర్లతో సమావేశమైన సీఎం కేసీఆర్

ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్ రావు ఈ రోజు జిల్లా కలెక్టర్లతో సమావేశం అయ్యారు. ఎస్సీ, ఎస్టీ సబ్ ప్లాన్ అమలు, ప్రతి ఎస్సీ, ఎస్టీ కుటుంబానికి మూడు ఎకరాల వ్యవసాయ భూమి ఇచ్చే అంశంపై కలెక్టర్లతో చర్చించినట్లు తెలిసింది. సంక్షేమ పథకాల అమలు బాధ్యత కలెక్టర్లదేనని కేసీఆర్ చెప్పారు.

ఎస్సీ, ఎస్టీ సబ్ ప్లాన్ ను, మైనారిటీల కోసం రూపొందించిన పథకాలను పకడ్బందీగా అమలు చేయాలని ముఖ్యమంత్రి కేసీఆర్ కలెక్టర్లను ఆదేశించారు. వర్షాకాలంలో కలెక్టర్లు అప్రమత్తంగా ఉండాలని, వర్షం వల్ల ప్రజలకు ఇబ్బందులు కలిగితే వెంటనే స్పందించాలని సూచించారు. అంటువ్యాధులు ప్రబలకుండా వైద్య సిబ్బంది అప్రమత్తంగా ఉండాలని కోరారు. ఖరీఫ్ సీజన్ లో మార్కెటింగ్, వ్యవసాయ శాఖ అధికారులు రైతులకు నాణ్యమైన విత్తనాలు అందజేసేందుకు తగిన చర్యలు తీసుకోవాలని సీఎం ఆదేశించారు.

సమావేశానికి హాజరైన భారీ నీటిపారుదల శాఖ మంత్రి టీ హరీష్ రావు మాట్లాడుతూ, వర్షపు నీటిని నిలువచేసేందుకు పెద్ద ఎత్తున చర్యలు తీసుకుంటున్నామని, వర్షపు నీటిని వృధా కాకుండా చూడాలని కలెక్టర్లకు సూచించారు. పురాతన చెరువులు, పనికిరాకుండా పడి ఉన్న కుంటలను పూడిక తీయించి వాటిలో నీటిని నిలువచేసేలా చూడాలని పేర్కొన్నారు. ఇలా చేయడంవల్ల భూగర్భ నీటిమట్టం పెరిగి రైతులకు ఉపకరిస్తుందని తెలిపారు.

ఇదిలా ఉండగా సీఎం కేసీఆర్ రేపు సాయంత్రం ఢిల్లీ బయలుదేరి వెళ్లనున్నారు. ఎల్లుండి ప్రధాని మోడీతో పాటు కేంద్ర హోంమంత్రి రాజ్ నాథ్ సింగ్ ను కలవనున్నారు. మరోవైపు ప్రభుత్వం ఇచ్చిన ఆదేశాల ప్రకారం గురుకుల ట్రస్ట్ భూముల్లో కట్టిన అక్రమ కట్టడాల కూల్చివేత కొనసాగుతోంది. పోలీసుల ఆధ్వర్యంలో జీహెచ్ఎంసీ అధికారులు అక్రమ కట్టడాలను కూల్చివేస్తున్నారు. ఇప్పటివరకు 21 అక్రమ కట్టడాలను గుర్తించి కూల్చివేత ప్రారంభించారు. ఇంకా గుర్తింపు కార్యక్రమం కొనసాగుతూనే ఉంది. గవర్నర్ నరసింహన్ తో కూడా సీఎం కేసీఆర్ భేటీ అయ్యి నదీ జలాల వివాదంపై చర్చించినట్లు తెలిసింది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *