mt_logo

రాష్ట్రంలో మొదలైన ఉద్యోగ నోటిఫికేషన్ల పర్వం… 16 వేల పైచిలుకు ఉద్యోగాలకు పోలీసుశాఖ నోటిఫికేషన్

రాష్ట్రంలో ఖాళీగా ఉన్న 80వేల పైచిలుకు ప్రభుత్వ ఉద్యోగాలను భర్తీ చేయనున్నామని సీఎం కేసీఆర్‌ అసెంబ్లీలో ప్రకటించిన నేపథ్యంలో మొదటగా పోలీసుశాఖలోని వివిధ విభాగాల్లో 16,614 పోస్టుల భర్తీకి సోమవారం నోటిఫికేషన్‌ జారీచేసింది. ఇందులో ఎస్సై పోస్టులు 587 కాగా, కానిస్టేబుల్‌ పోస్టులు 16,027 ఉన్నాయి. ఈ పోస్టుల భర్తీకి రాష్ట్ర స్థాయి పోలీస్‌ నియామక మండలి చైర్మన్‌ వీవీ శ్రీనివాసరావు నాలుగు వేర్వేరు నోటిఫికేషన్లు జారీచేశారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత ఇది రెండో అతిభారీ నోటిఫికేషన్‌ కావడం గమనార్హం. 2018లో 18వేల పైచిలుకు పోలీసు పోస్టులు భర్తీ చేయగా, మరోమారు దాదాపు అదేస్థాయిలో 16,614 పోస్టులను భర్తీ చేసేందుకు సిద్ధమవుతున్నారు. ఎస్సై పోస్టుల్లో 414 సివిల్‌ కాగా, కానిస్టేబుల్‌ పోస్టుల్లో అత్యధికంగా టీఎస్‌ఎస్పీలో 5,010, సివిల్‌లో 4,965, ఏఆర్‌లో 4,423 ఖాళీలను భర్తీ చేయనున్నారు. నోటిఫికేషన్‌లో పేర్కొన్న విధంగా అర్హతలున్న అభ్యర్థులను ఆన్‌లైన్‌లో ఎంపికచేసి ప్రాథమిక అర్హత పరీక్ష నిర్వహించనున్నట్టు, పోలీస్‌ ఉద్యోగాల భర్తీకి ఆన్‌లైన్‌ దరఖాస్తుల స్వీకరణ మే 2 నుంచి ప్రారంభం అవుతుందని టీఎస్‌ఎల్పీఆర్బీ చైర్మన్‌ వీవీ శ్రీనివాసరావు తెలిపారు. మే 20 వరకు అర్హులైన అభ్యర్థులు ‘www.tslprb.in’ వెబ్‌సైట్‌లో దరఖాస్తు చేసుకోవచ్చని పేర్కొన్నారు. దరఖాస్తు చేసుకొనే అర్హులైన అభ్యర్థులకు ఒక యూజర్‌నేమ్‌, పాస్‌వర్డ్‌ కేటాయిస్తారు. ప్రక్రియ పూర్తయ్యేవరకు అదే యూజర్‌నేమ్‌, పాస్‌వర్డ్‌ను వినియోగించుకోవాల్సి ఉంటుంది.

వయోపరిమితి పెంపుతో కొత్త ఆశలు :

అభ్యర్థులకు గరిష్ఠ వయోపరిమితిని ప్రభుత్వం మూడేండ్లు పెంచింది. దీంతో పోలీస్‌ ఉద్యోగార్థుల్లో నూతన ఉత్సాహం కనిపిస్తున్నది. ఎస్సై ఉద్యోగానికి దరఖాస్తు చేసుకొనేందుకు గతంలో గరిష్ఠ వయోపరిమితి 25 ఏండ్లు ఉండగా ఇప్పుడు 28 ఏండ్ల వరకు కూడా జనరల్‌ క్యాటగిరీ అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవచ్చు. అదేవిధంగా జనరల్‌ క్యాటగిరీలో కానిస్టేబుల్‌ ఉద్యోగానికి దరఖాస్తు చేసుకొనే అభ్యర్థుల గరిష్ఠ వయోపరిమితిని 22 ఏండ్ల నుంచి 25 ఏండ్లకు పెంచింది. ఇక రిజర్వేషన్లు వర్తించే వారికి (ఎస్సీ, ఎస్టీ, బీసీ) మరింత అదనపు వయోపరిమితి వర్తిస్తుంది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *