Mission Telangana

మీడియా సంస్థల్లో మహిళలపై వేధింపులు నిరోధించే కమిటీలు : ఎమ్మెల్సీ కవిత

బేగంపేటలోని టూరిజం ప్లాజాలో తెలంగాణ రాష్ట్ర మీడియా అకాడమీ ఆధ్వర్యంలో మహిళా జర్నలిస్టుల కోసం నిర్వహిస్తున్న రెండు రోజుల వర్క్‌షాప్‌ ముగింపు కార్యక్రమానికి ఎమ్మెల్సీ కవిత ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా కవిత మాట్లాడుతూ… న్యూస్‌ రాసే జర్నలిస్టులు కోర్‌ (క్రెడిబిలిటీ, ఆబ్జెక్టివిటీ, రెస్పాన్సిబిలిటీ,ఎథిక్స్‌) విలువలను పాటించడం ద్వారానే వార్తకు సంపూర్ణత చేకూరుతుందని, సమాజంలోవారికి గౌరవం పెరుగుతుందని ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత పేర్కొన్నారు. ఇంతమంది మహిళా జర్నలిస్టులు ఒక్క చోటికి రావడం అద్భుతమన్నారు. ఏ రంగమైనా మహిళలకు ఇబ్బందులు తప్పవని, అయినా ఏ మాత్రం వెరవకుండా నిబద్ధతగా ఉండాలన్నారు. మగవారి కన్న మనం 100 శాతం ఎక్కువ శ్రమ చేయాల్సిందే అన్నారు. మనం తక్కువోల్లం కాదు..సానా గొప్పోల్లం..ఇదే స్ఫూర్తితో పట్టుదలగా విధి నిర్వహణలో సెన్సిటివిటీగా ఉండాలని ఎమ్మెల్సీ కవిత సూచించారు. ముఖ్యమంత్రి కేసీఆర్‌తో మాట్లాడి కొత్తగా నిర్మాణమవుతున్న సెక్రటేరియట్‌లో మహిళా జర్నలిస్టులకు ప్రత్యేక గదిని కేటాయించేలా కృషి చేస్తానని కవిత హామీనిచ్చారు. అలాగే సమాచార పౌర సంబంధాల శాఖ కమిషనర్‌తో మాట్లాడి మీడియా సంస్థల్లో మహిళలపై వేధింపులు, వివక్షను నిరోధించే కమిటీలు వేయించేందుకు ప్రయత్నిస్తా అన్నారు. అంతేకాదు జర్నలిస్టులకు సంబంధించిన కమిటీలలో ఆడవారి ప్రాతినిధ్యం లేదని అర్థమవుతోందని, ఇకపై వారి ప్రాతినిధ్యం ఉండేలా జాగ్రత్తపడాలని అకాడమీ చైర్మెన్ అల్లం నారాయణకు సూచించారు. ఏప్రిల్‌ 23, 24 తేదీల్లో ఈ వర్క్‌షాప్‌లో ముగింపు సమావేశంలో విద్యావేత్త, ఎమ్మెల్సీ వాణీదేవి మాట్లాడుతూ జనాన్ని జాగృతం చేయగలిగే సత్తా ఒక్క జర్నలిస్టులకే ఉందని, ఆ వైపుగా మహిళా జర్నలిస్టులు చేస్తున్న కృషి సంతోషంగా ఉందని కొనియాడారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *