ప్రతి ఇంటికీ స్వచ్ఛమైన తాగునీరు అందించాలనే లక్ష్యంతో రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన తెలంగాణ డ్రింకింగ్ వాటర్ ప్రాజెక్టు(జలహారం) పై ఆదివారం ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్ రావు సమీక్ష జరిపారు. సుమారు నాలుగు గంటలపాటు జరిగిన ఈ సమావేశంలో ఈ పథకానికి సంబంధించి ఇన్ టేక్ వెల్ టెండర్లు, సర్వే పనులు, భూసేకరణ, వివిధ శాఖల నుండి రావలసిన అనుమతులపై చర్చించారు. జలహారం పథకాన్ని మూడేళ్ళలో పూర్తిచేయాలని సీఎం కేసీఆర్ అధికారులను ఆదేశించారు.
ఆరు గ్రిడ్లకు భూ సర్వే పూర్తి అయిందని, మరో 20 గ్రిడ్ల సర్వే పనులు మార్చి 15వ తేదీ నాటికి పూర్తి చేస్తామని అధికారులు సీఎంకు తెలిపారు. ఇన్ టేక్ వెల్ లకు సంబంధించి టెక్నికల్ టెండర్లు పూర్తయినట్లు, ఐదు కంపెనీలు టెండర్లు వేశాయని, వాటిని రెండు రోజుల్లో తెరవనున్నట్లు సీఎంకు వివరించారు. టెండర్లు పూర్తయిన వెంటనే ఇన్ టేక్ వెల్స్ నిర్మాణాలను ప్రారంభించాలని సీఎం అధికారులను ఆదేశించినట్లు సమాచారం. ఇదిలాఉండగా జలహారం పైలాన్ ను రాష్ట్రపతి లేదా ప్రధానమంత్రితో ఆవిష్కరింపజేయాలని ప్రభుత్వం భావిస్తున్నది. ఈ సమావేశంలో పంచాయితీ రాజ్ శాఖామంత్రి కేటీఆర్, సీఎస్ రాజీవ్ శర్మ, సీఎంవో ముఖ్యకార్యదర్శి నర్సింగరావు, ఆర్ డబ్ల్యూఎస్ ఇంజినీర్–ఇన్-చీఫ్ సురేందర్ రెడ్డి, పంచాయితీ రాజ్ ముఖ్యకార్యదర్శి జే రేమండ్ పీటర్ తదితరులు పాల్గొన్నారు.