తెలంగాణ ఉద్యమంలో సీమాంధ్ర వస్తు బహిష్కరణ అనేది చాలా తరచూ వినవచ్చే ఒక ఉద్యమ రూపం. దీనికో నేపధ్యం ఉంది.
తెలంగాణ ప్రాంతంలోని అనేక వ్యాపార రంగాలలో సీమాంధ్రులదే ఆధిపత్యం. ఇక్కడి ప్రజల నుండి, సహజ వనరుల నుండి లాభపడుతున్న అనేక సీమాంధ్ర సంస్థలు, వాటి యజమానులు మాత్రం తెలంగాణ రాష్ట్ర ఉద్యమానికి వ్యతిరేకం.
విద్య నుండి వైద్యం వరకూ, మీడియా నుండి సినిమా వరకు, రోడ్డు కాంట్రాక్టుల నుండి మైనింగ్ కాంట్రాక్టుల వరకూ అన్నిటా సీమాంధ్ర సంపన్న వర్గాలదే పైచేయి.
సీమాంధ్ర దోపిడీ వర్గాల వ్యాపారాలను దెబ్బతీయడం ద్వారా ఈ ప్రాంతంపై వారి పట్టును సడలించి రాష్ట్ర సాధనకు మార్గం సుగమం చేయాలనేది తెలంగాణ ప్రజల ప్రయత్నం. ఈ దిశగా ప్రయత్నాలు కొనసాగుతున్నాయి.
ఈ సందర్భంగా “మేమేమైనా వేరే దేశస్తులమా మా వ్యాపారాలు బహిష్కరించడానికి” అని మొన్నో సీమాంధ్ర నేత ఓండ్ర పెట్టాడు. అతగాడికి కొంచెం వారి చరిత్ర గుర్తుచేయదలిచాం.
1973లో జై ఆంధ్ర ఉద్యమం జోరుగా సాగుతున్న వేళ తెలంగాణలో తయారైన వస్తువులను బహిష్కరించాలని పిలుపునిచ్చింది అక్కడి ఉద్యమ నాయకత్వం. ఆ జాబితాలో పెద్దగా వస్తువులేమీ లేక వజీర్ సుల్తాన్ టోబాకో కంపెనీ (VST) తయారుచేసే చార్మినార్ సిగిరెట్లను నిషేదించారు.
ఆ నిషేధాజ్ఞలు అమలు చేయడానికి పాన్ షాపులపై దాడి చేయడం నుండి మొదలుపెట్టి VST సిగిరెట్ ఫ్యాక్టరీ లారీలను దగ్ధం చేయడం వంటి పనులు చేసే వారు ఆంధ్ర ఉద్యమకారులు.
దానికి సంబంధించిన క్లిప్పింగ్ ఇక్కడ చదవండి.
—
(5-2-1973 విశాలాంధ్ర దినపత్రిక నుండి)
—
సీమాంధ్ర ప్రాంతం పై, అక్కడి ఉద్యమంపై తటస్థంగా ఉన్న వజీర్ సుల్తాన్ టోబాకో వంటి తెలంగాణ కంపెనీపై జై ఆంధ్ర ఉద్యమకారులు అంత తీవ్రంగా విరుచుకుపడితే, మరి అనుక్షణం తెలంగాణ ఉద్యమాన్ని వ్యతిరేకిస్తూ, అవమానిస్తూ, రాష్ట్ర ఏర్పాటును అడ్డుకుంటున్న బడా సీమాంధ్ర వ్యాపార సంస్థలపై తెలంగాణ ప్రజలు ఏ విధంగా తిరగబడగలరో ఊహించుకోవాల్సిందే …