mt_logo

ఐటీ శాఖ వార్షిక నివేదిక విడుదల చేసిన ఐటీ మంత్రి కేటీఆర్..

బేగంపేటలోని హరిత ప్లాజాలో మంగళవారం రాష్ట్ర ఐటీ మంత్రి కేటీఆర్ ఐటీ శాఖ వార్షిక నివేదికను విడుదల చేశారు. ఈ కార్యక్రమంలో ఐటీ శాఖ కార్యదర్శి జయేష్ రంజన్, డిజిటల్ మీడియా డైరెక్టర్ కొణతం దిలీప్, డైరెక్టర్-ఎలక్ట్రానిక్స్ సుజయ్ కారంపూరి, అమర్ నాథ్ రెడ్డి ఆత్మకూరి తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా మంత్రి కేటీఆర్ మాట్లాడుతూ, రాష్ట్రంలో ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ, దాని అనుబంధ రంగాల విస్తరణే లక్ష్యంగా కృషి చేస్తున్నట్లు, 2013-14 లో ఐటీ ఎగుమతులు 57,258 కోట్ల డాలర్లు ఉంటే, ప్రస్తుత ఏడాది అవి 66,276 డాలర్లకు చేరిందని, ఇది జాతీయ సగటుకంటే 2.7 శాతం అధికమని అన్నారు. వచ్చే నాలుగేళ్ళలో ఎగుమతులను 1,24,000 డాలర్లకు చేర్చడమే లక్ష్యమని, 2013-14లో 3,23,396 మందికి ఐటీ రంగంలో ఉపాధి లభించగా, 2014-15లో 3,71,774 మందికి ఉపాధి లభించిందని తెలిపారు.

హార్డ్ వేర్ రంగంతో పాటు మాన్యుఫాక్చరింగ్ రంగంపై కూడా దృష్టి సారించినట్లు మంత్రి చెప్పారు. మహేశ్వరం, శంషాబాద్ సమీపంలోని రెండు క్లస్టర్లలోని 1000 ఎకరాల్లో సోలార్ ప్యానెళ్ళు, చిప్ తయారీ, ఎల్ఈడీలు, మొబైల్ తయారీ కేంద్రాల ఏర్పాటుకు సిద్ధంగా ఉన్నామని కేటీఆర్ అన్నారు. భవిష్యత్తులో ఐటీ ఆధారిత పరిశ్రమలైన ఫొటోనిక్స్, ఇంటర్నెట్ ఆఫ్ థింగ్స్, సైబర్ సెక్యూరిటీ తదితరాలను అందిపుచ్చుకోవాలని నిర్ణయం తీసుకున్నామన్నారు. డిజిటల్ తెలంగాణలో భాగంగా వాటర్ గ్రిడ్ ప్రాజెక్టుతో సమాంతరంగా లక్ష కిలోమీటర్ల పైపులైన్లు వేసేందుకు సిద్ధమయ్యామని, అమెరికా పర్యటన ద్వారా హైదరాబాద్ కు అంతర్జాతీయ స్థాయి గుర్తింపు తీసుకొచ్చామని మంత్రి పేర్కొన్నారు.

టీ హబ్ లోగో, వెబ్ సైట్ ను, పర్యాటక భవన్ లో టూరిజం శాఖ ఏర్పాటు చేసిన ఫుడ్ ఫెస్టివల్ ను, చార్మినార్ వద్ద ఉచిత వై ఫై సేవలను కూడా మంత్రి కేటీఆర్ ఆవిష్కరించారు. టీ హబ్ లోగోను ఆవిష్కరించిన అనంతరం కేటీఆర్ మాట్లాడుతూ, కేంద్రమంత్రి రవిశంకర్ ప్రసాద్ అమెరికా నుండి వచ్చిన వెంటనే టీ హబ్ ను ఆవిష్కరిస్తామని, అమెరికాలోని సిలికాన్ వ్యాలీలో కూడా టీ హబ్ బ్రాంచ్ ను ఏర్పాటు చేస్తామని చెప్పారు. హైదరాబాదీలే కాకుండా ఎవరైనా టీ హబ్ ను కేంద్రంగా చేసుకునేలా రూపొందిస్తామన్నారు. మంగళవారం పర్యాటక భవన్ లో ఏర్పాటు చేసిన ఫుడ్ ఫెస్టివల్ ను ప్రారంభించిన అనంతరం మంత్రి కేటీఆర్ మాట్లాడుతూ, రాష్ట్రంలో పర్యాటక రంగ అభివృద్ధికి గొప్ప అవకాశాలు ఉన్నాయని రూ. 350 కోట్లతో టూరిజంలో మౌలిక సదుపాయాల కల్పనకు కృషి జరుగుతున్నదని, నోరూరించే రుచులకు, వంటలకు తెలంగాణ ప్రత్యేకతను కలిగిఉన్నదని అన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *