mt_logo

జూలైలో 25వేల పోస్టుల భర్తీ- సీఎం కేసీఆర్

తెలంగాణ రాష్ట్ర తొలి ఆవిర్భావ వేడుకలు మంగళవారం పరేడ్ గ్రౌండ్స్ లో అట్టహాసంగా జరిగాయి. ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్ రావు ఉదయం 9.30గంటలకు జాతీయ జెండా ఎగురవేసి ఈ ఉత్సవాలను ప్రారంభించారు. పోలీసుల గౌరవ వందనాన్ని స్వీకరించిన అనంతరం తెలంగాణ సాంస్కృతిక సారథి ఆధ్వర్యంలో జరిగిన కవాతును, వివిధ శాఖలు రూపొందించిన శకటాల ప్రదర్శనను తిలకించారు. అనంతరం వివిధ రంగాల్లో విశిష్ట సేవలు అందించిన ప్రముఖులకు పురస్కారాలతో సత్కరించారు.

ఈ సందర్భంగా సీఎం మాట్లాడుతూ, మన నిరుద్యోగ సోదరులు ఎన్నో ఏండ్లుగా ఉద్యోగాలు రావాలని ఎదురుచూస్తున్నారని, వారిని ఎక్కువ కాలం నిరీక్షణకు గురిచేయకుండా జూలై నెలలో 25వేల ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్లు జారీ చేస్తున్నట్లు ప్రకటించారు. అంతేకాకుండా ఈనెల నుండే కాంట్రాక్టు ఉద్యోగుల క్రమబద్దీకరణ ప్రారంభించి ఏడాదిలోగా పూర్తి చేస్తామని చెప్పారు. పాలమూరు-రంగారెడ్డి ఎత్తిపోతలు, కాళేశ్వరం పథకాలకు త్వరలో శంకుస్థాపన చేస్తామని, రెండు పడక గదుల గృహ నిర్మాణాన్ని ఈ సంవత్సరం ప్రారంభిస్తున్నట్లు తెలిపారు. వచ్చే నెలనుండి హరితహారం భారీ ఎత్తున చేపట్టబోతున్నట్లు సీఎం వెల్లడించారు.

గతంలో తెలంగాణ రాష్ట్రం ఏర్పడితే ఎన్నో ఇబ్బందులు వస్తాయని, తెలంగాణ రాష్ట్రం అంధకారం అవుతుందని వచ్చిన అసత్య ప్రచారాలను తిప్పికొడుతూ తెలంగాణ ప్రభుత్వం మీ అందరి ఆశీస్సులతో కేవలం అరేడునెలల కాలంలోనే విద్యుత్తు వెలుగులు విరజిమ్మేలా ముందుకు పోతున్న విషయం మీకందరికీ తెలుసని కేసీఆర్ అన్నారు. రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికే రూ. 91 వేల కోట్ల పెట్టుబడులను సమీకరించడం జరిగిందని, నల్లగొండ జిల్లా దామరచర్లతో పాటు కొత్తగూడెం, మణుగూరుల్లో విద్యుత్తు ఉత్పత్తి కర్మాగారాలు ఏర్పాటు చేస్తున్నామన్నారు. దేశంలోనే అతిపెద్ద అల్ట్రా మెగా పవర్ ప్లాంట్ నల్గొండ జిల్లాలో సాకారం కాబోతుందని, దామరచర్లలో ఈనెలలోనే శంకుస్థాపన చేయబోతున్నానని, 2018 నాటికల్లా తెలంగాణలో ఎవ్వరికైనా, ఏ రంగానికైనా 24గంటల నిరంతరాయ విద్యుత్తు సరఫరా జరుగుతుందని సీఎం హామీ ఇచ్చారు.

పేదల సంక్షేమం కోసం అనేక అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలను రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిందని, ఆరోగ్యలక్ష్మి, కళ్యాణ లక్ష్మి, షాదీ ముబారక్, ఆరుకిలోల బియ్యం, విద్యార్థులకు సన్నబియ్యం, వృద్ధులకు, వితంతువులకు రూ. 1000, వికలాంగులకు రూ. 1500 పించన్లు ఇస్తున్నామని, బీడీ కార్మికులకు రూ. వెయ్యి రూపాయల జీవనభ్రుతి ఇస్తూ దేశ చరిత్రలో ఎక్కడాలేని విధంగా రూ. 28వేల కోట్లను కేవలం సంక్షేమం మీద రాష్ట్ర ప్రభుత్వం ఖర్చు పెడుతుందని సీఎం పేర్కొన్నారు. అంతేకాకుండా గత చరిత్రలో ఎన్నడూలేని విధంగా రైతు సోదరులకు రూ. 17వేల కోట్ల రుణ మాఫీని ప్రకటించి అమలు చేస్తున్నామని, రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు 43శాతం ఫిట్ మెంట్, ఆర్టీసీ కార్మికులకు 44శాతం ఫిట్ మెంట్ ఇచ్చిన విషయం మీకు తెలిసిందేనని, అంగన్ వాడీ కార్యకర్తలకు, హోం గార్డు మిత్రులకు కూడా వేతనాలు పెంచామని అన్నారు.

రాష్ట్ర ప్రభుత్వం శాంతిభద్రతలకు ప్రాధాన్యమిస్తుందని, రూ. 400 కోట్లతో పోలీసు వ్యవస్థను ఆధునీకరించిందని అన్నారు. మహిళల రక్షణకోసం షీ టీమ్స్ ను ఏర్పాటు చేయడం జరిగిందని, రూ. 20 వేల కోట్లతో ఆర్అండ్ బీ, పంచాయితీ రాజ్ పరిధిలోని రోడ్లను అభివృద్ధి చేస్తున్నామని చెప్పారు. రాష్ట్ర ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా చేపట్టిన మిషన్ కాకతీయ, వాటర్ గ్రిడ్ కార్యక్రమాలు అద్భుతంగా ముందుకు పోతున్నాయని సీఎం కేసీఆర్ పేర్కొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *