mt_logo

మే 5న అమెరికా పర్యటనకు వెళ్లనున్న మంత్రి కేటీఆర్..

ఐటీ, పంచాయితీ రాజ్ శాఖామంత్రి కేటీఆర్ మే 5న అమెరికా పర్యటనకు వెళ్లనున్నారు. తెలంగాణ రాష్ట్రంలో ఐటీ కంపెనీల ఏర్పాటు, ప్రవాస భారతీయుల పెట్టుబడులు, విదేశీ కంపెనీల ఏర్పాటు తదితర అంశాలపై మంత్రి చర్చించనున్నారు. రెండు వారాల పాటు సాగనున్న ఈ పర్యటనలో మంత్రి అమెరికాలో పలు సంస్థలు నిర్వహించే కార్యక్రమాలతో పాటు భారత రాయబారి అరుణ్ సింగ్ తో కలిసి ప్రత్యేక విందుకు హాజరుకానున్నారు. జాతీయ స్థాయిలో ఐటీ శాఖకు ప్రత్యేక గుర్తింపు తెస్తూ పారిశ్రామిక వర్గాలను ఆకట్టుకున్న మంత్రి కేటీఆర్ రాష్ట్ర ఐటీ శాఖను మరింత అభివృద్ధి చేసేందుకే ఈ అమెరికా పర్యటన అని ఉన్నతాధికారులు తెలిపారు.

దేశంలో ఏ రాష్ట్రం అందించని విధంగా సెల్ఫ్ డిక్లరేషన్ తో అనుమతులు పొందే అవకాశం, నిర్ణీత గడువులోగా సింగిల్ విండో ద్వారా పరిశ్రమలకు అనుమతి లభించేలా రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన నూతన పారిశ్రామిక విధానం తదితర అంశాలను మంత్రి అమెరికా పెట్టుబడిదారులకు వివరించనున్నారు. ఫార్మా, ఐటీ, ఏరోస్పేస్, డిఫెన్స్, ఎలక్ట్రానిక్స్ తదితర రంగాలకు చెందిన సంస్థలనుండి పెట్టుబడులు ఆకర్షించే విధంగా మంత్రి అమెరికా పర్యటన ఉండబోతోంది. అమెరికాలోని వాషింగ్టన్ డీసీ, డల్లాస్, పిట్స్ బర్గ్, న్యూయార్క్, ఇతర ప్రాంతాల్లో ఏర్పాటు చేసే వివిధ సమావేశాల్లో పాల్గొంటారని తెలిసింది. బంగారు తెలంగాణ నిర్మాణంలో ప్రవాస భారతీయుల భాగస్వామ్యం-పాత్ర పైన వారితో మంత్రి చర్చించనున్నారు. మంత్రి కేటీఆర్ వెంట ఐటీ శాఖ కార్యదర్శి జయేష్ రంజన్, ఇతర ఉన్నతాధికారులు ఈ పర్యటనకు వెళ్లనున్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *