mt_logo

ముఖ్యమంత్రి కేసీఆర్ ను ప్రశంసించిన కేంద్ర మంత్రి పీయూష్..

మొన్నటిదాకా తీవ్ర విద్యుత్ కొరతలు ఎదుర్కుంటూ వస్తున్న తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం నేడు వేసవిలో సైతం విద్యుత్ కొరత లేకుండా పరిపాలన సాగిస్తున్నది.. ఇది చాలా అభినందించదగ్గ విషయమని కేంద్ర విద్యుత్ శాఖామంత్రి పీయూష్ గోయల్ అన్నారు. వివిధ మార్గాల ద్వారా విద్యుత్ ను కొనుగోలు చేయడంతో పాటు సమర్ధవంతమైన విధానాన్ని అవలంభించడం ద్వారా తెలంగాణ ప్రజలకు ఎటువంటి ఇబ్బందులు లేకుండా, నిరంతరాయంగా విద్యుత్ ఇవ్వడం సాధ్యమైందని, ఇది ఆహ్వానించదగ్గ పరిణామమని, ప్రతి రాష్ట్రం ఇలాంటి విధానాన్నే అమలు చేయాలని మంత్రి సూచించారు. తెలంగాణలో నిరంతర విద్యుత్ సరఫరాకు కారణమైన ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్ రావును మంత్రి పీయూష్ గోయల్ గురువారం లోక్ సభలో విద్యుత్ అంశంపై జరిగిన చర్చలో అభినందించారు.

గురువారం లోక్ సభలో ఎంపీ కొండా విశ్వేశ్వర్ రెడ్డి విద్యుత్ పై లేవనెత్తిన అంశంపై మంత్రి పీయూష్ మాట్లాడుతూ, విద్యుత్ సరఫరా చేయాలని చాలా రాష్ట్రాలనుండి తనకు విజ్ఞప్తులు వస్తున్నాయని, దేశంలో చాలా ప్రాంతాలలో మిగులు విద్యుత్ ఉన్నందున రాష్ట్రాలు దీర్ఘకాలిక ప్రాతిపదికన విద్యుత్ కొనుగోలు ఒప్పందాలు కుదుర్చుకోవడం అవసరమని అన్నారు. కానీ చాలా రాష్ట్రాలు ఈ పని చేయడం లేదని, ప్రజలకు నిరంతర విద్యుత్ అందించడంపై దృష్టి పెట్టడం లేదని, తెలంగాణ ప్రభుత్వం ఒక్కో యూనిట్ ను రూ.8 పెట్టి కొనుగోలు చేస్తున్నదని మంత్రి పేర్కొన్నారు. హైదరాబాద్ నగరానికి విద్యుత్ సరఫరా చేయాలన్న ఉద్దేశంతో శంకర్ పల్లి గ్యాస్ ఆధారిత విద్యుత్ కేంద్రం ఏర్పాటు అయ్యిందని, అయితే దేశంలో ప్రస్తుతం గ్యాస్ కొరత ఉన్నందున కొత్త కేంద్రాలకు సరఫరా చేయడంలో అనేక ఇబ్బందులున్నాయని, ఈ పరిస్థితిని దృష్టిలో పెట్టుకుని పూర్తిగా పనిచేయకుండా ఉన్న శంకర్ పల్లి గ్యాస్ ఆధారిత విద్యుత్ కేంద్రానికి కనీసం 25 నుండి 30 శాతం వరకు గ్యాస్ సరఫరా చేస్తామని పీయూష్ గోయల్ హామీ ఇచ్చారు.

అంతకుముందు ఎంపీ విశ్వేశ్వర్ రెడ్డి మాట్లాడుతూ దాదాపుగా మూడు దశాబ్దాల తర్వాత మొదటిసారి తెలంగాణలో వేసవిలో విద్యుత్ కొరత లేకుండా 24 గంటలూ సరఫరా చేస్తున్న పరిస్థితిని చూస్తున్నామని, ముఖ్యమంత్రి కేసీఆర్ దూరదృష్టితో అలోచించి ఇతర వనరుల నుండి విద్యుత్ కొనుగోలు చేయడమే ఇందుకు కారణమని తెలిపారు. తీవ్ర విద్యుత్ కొరత ఉన్నా, పొరుగు రాష్ట్రంతో కరెంట్ కొనుగోలు ఒప్పందాలతో అన్యాయం జరిగినా, రాష్ట్ర ప్రజలకు, పరిశ్రమలకు నిరంతర విద్యుత్ అందించడంలో ఎంతో కృషి చేస్తున్నారని, ఇటీవల మెర్సర్ అనే సంస్థ నిర్వహించిన సర్వేలో అంతర్జాతీయ స్థాయిలో హైదరాబాద్ నగరం తొలిస్థానంలో నిలిచిందని, ఇదే పరిస్థితి భవిష్యత్తులోనూ కొనసాగాలని ప్రభుత్వం కోరుకుంటుందని విశ్వేశ్వర్ రెడ్డి చెప్పారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *