ఢిల్లీ పర్యటనలో ఉన్న రాష్ట్ర ఐటీ మంత్రి కేటీఆర్ ఈరోజు ఉదయం కేంద్ర పట్టణాభివృద్ధి శాఖామంత్రి వెంకయ్యనాయుడును కలిశారు. అనంతరం మంత్రి మీడియాతో మాట్లాడుతూ నగరంలో జరిగే అంతర్జాతీయ సదస్సుకు రావాల్సిందిగా వెంకయ్యనాయుడిని ఆహ్వానించామని, ఆయనతో రహస్యంగా చర్చలు జరపలేదని, జరిగిందేంటో ప్రపంచమంతటికీ తెలుసన్నారు. టీడీపీ నేతలకు పనిలేక, పొద్దుపోక మాపై విమర్శలు చేస్తున్నారు. ఓటుకు నోటు వ్యవహారంలో చట్టం తన పని తాను చేసుకుపోతుంది.. అభివృద్ధే లక్ష్యంగా టీఆర్ఎస్ ప్రభుత్వం ముందుకెళ్తుందని మంత్రి చెప్పారు. హైదరాబాద్ లో ప్రజలు అన్నదమ్ముల్లా కలిసిమెలిసి ఉన్నారని, గతంలో విమర్శలు చేసినవారికి ఇది చెంపపెట్టులాంటిదని కేటీఆర్ పేర్కొన్నారు.
అనంతరం హడ్కో చైర్మన్ రవికాంత్ తో మంత్రి కేటీఆర్ భేటీ అయ్యి రాష్ట్ర ప్రభుత్వం చేపడుతున్న పథకాలను వివరించారు. రాష్ట్ర ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా చేపడుతున్న తాగునీటి పథకానికి రూ. 25 వేల కోట్లు మంజూరు చేయాల్సిందిగా విజ్ఞప్తి చేశారు. తర్వాత కేంద్రమంత్రి నితిన్ గడ్కరీతో భేటీ అయ్యి రాష్ట్రంలో రోడ్ల నిర్మాణం తదితర అభివృద్ధి కార్యక్రమాలపై కేటీఆర్ చర్చించారు.