mt_logo

గంగదేవిపల్లిలో గ్రామజ్యోతి పథకాన్ని ప్రారంభించిన సీఎం..

రాష్ట్ర ప్రభుత్వం అత్యంత ప్రతిష్ఠాత్మకంగా తలపెట్టిన గ్రామజ్యోతి పథకాన్ని ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్ రావు ఈరోజు వరంగల్ జిల్లా గంగదేవిపల్లిలో ప్రారంభించారు. అంతకుముందు సీఎం గంగదేవిపల్లికి చేరుకోగానే గ్రామస్తులు ఘనంగా స్వాగతం పలికారు. ఈ సందర్భంగా సీఎం గ్రామపంచాయితీ భవనాన్ని సందర్శించి అక్కడున్న రికార్డులను పరిశీలించారు. ఈ కార్యక్రమంలో డిప్యూటీ సీఎం కడియం శ్రీహరి, శాసనసభ స్పీకర్ మధుసూదనాచారి, ఎంపీ వినోద్, ఇతర టీఆర్ఎస్ నేతలు, అధికారులు పాల్గొన్నారు. పథకం ప్రారంభించిన అనంతరం సీఎం మాట్లాడుతూ మన బతుకులను మనం బాగుచేసుకుందామని తెలంగాణ రాష్ట్రాన్ని సాధించుకున్నామని, కష్టపడి తెచ్చుకున్న తెలంగాణను బాగు చేసుకుందామని సూచించారు. గంగదేవిపల్లి ఆదర్శ గ్రామాలకు చక్కటి ఉదాహరణ అని, ఈ ఊరి ప్రజలు కొన్ని నియమాలు పెట్టుకుని వాటికి కట్టుబడి ఉన్నారని ప్రశంసించారు.

గంగదేవిపల్లి ప్రజల స్ఫూర్తికి రెండు చేతులు జోడించి శిరస్సు వంచి నమస్కరిస్తున్నానని, ఈ ఊరి ప్రజలే తనను ఇక్కడకు రప్పించారని కేసీఆర్ అన్నారు. మీ ఊరికి అవార్డులు కూడా వచ్చాయని, గొప్ప సంస్కారం ఇక్కడి గ్రామస్తులకు ఉందని, ఎలాంటి వివాదం లేకుండా సరైన వేదికను ఏర్పాటు చేశారని అన్నారు. మాజీ సర్పంచ్ రాజమౌళిని ప్రత్యేకంగా ఆహ్వానించి హైదరాబాద్ లో జరిగిన సమావేశంలో ఉపన్యాసం ఇప్పించామని, తన హయాంలో ఆయన చేసిన పనుల అనుభవాలను రాజమౌళి వివరించారని సీఎం పేర్కొన్నారు. గంగదేవిపల్లి గ్రామాభివృద్ధికి రూ. 10 కోట్లు మంజూరు చేస్తున్నట్లు, రేపే ఈ జీవోను విడుదల చేస్తానని ఈ సందర్భంగా సీఎం ప్రకటించారు. ఈ ఊరికి ఇంకేం కావాలో గ్రామసభ పెట్టి మీరే నిర్ణయం తీసుకోండని, గ్రామంలో రెసిడెన్షియల్ పాఠశాలను ఏర్పాటు చేస్తామని సీఎం హామీ ఇచ్చారు.

గ్రామంలో ఇళ్లులేని వారికి డబుల్ బెడ్ రూమ్ ఇళ్ళు లేనివారికి ఇళ్ళు మంజూరు చేస్తామని, గ్రామంలో వంద కేవీ విద్యుత్ కేంద్రం ఏర్పాటుకు కృషి చేస్తామని సీఎం హామీ ఇచ్చారు. రాబోయే రోజుల్లో కాకతీయ కాలువలన్నీ నీటితో నిండిపోతాయని, బోర్లు, మోటార్లు అవసరం ఉంటే మంజూరు చేస్తామని చెప్పారు. గంగదేవిపల్లి ప్రజలు నిజామబాద్ జిల్లాలోని అంకాపూర్ గ్రామానికి వెళ్లి అక్కడి రైతులు సాధించిన అభివృద్ధిని చూసి రావాలని సూచించారు. 40 ఏళ్లలో అంకాపూర్ కు పోలీసులే రాలేదని, ఎలాంటి సమస్యలనైనా గ్రామస్తులే కలిసి పరిష్కరించుకుంటారన్నారు. అనంతరం సీఎం కేసీఆర్ గంగదేవిపల్లి నుండి బయల్దేరి వెళ్లి మేడిపల్లికి చేరుకొని గ్రామజ్యోతి కార్యక్రమంలో పాల్గొన్నారు. అనంతరం అక్కడ ఏర్పాటుచేసిన సభలో సీఎం ప్రసంగించారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *