Mission Telangana

ఇజం కాదు, హజం

By: కట్టా శేఖర్ రెడ్డి

ఇది ఇజం కాదు. నిజమూ కాదు. ఒక అస్తిత్వ ప్రకటనను, ఒక స్వేచ్ఛా ఉద్యమాన్ని, స్వయంపాలనాధికారాన్ని, ప్రజాస్వామిక ప్రక్రియను గుర్తించ నిరాకరించే హజం. దుగ్ధ, దుఃఖం, ఉక్రోషం. ఏడుపుల్లో తేడా లేదు గమనించండి. కిరణ్‌బాబు ఏడిచిందే చంద్రబాబు, జగన్‌బాబులు ఏడిచారు. వారందరూ ఏడిచిందే ఇప్పుడు పవన్ కల్యాణ్ ఏడిచాడు. అందరి ఏడుపు సారం ఒక్కటే. తెలంగాణ ఇవ్వడం వారికి నచ్చలేదు. తెలంగాణ ఏర్పాటు తెలుగుజాతికి ద్రోహం. జాతి సమగ్రతకు ద్రోహం. వారి ‘తెలుగుజాతి’లో తెలంగాణ ప్రజలు ఉండరు. వారి ‘జాతి సమగ్రత’లో తెలంగాణ సమగ్రత ఉండదు. వారి ఆత్మగౌరవంలో తెలంగాణ ఆత్మగౌరవం, ఆకాంక్షలు, ఆశయాలు ఉండవు. ఇచ్చిన తీరు నచ్చలేదన్నది ఒక సాకు మాత్రమే. అసలు ఇవ్వడమే నచ్చలేదన్నది వారి కడుపుమంటను చూస్తే అర్థమవుతుంది. మనుషులను దూరంగా చూసి అభిప్రాయాలు ఏర్పరచుకోగూడదు. ఒక్కోసారి దగ్గరగా చూసినా తొందరపడి ఒక అభిప్రాయానికి రాకూడదు. ‘ఆయనకేమైంది సార్ పిచ్చివాడిలా అలా ఊగిపోతున్నాడు’ అని టీవీ చూస్తున్న మిత్రుడు ప్రశ్నించాడు. నిజమే ఆయన ఒక్క నిమిషం కూడా కుదురుగా కదలకుండా ఉండలేడని ఆయన సినిమాలు చూసినా, ఆయన ప్రసంగాలు చూసినా అర్థమవుతుంది. ‘రాసుకొచ్చింది స్క్రిప్టే అయినా ఆయన నాయకుడి పాత్రలో ఎంతబాగా జీవిస్తున్నారో చూడండి’ అని మరో జర్నలిస్టు మిత్రుడి విసురు. నాకు మాత్రం ఎందుకో ఇవన్నీ జీర్ణించుకోవడం కష్టంగా ఉంది. ఆయన చేగువేరాను అభిమానిస్తాడని, గద్దర్ పాటలు ఇష్టపడతాడని, పుస్తకాలు బాగా చదువుతాడని చెబుతుంటే ఒకింత అభిమానం కలిగింది. అలనాడు అన్నపార్టీ సభల్లో ఆవేశంగా ప్రసంగిస్తుంటే మనిషిలో ఏదో శక్తి ఉంది అనిపించేది. సినిమాల్లో నటిస్తుంటే జీవిస్తున్నాడనిపించేది. అలా మొదలైన భావన…ఎక్కడి నుంచి ఎక్కడి దాకా. చేగువేరా నుంచి జగ్గారెడ్డిదాకా, గద్దర్, గాంధీల నుంచి నరేంద్రమోడి దాకా…. పొట్టవిప్పి చూసే దాకా తెలియదు…. ‘ఆకాశంబున నుండి శంబుని శిరంబందుండి….పవనాంధోలోకమున్’ దాకా ఆయనే కనిపించాడు. ‘పెక్కుభంగుల్ వివేక భ్రష్ట సంపాతముల్’ అని భర్తృహరి రాస్తే ఏమో అనుకున్నాం. ఇప్పుడు అనుభవం అవుతున్నది. పరీక్షా సమయం వచ్చినప్పుడే మనుషుల నిజస్వరూపాలు బట్టబయలవుతాయి.

ఏ విలువకూ కట్టుబడనివాడు అనేక విలువల గురించి మాట్లాడాడు. ఈయన ఇచ్చిన మాటకు నిలబడ్డాడా? తెలంగాణ రాష్ట్ర ఏర్పాటును సమర్థిస్తూ 2009 ఎన్నికల్లో శివమెత్తి ప్రసంగించిన పవన్ కల్యాణ్‌కు ఇప్పుడు ఆ మాట గుర్తున్నదా? ఆయన అన్న చిరంజీవి ఎప్పుడో మాట తప్పాడు. కానీ ఆయన పార్టీ నిర్ణయానికయినా కట్టుబడి కాంగ్రెస్‌లో ఉన్నాడు. ఈయన ఇంతకాలం మాట్లాడలేదు. బహుశా తెలంగాణకు వ్యతిరేకంగా ఉండడేమో అనుకున్నారు అంతా. కానీ తెలంగాణ ఇస్తుంటే ఆయన ఎంత కుమిలిపోయాడో, ఎంత కుళ్లుకున్నాడో ఆయనే తన ప్రసంగంలో వివరించాడు. నమ్మిన విలువలకోసం శ్వాస ఉన్నంతవరకు పోరాడతాడట. నిజమా? తెలంగాణ ఇస్తామని చెప్పింది-నమ్మి ఇచ్చిన విలువ కాదా సామీ? మీ అన్న తెలంగాణపై మాట మార్చినప్పుడు, పార్టీని కాంగ్రెస్ గంగలో కలుపుతున్నప్పుడు విలువలు ఏ షూటింగులో కమ్మేశావు సామీ? తమరు అప్పుడెప్పుడూ ఎందుకు మాట్లాడలేదు సామీ? తమకు అప్పుడప్పుడే ఎందుకు పూనకం వస్తుంది సామీ? తమరు తెలుగు ప్రజలను విడదీశారని నిజంగానే బాధపడుతున్నారా? బంధాలు, అనుబంధాల మీద మీకు నమ్మకం ఉందా సామీ? ఏ బంధాలను కాపాడారు సామీ మీరు? కనీసం మీ అన్నతమ్ముల అనుబంధాన్ని కాపాడావా సామీ? పాపం గాంధీగారు… నరేంద్ర మోడీయే మహాత్మాగాంధీగారిని వదిలేసి సర్దార్ వల్లభాయ్ పటేల్‌ను ఎత్తుకున్నారు. జాతి గుండెల్లో మహాత్ముడి స్థానాన్ని ఎలాగూ తగ్గించలేము కాబట్టి, పటేల్ స్థానాన్ని పెంచుదామని ఆయన కంకణం కట్టుకున్నాడు. దేశంలో ఏ నాయకుడికీ లేని మహోన్నత ఉక్కు విగ్రహాన్ని స్థాపించడానికి ఇనుపముక్కలు సేకరిస్తున్నాడు. గాంధీయిజంపై ఎంతమాత్రం నమ్మకంలేని నరేంద్రమోడీని కీర్తిస్తూ అదే నోటితో గాంధీయిజం గురించి మాట్లాడాడు ఈ బాబు. పరస్పర విఘాత, విరుద్ధ, వికల భావాల పుట్టగా దొరికిపోయాడు పవన్ కల్యాణ్. అర్థం అయ్యీ కాకుండా ఉండడం కంటే పూర్తిగా అర్థం అయితే అందరికీ మంచిది.

పవన్ కల్యాణ్ ఉపన్యాసం-2 విన్న తర్వాత మరోసారి అర్థం అయింది ఏమంటే, తెలంగాణ సాధించాల్సింది చాలా ఉంది. కొట్లాడాల్సింది మిగిలే ఉంది. పవన్ కల్యాణ్ ప్రసంగానికి రెండు రోజుల ముందు శ్రీమాన్ చంద్రబాబునాయుడు మహబూబ్‌నగర్‌లో మహోపన్యాసం చేశారు. తెలంగాణలో బీసీ రామబాణం వేశానని దానికి తిరుగులేదని ప్రకటించాడు. తెలంగాణను తానే అభివృద్ధి చేస్తానని కూడా చెప్పాడు. అక్కడ శ్రీకాకుళం వెళ్లి తెలుగుప్రజల మధ్య చిచ్చుపెట్టారని రొదపెట్టాడు. అంటే తెలంగాణ ఇప్పటికీ చంద్రబాబు చేతిలో విల్లుగానే ఉంది. తెలంగాణ నాయకులను ఇప్పటికీ తన అంబులపొదిలోని బాణాలుగానే భావిస్తున్నారు. ఆయన పార్టీకే చెందిన గాలి ముద్దుకృష్ణమ వంటి నాయకులు తమకు మళ్లీ అధికారం ఇస్తే తెలుగు ప్రజలను కలుపుతామని ప్రకటనలు చేస్తున్నారు. తనకు తాను చాల ఊహించుకుని జైసపా-జైసమైక్యాంధ్ర పార్టీ (జైసఫా అనకూడదు సుమా)ని స్థాపించిన మాజీ ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డి కూడా తెలుగు ప్రజలు తిరిగి ఒక్కటవుతారని చెబుతున్నాడు. తెలుగు ప్రజలు ఒక్కటి కావడం సంగతి దేవుడెరుగు… ఎవరయినా మిగులుతారో లేదో చెప్పే పరిస్థితిలో ఆయన లేరు. నిన్నమొన్నటి దాకా ఆయన పక్కన నిలబడి పోట్లెద్దుల్లా కాలుదువ్విన వీర సమైక్యాంధ్ర వాదులంతా చంద్రబాబు గూటికి చేరిపోతున్నారు. చివరికి ఈయన కూడా చంద్రబాబు మద్దతు కోరవలసి వస్తుందేమో తెలియదు. పవన్ కల్యాణ్ కూడా దాదాపు అలాగే మాట్లాడారు. ఇరవై యేళ్ల తర్వాత మళ్లీ వేర్పాటు ఉద్యమాలు రావని నమ్మకం ఏమిటి? అని ప్రశ్నించారు. సీమాంధ్ర రాజకీయ నాయకత్వం ఎంతగా కకావికలైపోయారో, ఎంతగా కలత చెందారో వారి స్పందనలు చూస్తే అర్థమవుతుంది. ఇది వారు తీసుకున్న గొయ్యే. వారు సృష్టించుకున్న భావ దారిద్య్రమే. ఇచ్చినమాటకు నిలబడలేని దివాలాకోరుతనం పర్యవసానమే. రాష్ట్ర విభజన అనివార్యతను సీమాంధ్ర ప్రజలకు వివరించి ప్రజాస్వామ్య బద్ధంగా వారికి నమ్మకం కలిగించలేకపోయిన చేతగానితనమే. అయినా తెలంగాణపై వారికి కక్ష ఉంది. తెలంగాణను ఆగం పట్టించే ఉద్దేశం ఉంది. తెలంగాణను తిరిగి చేజిక్కించుకోవాలన్న తపన ఉంది. తెలంగాణ ఒక స్వతంత్ర రాజకీయ శక్తిగా నిలబడకుండా చూసే కుట్ర ఉంది. అందుకు వారు ఏమైనా చేయడానికి సిద్ధపడతారు. ఆ విషయంలో అందరూ ఒక్కటవుతారు. వారిని ప్రతిఘటించే తెలంగాణ రాజకీయ శక్తి ఒకటి ఇక్కడ బలంగా నిలబడి ఉండాలి. తెలంగాణ ఎజెండాను అమలు చేయగల దమ్మున్న రాజకీయ శక్తులు బలపడాలి. అందుకు నిరంతర అప్రమత్తత అవసరం.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *