mt_logo

గ్రామాలను దత్తత తీసుకుంటున్న పలువురు ఐపీఎస్‌లు!

సీఎం కేసీఆర్ స్ఫూర్తితో గ్రామజ్యోతి పథకంలో భాగంగా పలువురు ప్రముఖులు గ్రామాలను దత్తత తీసుకుంటున్న విషయం తెలిసిందే. ఇదే కోవలో పలువురు ఐపీఎస్ లు గ్రామాలను దత్తత తీసుకోవడం ద్వారా అందరికీ ఆదర్శంగా నిలుస్తున్నారు. సోమవారం ఏసీబీ డీజీ ఏకే ఖాన్ రంగారెడ్డి జిల్లా శంషాబాద్ లోని జూకల్ గ్రామాన్ని దత్తత తీసుకుంటానని ఐటీ, పంచాయితీ రాజ్ శాఖామంత్రి కేటీఆర్ ను కలిసి వివరించిన సంగతి తెలిసిందే. శంషాబాద్ మండలంలోని జూకల్ గ్రామాన్ని దత్తత తీసుకున్న ఏకే ఖాన్ ఇప్పటికే రెండుసార్లు ఆ గ్రామంలో పర్యటించి సమస్యలను గుర్తించారు. ఏకే ఖాన్ సామాజిక స్పృహను అభినందించిన మంత్రి కేటీఆర్ వెంటనే పంచాయితీ రాజ్ కమిషనర్ అనితా రామచంద్రన్, రంగారెడ్డి జిల్లా కలెక్టర్ రఘునందన్ రావుకు ఫోన్ చేసి గ్రామాభివృద్ధి విషయంలో ఏకే ఖాన్ కు అన్నివిధాలుగా సహకరించాలని సూచించారు.

తాజాగా రైల్వే, రోడ్ సేఫ్టీ అదనపు డీజీపీ కృష్ణప్రసాద్ రంగారెడ్డి జిల్లా వికారాబాద్ మండలంలోని ఎర్రవెల్లి గ్రామాన్ని దత్తత తీసుకునేందుకు ముందుకొచ్చారు. అంతేకాకుండా గత ఆరునెలలుగా ఆ గ్రామంలో సమస్యలు గుర్తించి వాటిని ఎలా పరిష్కరించాలో నివేదిక కూడా రూపొందించినట్లు తెలిసింది. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, ఆరేళ్ళ నుండి 12 ఏళ్ల వయస్సున్న చిన్నారులను స్కూళ్ళలో చేర్పించడం, డ్రాపౌట్లను గుర్తించి వారిని చదివించే బాధ్యత తీసుకుంటానని, ఇప్పటికే ఎర్రవెల్లితో పాటు పక్కనే ఉన్న గిరిజన గ్రామం చెంచుపల్లిలోనూ మిషన్ కాకతీయలో భాగంగా రెండు చెరువుల్లో పనులు పూర్తిచేశామని కృష్ణప్రసాద్ ఒక పత్రికకు ఇచ్చిన ఇంటర్వ్యూలో తెలిపారు.

ఇదేబాటలో సైబరాబాద్ డీజీపీ సీవీ ఆనంద్ రాజేంద్రనగర్ లోని ఖానాపూర్ గ్రామాన్ని, నిజామాబాద్ ఎస్పీ చంద్రశేఖర్ రెడ్డి ఆ జిల్లాలోని బర్దీపూర్ గ్రామాన్ని దత్తత తీసుకున్నారు. విధినిర్వహణలో క్షణం తీరికలేని రాష్ట్ర పోలీస్ ఉన్నతాధికారులు సామాజిక సేవా కార్యక్రమాల్లో సైతం పాల్గొనడం యావత్ తెలంగాణ ప్రజానీకాన్ని సంతోషించేలా చేస్తుంది.

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *