యునైటెడ్ అరేబియన్ ఎమిరేట్స్(యూఏఈ) ఐదో వార్షిక పెట్టుబడుల సదస్సు ఈనెల మార్చి 30 నుండి ఏప్రిల్ 1 వరకు జరగనుంది. దుబాయి కన్వెన్షనల్ సెంటర్ లో జరిగే ఈ సదస్సుకు పాల్గొనాల్సిందిగా ఐటీ మంత్రి కేటీఆర్ ను యూఏఈ వైస్ ప్రెసిడెంట్ మహమద్ బిన్ రషీద్ ఆల్ మకోటమ్ కోరారు. ఈ మేరకు యూఏఈ రాయబార కార్యాలయం మంత్రిని సంప్రదించింది.
ప్రపంచంలోని 140 దేశాలకు చెందిన వ్యాపారవేత్తలు, కంపెనీల ప్రతినిధులు, నిపుణులు ఈ సదస్సుకు హాజరుకానున్నారు. ఈ సమావేశంలో సస్టైనబుల్ డెవలప్ మెంట్ ఇన్నోవేషన్ అండ్ టెక్నాలజీ ట్రాన్స్ ఫర్ అనే అంశంపై చర్చించనున్నారు. ఈ విషయమై మంత్రి కేటీఆర్ మాట్లాడుతూ, రాష్ట్రంలో ఉన్న వ్యాపార అవకాశాలను ప్రపంచ పారిశ్రామిక రంగం ముందు ఉంచడానికి 140 దేశాల ప్రతినిధులు హాజరయ్యే ఈ సదస్సు చక్కని వేదికగా ఉపయోగపడుతుందని, అంతర్జాతీయ కంపెనీలను రాష్ట్రానికి ఆహ్వానించే వీలుకలుగుతుందని అన్నారు.