mt_logo

దళారి మరిచిన దండియాత్ర!

వ్రైదికపు ప్రిల్లీ.. ప్రత్తి అని ప్రలుకవే అంటే మ్రావు మ్రావు అందట..రాధాకృష్ణ అదే టైపు. అంతా డంబాచారం. చాన్స్ దొరికితే సుభాషితాలు ఉరకలెత్తుతాయి ఆయన రాతల్లో. తనకు తాను ఆయనో మహా ప్రవక్త. మానవాళికి సందేశం అందించే దేవదూత. ఆయన తాజా కొత్త పలుకు చూడండి.. ఎన్ని సుభాషితాలు.. ఎంత భారీ హితోపదేశాలు.. ఎన్ని ధర్మపన్నాలు! కేసీఆర్‌ను మహాత్ముడని కీర్తించడం సదరు ప్రజాస్వామ్య పరిరక్షణాచార్యుడికి జీర్ణం కావడం లేదు! నాయకులను గౌరవించడం, అభిమానించడం వేరు..పూజించడం వేరు. వ్యక్తి పూజలు ప్రజాస్వామ్య వ్యవస్థకు మేలుచేయవు. ఇలాంటివి హద్దుదాటితే ప్రజాస్వామ్యయుతంగా వ్యవహరించాలనుకున్నవారు కూడా నియంతలుగా మారే అవకాశం ఉంటుంది. అధికారంతో ఉన్నవారిని కీర్తించే వారికి కొదవ ఉండదు..బంగారు తెలంగాణ సాధించిననాడు ప్రజలంతా కీర్తిస్తారు. అంత వరకూ ఏం చేసుకున్నా అది మన డప్పు మనం కొట్టుకున్నట్టే… ఇవి ఆయన ప్రవచించిన సుభాషితాలు. సరే.. రాధాకృష్ణకు కేసీఆర్ ఓ పీడకల.

అది జగద్విదితం. తెలంగాణ ఆవిర్భావం ఆయనను జీవితమంతా వెంటాడే చేదు అనుభవం. ఆయన ఖర్మఫలం.. వదిలేద్దాం. ఆయన అభిప్రాయం ఆయనది. కానీ గురువింద గింజ తన నలుపెరగనట్టు ఇతరులకు హితోపదేశాలు చేస్తున్నప్పుడు ఆయన తనేంటో చూసుకోవాలి కదా! కేసీఆర్‌ను పొగడడాన్ని తప్పుపడుతున్న రాధాకృష్ణకు గతంలో తాను చంద్రబాబుకు మంగళహారతులు పట్టి మహాత్ముడితో పోలిక పెట్టిన విషయం గుర్తుకు రావడం లేదు. ఒకనాడు చంద్రబాబును స్టార్ ఆఫ్ ఏషియా అని..అపర చాణక్యుడని…ఒకే ఒక్కడు అని అయనే కీర్తించారు. ఆ రోజు ఈ వ్యక్తిపూజల సంగతి గుర్తుకు రాలేదు. ఒక్కడు తిరగబడి దెబ్బ కొడితే బతుకు ఆంధ్రప్రదేశ్ పోయి అవశేష ఆంధ్రప్రదేశ్‌గా మార్చుకున్న ఒక అర్భక రాజకీయనాయకుడికి విజనరీ అని నవ్యాంధ్ర నిర్మాత అని భుజకీర్తులు తగిలించి బాజాలు మోగించిన వారు ఇవాళ ఇతరుల మీద రాళ్లు వేయడానికి ఉరకలేస్తున్నారు.

దండిగా వర్ణించిందెవరు?
రెండుసార్లు వైఎస్ చేతిలో ఘోర పరాభవం పాలైన చంద్రబాబు 2013లో దుకాణం ఉంచుడా? మూసుడా? అన్న పరిస్థితిలో అధికారం కోసం వైఎస్ స్క్రిప్టు ఫాలో అయిపోయి పాదయాత్ర ప్రారంభించారు. ఆనాడు చంద్రజ్యోతి సదరు యాత్రకు దళారిగా వ్యవహరించింది. ఆ యాత్రను చంద్రయాన్ అంటూ హారతి పట్టింది. రోజువారీ కథనాలు వేసింది. ఏబీఎన్ ఏకంగా దాన్ని దండియాత్రతో.. చంద్రబాబును మహాత్మాగాంధీతో పోలికపెట్టి శ్లాఘించింది. గాంధీ సబర్మతినుంచి దండిదాకా యాత్ర చేశారని చంద్రబాబు అంతకన్నా ఎక్కువ దూరం యాత్రలు చేస్తున్నారని ఆకాశానికి ఎత్తేసింది. మరి దాన్నేమంటారు రాధాకృష్ణా? అధికారం కోసం రోడ్డెక్కినవాడిని మహాత్ముడు అని పిలిచినపుడు అరవై ఏండ్ల ప్రజల స్వప్నాన్ని సాకారం చేసిన వారిని ఏమని పిలవాలి? రెండు పార్లమెంటు సీట్లతో కేంద్రాన్ని ఢీకొట్టి తెలంగాణ సాధించిన నేతను.. బరితెగించి బజారుకెక్కిన సీమాంధ్ర రాజకీయ పార్టీలను.. ధనమదంతో విర్రవీగే సీమాంధ్ర పెట్టుబడిదారులను, అన్నింటినీ మించి పగబట్టినట్టు వెంటాడే సీమాంధ్ర మీడియాను ఒంటి చేత్తో ఢీకొట్టిన యోధుడిని ఏమని పిలుస్తారు? ఎందరో కలలు గన్న.. ఎందరో తపించిన.. ఎందరెందరో ప్రయత్నించిన తెలంగాణ రాష్ట్రాన్ని సాధించి అందించిన వారినేమని అంటారు? బంగారు తెలంగాణ సాధిస్తే అప్పుడు మహాత్ముడని అనవచ్చట..రాధాకృష్ణ భాష్యం. అసలు తెలంగాణ సాధనే ఒక మహాకార్యం. ఆ కార్యాన్ని సాధించాడు కాబట్టే కేసీఆర్ మహాత్ముడని అంటాం. ఆ కార్యసాధనకు ఆయన అనుసరించిన మార్గం అనితర సాధ్యం. కాబట్టే ఆయన మహనీయుడు. ఎందరో ప్రయత్నించి మధ్యలో కాడి పడేశారు కాబట్టే కేసీఆర్‌కు ఆ గౌరవం. బంగారు తెలంగాణలు.. వజ్రాల తెలంగాణలు.. ఈ సాధన ముందు స్వల్పవిషయాలు. తెలంగాణకు అడుగడుగునా అడ్డుపడ్డ టీజీ వెంకటేశ్ లాంటి వారే అన్నారు…కేసీఆర్ తెలంగాణకు గాంధీ అని…సీమాంధ్ర మీడియా గుర్తించ నిరాకరించవచ్చు. వారి బ్రాండ్ అంబాసాడర్లు భరించకపోవచ్చు. కానీ ఆ ఒక్కడూ లేకుంటే ఏ ఒక్కడి వల్లా జరిగి ఉండేది కాదు.

ముల్లు..పూలు..
టీఆర్‌ఎస్ సభ్యత్వ నమోదు చేపట్టింది. రాష్ట్రమంతా కార్యక్రమం జరుగుతున్నది. హైదరాబాద్‌లో మార్వాడీలు చేరారు. పంజాబీలు చేరారు. సీమాంధ్రులు చేరారు. సీమాంధ్రులు కేసీఆర్‌ను కలిశారు. కష్టం సుఖం, మంచీ చెడు ప్రస్తావనకు వచ్చాయి. తమ ఆందోళనలో, భయాలో వాళ్లు చెప్పుకున్నారు. ఒక ముఖ్యమంత్రిగా మీ రక్షణ బాధ్యత నాదే అన్నారు కేసీఆర్. ఎపుడో తాతల నాడు వచ్చారు..ఇంకా సెటిలర్లమని ఎందుకనుకుంటారు. ముందు ఆ భావన వదిలేయండి. తెలంగాణ సమాజంలో కలిసిపోండి. మీరూ మావారే అన్నారు కేసీఆర్. ఇది రాధాకృష్ణకు నాలుక మడత వేసినట్టు కనిపించింది. అంతేకాదు ఇది ఎన్నికల కోసమే అని ఆయన డిసైడ్ చేశారు. కేసీఆర్ అనేక సార్లు సీమాంధ్ర ప్రజల మనసులు గాయపరిచారట. ముల్లు గుచ్చారట. మొదటినుంచి రాధాకృష్ణ వంటి వారు పెంచి పోషిస్తున్న భావజాలం ఇదే. అక్రమంగా తమ ఉద్యోగాల్లో చొరబడ్డ వారిని భాగో అన్నా.. హైదరాబాద్‌లో ఆక్రమణదారులపై విమర్శలు చేసినా, తెలంగాణకు అడ్డుపడ్డ వారిపై యుద్ధం ప్రకటించినా వాటిని సామాన్య సీమాంధ్రులకందరికీ ఆపాదించి రాధాకృష్ణ వంటి వారు చేసిన ప్రచారమే వారిలో అభద్రతా భావనకు కారణమైంది. సమైక్యాంధ్ర పేరిట ఉద్యోగులు హైదరాబాద్‌లో సభ పెట్టారు. తెలంగాణను ఆపే చర్య కనుక ఆ బస్సుల మీద రాళ్లు పడ్డాయి. ఇది తెలంగాణ అనుకూల, వ్యతిరేకులకు సంబంధం ఉన్న అంశం. దానితో సామాన్య సీమాంధ్రులకు సంబంధం లేదు. అయినా దీన్ని సీమాంధ్రుల రక్షణ అంశానికి ముడిపెట్టి ప్రచారాలు చేశారు. నిజానికి అక్రమ ఉద్యోగుల వెనక్కి పోయినా..భూ ఆక్రమణదారులు జైల్లో పడ్డా దానివల్ల సామాన్య సీమాంధ్రులకు జరిగే నష్టమేమీ లేదు.

అన్నింటినీ మించి ఉద్యమ ప్రారంభంనుంచి పొట్టకోసం వచ్చిన వారితో మాకు పేచీలేదని కొన్ని వందల సార్లు కేసీఆర్ సహా ఉద్యమకారులంతా చెబుతూ వస్తునే ఉన్నారు. అడ్వకేట్ జనరల్ విషయంలో న్యాయవాదులు ఆందోళన చేస్తున్నప్పుడు ఏబీఎన్ నిర్వహించిన చర్చలో ఫోన్‌ఇన్ ద్వారా మాట్లాడిన సందర్భంలో కూడా హైదరాబాద్‌లో పుట్టిపెరిగిన వారిని తెలంగాణ వారిగానే పరిగణిస్తామని కేసీఆర్ చెప్పారు. దాన్ని ఏబీఎన్ తెలంగాణవాదులందరి దగ్గరికీ తీసుకెళ్లి కేసీఆర్ ఇలా అన్నారు…అంటూ వివాదం రగిలించి పుణ్యం కట్టుకుంది కూడా. ఆ రోజున జీహెచ్‌ఎంసీ ఎన్నికలు లేవు. 2009 డిసెంబర్‌లో తెలంగాణ ప్రకటన వెలువడ్డ తర్వాత అలాగే 2014 తెలంగాణ బిల్లు ఆమోదం తర్వాత కూడా కేసీఆర్ తెలంగాణ అంశాన్ని జాతుల పోరాటంగా మార్చవద్దని పదేపదే విజ్ఞప్తి చేశారు.హైదరాబాద్‌లో ఉన్న వారిని కడుపులో పెట్టి కాపాడుకుంటామని అన్నారు. అపుడు కూడా జీహెచ్‌ఎంసీ ఎన్నికలు లేవు.
మహాత్మగాంధీ సైతం బ్రిటిష్ వారిని క్విట్ ఇండియా అన్నాడు. స్వాతంత్య్రం వచ్చిన తర్వాత ఇక్కడ ఉండవచ్చునని చెప్పాడు. మరి ఆయన నాలుక మడతేసినట్టా?

నమస్తే తెలంగాణ సౌజన్యంతో..

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *