తెలంగాణ రాష్ట్రం నుంచి ప్రతి ఏటా విత్తన ఎగుమతులు పెరుగుతుండటం దృష్ట్యా, విత్తన ఎగుమతికి సంబందించి అన్నీ పరీక్షలు చేసి విత్తనోత్పత్తి దారులకు సేవలు అందించడానికి వీలుగా, తెలంగాణ ప్రభుత్వం దేశంలో ఏ రాష్ట్రంలో లేని విధంగా అంతర్జాతీయ ప్రమాణాలతో, అధునాతన విత్తన పరీక్షా యాత్రాలను సమకూర్చి ఏడు కోట్ల వ్యయంతో హైదరాబాద్ రాజేంద్ర నగర్ లో ‘తెలంగాణ అంతర్జాతీయ విత్తన పరీక్ష కేంద్రం’ (ISTA) పేరుతొ విత్తన పరీక్ష ల్యాబ్ ను నిర్మించడం జరిగింది. అంతర్జాతీయ విత్తన పరీక్ష ప్రమాణాలు సంస్థ (ISTA), స్విట్జర్లాండ్ గుర్తింపు కొరకు దరఖాస్తు చేసుకోగా, గత సంవత్సరం అక్టోబర్ నెలలో ఆడిటింగ్ లో భాగంగా అన్ని రకాల పరీక్షలు & విశ్లేషణలు నిర్వహించిన ఆడిటింగ్ టీమ్, అనంతరం ఫిబ్రవరి 9, 2022 న గుర్తింపు ఇస్తున్నట్లు ISTA సెక్రటేరియల్, స్విట్జర్లాండ్ వారు ప్రకటించడం జరిగింది. ప్రస్తుతం దేశవ్యాప్తంగా ప్రభుత్వ రంగంలో 130 & ప్రైవేట్ రంగంలో 50 నోటిఫైడ్ విత్తన పరీక్ష ల్యాబ్ లు ఉన్నాయి. కానీ ఇందులో కేవలం 26 ల్యాబ్ లు ISTA లో భాగస్వామ్య ల్యాబ్ లు ఉండగా అందులో 8 ల్యాబులు మాత్రమే ISTA గుర్తింపు ను పొందాయి. ఈ విధంగా, దేశంలో ISTA గుర్తింపు ను పొందిన రెండవ ప్రభుత్వ రంగ ల్యాబ్ గా తెలంగాణ విత్తన పరీక్ష ల్యాబ్ పేరొందింది.
తెలంగాణ రాష్ట్రం నుంచి మరిన్ని విత్తన ఎగుమతులు ప్రోత్సహించి, విత్తన రంగ అభివృద్దిని & విత్తన వాణిజ్యాన్ని మరింత పెంపొందించి, ప్రపంచ విత్తన పటంలో తెలంగాణ రాష్ట్రం అగ్ర భాగానా నిలవటానికి ఇది ఎంతగానో దోహదపడనున్నది. ఈ అంతర్జాతీయ విత్తన పరీక్ష ల్యాబ్ మరి కొద్ది రోజుల్లోనే ప్రారంభం అయ్యి అందుబాటులోకి రానున్నది. ఒక్కసారి ఈ ల్యాబ్ వాడుకలోకి వస్తే అంతర్జాతీయ ప్రమాణాలకు అనుగుణంగా విత్తన మొలకశాతం, తేమ శాతం, భౌతిక స్వచ్ఛత, జన్యు స్వచ్ఛత లాంటి నాణ్యతా పరీక్షలతో పాటు సింగల్ విండో పద్దతిన విత్తన ఎగుమతికి సంబందించిన అన్ని రకాల విత్తన పరీక్షలు చేయడం జరుగుతుంది.
ఈ సందర్భంగా రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి మాట్లాడుతూ… రాష్ట్ర విత్తనాభివృద్ధి సంస్థను అభినందించారు. తెలంగాణ విత్తన దృవీకరణ సంస్థ అంతర్జాతీయ స్థాయి సంస్థలైన ISTA, OECD, ISF, UPOV, FAO సంబంధాలు మెరుగుపరచుకొని విత్తన రైతులకు, విత్తనోత్పత్తి దారులకె కాకుండా అంతర్జాతీయ విత్తన ప్రముఖులచే నాణ్యమైన విత్తనోత్పత్తి, విత్తన దృవీకరన, విత్తన నమూనాలా సేకరణ, విత్తన పరీక్ష పద్దతులపై పలు వర్క్ షాప్ లు, శిక్షణ కార్యక్రమాలు నిర్వహించడం జరుగుతుందని పేర్కొన్నారు. విత్తన దృవీకరణ సంస్థ సంచాలకులు డా. కేశవులు మాట్లాడుతూ… ప్రపంచ దేశాలలో విత్తన శాస్త్ర సాంకేతిక రంగాలలో పరిశోధనలు జరిపి విత్తన పరీక్ష పద్దతులు, ప్రమాణాలను రూపొందించే అంతర్జాతీయ స్థాయి సంస్థ గుర్తింపు తెలంగాణ విత్తన ల్యాబ్ కు రావటం సంతోషంగా ఉందని, ఇందుకు అన్ని రకాల సహాయ సహకారాలు అందించిన సీఎం కేసీఆర్ కు ప్రత్యేక కృతజ్ఞతలు అన్నారు. కాగా వ్యవసాయ & విత్తన రంగ అభివృద్ధ్యే లక్ష్యంగా గత సంత్సరం నవంబర్ లో విత్తన పరిశ్రమల సమగ్ర అభివృద్దిపై “అంతర్జాతీయ విత్తన సదస్సు” లో ఐక్యరాజ్య సమితి – అంతర్జాతీయ ఆహార సంస్థ (FAO) తెలంగాణ రాష్ట్రాన్ని ప్రపంచ విత్తన భాండాగారంగా గుర్తించిన విషయం తెలిసిందే.