హైదరాబాద్ మరో అంతర్జాతీయ సదస్సుకు వేదిక కాబోతున్నది. దేశంలో అతిపెద్ద రెస్టారెంట్ ఇండస్ట్రీ సదస్సును ‘ఎన్‌ఆర్‌ఏఐ హైదరాబాద్ చాప్టర్’ హైదరాబాద్ లో నిర్వహించనుంది. ఈ నెల 13న హెచ్‌ఐసీసీలో జరగనున్న ఈ సదస్సును రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి కేటీ రామారావు ప్రారంభించనున్నారు. ఈ సదస్సుకు దేశవ్యాప్తంగా రెస్టారెంట్ ఇండస్ట్రీకి చెందిన ప్రతినిధులతోపాటు విదేశీ డెలిగేట్స్, పెట్టుబడిదారులు, బ్యూరోక్రాట్లు హాజరు కానున్నారు. ఈ కాన్‌క్లేవ్‌లోనే 40వ వార్షిక సాధారణ సమావేశం కూడా జరగనున్నది.
ఈ సందర్భంగా ఎన్‌ఆర్‌ఏఐ హైదరాబాద్ చాప్టర్ హెడ్ శంకర్ కృష్ణమూర్తి మాట్లాడుతూ..రాష్ట్రంలో రెస్టారెంట్ల విభాగం శరవేగంగా వృద్ధిని నమోదు చేసుకుంటున్నదని, సంఘటిత హైదరాబాద్‌లో రెస్టారెంట్ మార్కెట్ వాటా రూ.6 వేల కోట్ల స్థాయిలో ఉన్నదన్నారు. దీంట్లో రెస్టారెంట్ మార్కెట్ వాటా రూ.4,650 కోట్లు కాగా, చైనా రెస్టారెంట్స్ వాటా రూ.1,380 కోట్లని పేర్కొన్నారు. రాష్ట్ర ప్రభుత్వంతో కలిసి ఆతిథ్య రంగంలోకి పెట్టుబడులు తీసుకురావడానికి తీవ్రంగా కృషి చేస్తున్నట్లు, ఈ సదస్సులో కూడా పెట్టుబడులకు సంబంధించి ఒప్పందాలు జరిగే అవకాశం కూడా ఉందన్నారు. కరోనాతో గడిచిన రెండేండ్లుగా హోటల్ పరిశ్రమ తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నదని, ముఖ్యంగా లక్షలాది మంది ఉపాధి కోల్పోయినట్లు చెప్పారు.