By చెన్ రెడ్డి అల్వాల్ రెడ్డి
రాష్ట్రంలో తమ నాయకుడు ఎవరో చెప్పుకోలేని కాంగ్రెస్ పార్టీతో జతకడితే ఉన్న పరువుపోతుందే తప్పా ప్రయోజనం ఏ మాత్రం ఉండదనేది మాహాకూటమి పార్టీలు తెలుసుకోవాలి. టీడీపీకి తెలంగాణలో ఏ తెరువు లేదు కాబట్టి కాంగ్రెస్ పార్టీతో అంటకాగితే కొంత ఉనికి ఉంటుందని ఉబలాటం. కానీ సిద్ధాంతాల కోసం పోరాడే కోదండరాం పార్టీ, కమ్యూనిస్టు పార్టీలు మహాకూటమి పొత్తు విషయమై పునరాలోచించుకుంటే కొంత గౌరవమైనా దక్కుతుందేమో!
రాజకీయాల్లో శాశ్వత మిత్రులు, శాశ్వత శత్రువులుండరనే సామెత మనకు తెలిసిందే. కానీ దీనికి కొన్నిమినహాయింపులున్నాయి. కొన్ని రాజకీయ పార్టీల చారిత్రక నేపథ్యం, ఉద్దేశాలు గమనించాల్సిన అవసరం ఆసన్నమైంది. కాంగ్రెస్ పార్టీ నాయకులు ఢిల్లీ పాలకుల కాళ్ల వద్ద ఆత్మగౌరవాన్ని తాకట్టుపెట్టడం లాంటివి చూసిన ఆయన చలించిపోయారు. రాజకీయ ప్రత్యామ్నాయానికి పూనుకున్నారు.
నాడు కాంగ్రెస్ పార్టీలో ఉన్న ప్రస్తుత ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కాంగ్రెస్ అధిష్ఠానం ఆదేశిస్తే మామపై పోటీ చేస్తానని ప్రగల్భాలు పలికిన సంగతి చాలామందికి జ్ఞాపకం ఉండే ఉంటుంది. ఆయన నాటి ఎన్నికల్లో కాంగ్రెస్ తరఫున పోటీచేసి పరాజితుడయ్యాడు. ఆరు నెలల్లో పిల్లనిచ్చిన మామ చెంతకు చేరి అధికారం చెలాయించడం మొదలుపెట్టారు. క్రమంగా చాపకింద నీరులా పార్టీలో పట్టు సంపాదించారు. ఆ తర్వాత అదను చూసుకొని లక్ష్మీపార్వతిని సాకుగా చూపి తోటి శాసనసభ్యులతో ఎన్టీఆర్‌పై చెప్పులు వేయించిన ఘనత చంద్రబాబుది. రాజ్యాధికారాన్ని సైతం చేజిక్కించుకొని ఎన్టీఆర్‌ను మానసికంగా హత్యచేశారు. ఈ అవమానాన్ని తట్టుకోలేక ఎన్టీఆర్ కొద్దికాలంలోనే అసువు లు బాయడం, ఆయన మరణ కారణాన్ని లక్ష్మీపార్వతికి ఆపాదించడం తెలిసిన చరిత్రే.
కాంగ్రెస్ విధానాలకు వ్యతిరేకంగా ఆవిర్భవించిన టీడీపీ ఇప్పుడు కాంగ్రెస్ పార్టీతో పొత్తుకు సిద్ధమవ్వడమంటే ఎన్టీఆర్ ఆత్మను రెండోసారి హత్య చేయటమే. టీడీపీ స్థాపనే కాంగ్రెస్ పార్టీ సిద్ధాంతాలకు, దాని పరిపాలనా విధానానికి వ్యతిరేకం. అలాంటి పార్టీతో పొత్తు పెట్టుకోవడానికి తన తెలంగాణ నాయకులకు పచ్చజెండా ఊపడం చూస్తుంటే ఆయన ఎంత కుటిల రాజకీయ నాయకులో తెలంగాణ ప్రజలకు అర్థమవుతున్నది. ఎన్టీఆర్ బతికి ఉన్నప్పుడే చంద్రబాబును ఔరంగజేబుతో పోల్చారు. జామాతా దశమ గ్రహమన్నది చంద్రబాబుకు సరిపోతుందని వ్యాఖ్యానించారు. ముఖ్యంగా టీ టీడీపీ నాయకులకు చంద్రబాబు ఇచ్చిన సలహాను పరిశీలిస్తే చంద్రబాబు ఎంత అవకాశవాదో తెలుస్తున్నది. తెల్లవారుజాము లేవగానే తనకు తాను సమర్థుడిగా, పరిపాలనాదక్షుడిగా, అనుభవమున్న రాజకీయ దురంధరుడినని చెప్పుకునే చంద్రబాబు కాంగ్రెస్ పార్టీతో పొత్తుకు అనుమతించిన విధానం జుగుప్సాకరం.
ఆయన ప్రచారం చేయడటగానీ, ఆర్థిక సాయం మాత్రం చేస్తాడట. ఆయా పరిస్థితులను బట్టి మీరే నిర్ణయాలు తీసుకోవాలని సలహా ఇవ్వడం, ఒకవైపు మోదీని వ్యతిరేకిస్తూ, మరోవైపు కేసీఆర్‌కు వ్యతిరేకిని కాను అన్నట్లుగా తన సానుభూతిని తెలుపడం వారి ద్వంద్వనీతిని, కపట మనస్తత్వాన్ని ప్రతిబింబిస్తుంది. కేంద్రం తెలంగాణకు ఏం చేసింది? తనకు, కేసీఆర్‌కు వివాదాలు సృష్టించడం తప్పితే అంటూ మోదీని విమర్శించడాన్ని ఏమంటారు? చంద్రబాబుకు కేసీఆర్‌పై అంత ప్రేమ ఉంటే టీఆర్‌ఎస్‌కు వ్యతిరేకమైన కాంగ్రెస్‌తో పొత్తు ఎందుకు ప్రతిపా దిస్తున్నట్టు? ఈ విషయంలోనే రేవంత్‌రెడ్డిని కాంగ్రెస్‌లోకి పంపిన విధానం, రేవంత్‌రెడ్డి టీడీపీకి పంపిన రాజీనామా విధానం పరిశీలిస్తే.. దాని లో చంద్రబాబు దుష్ట సంకల్పం కనిపిస్తుంది. అందులో కేసీఆర్‌ను దెబ్బతీయడం, తెలంగాణకు వ్యతిరేకంగా తన అభిలాషను పూర్తిచేసుకోవడం కనిపిస్తుంది. తెలంగాణ టీడీపీ నాయకులకు నిజంగా దివంగత ఎన్టీఆర్‌పై ఏ మాత్రం ప్రేమ, గౌరవం ఉన్నా ఎటువంటి పరిస్థితుల్లోనై నా కాంగ్రెస్ పార్టీతో పొత్తుపెట్టుకోకూడదు.
చంద్రబాబు వ్యవహారశైలి ఇలా ఉంటే మహాకూటమి పేర కేసీఆర్ కు వ్యతిరేకంగా పొత్తు కుదుర్చుకోబుతున్న మిగితా రాజకీయ నాయకులు కూడా ఈ ప్రశ్నలకు సమాధానం చెప్పాలి. తెలంగాణ తొలి ప్రభుత్వం అయిన టీఆర్‌ఎస్ పాలన ఎందుకు సరిగా లేదో, కాంగ్రెస్ పాలన ఎలా ఉండబోతున్నదో సీపీఐ, జన సమితి, మిగితా పార్టీల నాయకులు తెలంగాణ ప్రజలకు చెప్పాల్సిన అవసరం ఉన్నది. కేసీఆర్‌ది నియంత పాలనే అయితే అటు ఆంధ్రలో చంద్రబాబు పాలన సంగతి, కాంగ్రెస్ పార్టీ ఢిల్లీ నాయకత్వం దగ్గర ప్రణమిల్లే సంగతి కూడా తెలంగాణ ప్రజలకు తెలియజేయాలి.
పద్నాలుగేండ్లు అవిశ్రాంత పోరాటం చేసి, మృత్యు ముఖంలోకి వెళ్లిస్వరాష్ర్టాన్ని సాధించిన కేసీఆర్ కంటే తెలంగాణ విభజన విషయంలో ముందు నుంచి ద్వంద్వ నీతిని పాటించిన చంద్రబాబు ఈ నాయకులకు దగ్గరయ్యారా? కాంగ్రెస్ వెన్నెముక లేని నాయకత్వం ఉన్న పార్టీ అన్న సంగతి అందరికీ తెలిసిందే. మహాకూటమి పార్టీలకు తెలియకపోవడమే శోచనీయం. కాంగ్రెస్ నాయకులు కూర్చోవాలన్నా.. నిల్చోవాలన్నా ఢిల్లీ నుంచి ఆదేశాలు రావాల్సిందే. రాజకీయ నాయకులు సిద్ధాంతాలపై పోరాటం చెయ్యాలే గానీ కేసీఆర్‌ను గద్దె దించాలన్న లక్ష్యం ఏమిటి? పిచ్చి ప్రేలాపన, అర్థం లేని రాద్ధాంతం. కోదండరామ్ లాంటి మేధావి తన సిద్ధాంతాలతో ఒంటరి పోరాటం చేస్తే సీట్లు రాకపోయినా కొంత గౌరవం, విలువ పెరుగుతాయని ఆలోచించకపోవడం హేయం. కోదండరాం కేసీఆర్ పాలనతో ఏకీభవించకపోవచ్చు.
ఆయనకు ఆ హక్కున్నది. కానీ కాంగ్రెస్‌తో కలిస్తే మాత్రం ఆయన ప్రతిష్ఠ అధఃపాతాళానికి పోవడం ఖాయం. ఇది వీరికే గాక సీపీఐ, మిగితా పార్టీలకూ వర్తిస్తుంది.
ఎవరికైనా కేసీఆర్‌ను వ్యతిరేకించాల్సిన అవసరం ఏమున్నది? రైతులకు, గృహావసరాల నిమిత్తం 24 గంటల నిరంతర విద్యుత్తు అందిస్తున్నందుకా? దశాబ్దాల తరబడి పెండింగ్‌లో ఉన్న సాగునీటి ప్రాజెక్టులను పూర్తి చేస్తున్నందుకా? రైతుకు పెట్టుబడి సాయం కింద ఎకరానికి రెండు పసళ్లకు రూ.8 వేలు అందిస్తున్నందుకా లేక రైతుబీమా ఇస్తున్నందుకా? కంటివెలుగు లాంటి వినూత్న పథకాలను ప్రవేశపెడుతున్నందుకా? వృద్ధులకు, ఒంటరి మహిళలకు, వికలాంగులకు పింఛన్ రూ.200 నుం చి 1000, 1500 పెంచినందుకా? చేనేత కార్మికులకు చేయూతనందిస్తున్నందుకా? బీడీ కార్మికులను అక్కున చేర్చుకున్నందుకా?
కులవృత్తులకు ఆదరణ కల్పిస్తున్నందుకా? తండాలను గ్రామ పంచాయతీలుగా మార్చినందుకా? సన్నబియ్యంతో విద్యార్థులకు మధ్యాహ్న భోజనం పెడుతున్నందుకా? ప్రసవించిన మహిళలకు కేసీఆర్ కిట్ అందిస్తున్నందుకా? పేదకుటుంబాలకు చెందిన ఆడపిల్లల పెండ్లి ఖర్చుకోసం కళ్యాణలక్ష్మీ ద్వారా లక్షా నూట పదహారు రూపాయలు అందిస్తున్నందుకా? మిషన్ భగీరథతో ఇంటింటికీ నల్లానీరు, మిషన్ కాకతీయతో పంట పొలాలకు నీళ్లు పారిస్తున్నందుకా? అసలు కేసీఆర్‌ను ఎందుకు వ్యతిరేకిస్తున్నారో ప్రజలకు చెప్పాలి. సరైన కారణాల్లేకుండా నిరాధారమైన ఆరోపణలు చేయడం ప్రతిపక్షాలకు తగదు.
రాష్ట్రంలో తమ నాయకుడు ఎవరో చెప్పుకోలేని కాంగ్రెస్ పార్టీతో జతకడితే ఉన్న పరువు పోతుందే తప్పా ప్రయోజనం ఏ మాత్రం ఉండదనేది మాహాకూటమి పార్టీలు తెలుసుకోవాలి. టీడీపీకి తెలంగాణలో ఏ తెరువు లేదు కాబట్టి కాంగ్రెస్ పార్టీతో అంటకాగితే కొంత ఉనికి ఉం టుందని ఉబలాటం. కానీ సిద్ధాంతాల కోసం పోరాడే కోదండరామ్ పార్టీ, కమ్యూనిస్టు పార్టీలు మహాకూటమి పొత్తు విషయమై పునరాలోచించుకుంటే కొంత గౌరవమైనా దక్కుతుందేమో!