mt_logo

ఇది కేసీఆర్ నామ సంవత్సరం

– సవాల్‌రెడ్డి

అండ్ ద బిల్ ఈజ్ పాస్డ్.. కూర్చున్న సీటులోంచి కాస్త లేచి.. మైకు దగ్గర బిగ్గరగా రాజ్యసభ ఉపసభాపతి కురియన్ చేసిన చారిత్రక తెలంగాణ విముక్తి ప్రకటన.. 2014 సంవత్సరానికి ప్రత్యేకతను సంతరించి పెట్టింది. పద్నాలుగేండ్లక్రితం ఒక బక్కపలుచని మనిషి తీసుకున్న ప్రతిజ్ఞను పరిపూర్ణంచేసింది. నేనూ మా ఎమ్మెల్యేలు శుక్రవారం సాయంత్రం ఢిల్లీ వెళుతున్నాం. సమైక్యరాష్ట్రంలో ఢిల్లీ వెళుతున్నా.. తెలంగాణ రాష్ట్రంలోనే తిరిగి అడుగుపెడతా అని జనవరి 30న తెలంగాణ భవన్‌లో కేసీఆర్ చెప్పిన మాట.. సరిగ్గా 20 రోజుల్లో ఫిబ్రవరి 20న రాజ్యసభలో తెలంగాణ బిల్లు ఆమోదంతో సాకారమైంది.

జనవరిలో ఆత్మవిశ్వాస ప్రకటనతో ప్రారంభమైన 2014 సంవత్సరాన్ని కేసీఆర్ ఏడాది పొడవునా శాసించారు. తెలంగాణ సాధనవంటి ఒక మహా విజయంతో ప్రారంభించి.. ఒంటరిగా ఎన్నికలను ఎదుర్కొని.. సుడిగాలి ప్రచారంతో దుమారం రేపి.. ప్రజల దీవెనతో ప్రభుత్వ పగ్గాలుచేపట్టి.. దేశాన్నే ఆకర్షించే పథకాలు అమలుచేస్తూ.. తిరుగులేని ఆత్మవిశ్వాసంతో నూతన వత్సరంలోకి అడుగుపెడుతున్నారు. ఇది అక్షరాలా కేసీఆర్ నామ సంవత్సరం.

రాజకీయంగా కేసీఆర్ హిమాలయాన్ని అందుకున్నారు. విపక్షాలు కనీసం కనుచూపు మేరలో ఎక్కడా కనిపించకుండా చేశారు. అరవై ఏండ్లుగా అనేక ప్రభుత్వాలు చేయలేని ఎన్నో కార్యక్రమాలను ఆరు నెలల్లోనే ప్రారంభించారు. ఒక్కరూ వేలెత్తి చూపకుండా, చిన్న అవినీతి మరక తాకకుండా ఆరునెలల పాలన సాగించారు. ఇవాళ కేసీఆర్‌ను విమర్శించేవారు సాకులు వెతుక్కోవాలి. రాజకీయంగా ఢీకొట్టాలంటే గుండెలు చిక్కబట్టుకోవాలి.

ఎన్నికల్లోనే విశ్వరూపం…

తెలంగాణ ఆవిర్భావం నేపథ్యంలో జరిగిన సాధారణ ఎన్నికల్లో కేసీఆర్ విశ్వరూపమే చూపించారు. రాజకీయ ఎజెండాను శాసించారు. కేసీఆర్ లక్ష రూపాయల రుణమాఫీ అంటే రాహుల్ అంతటివాడు రెండు లక్షలు అని వేలంపాట పాడక తప్పని పరిస్థితి. గతంలో ఎక్కడా ఏనాడూ కనని వినని విధంగా రోజుకు పది బహిరంగ సభల సుడిగాలి ప్రచారంతో కేసీఆర్ తెలంగాణను హోరెత్తించారు.

సీమాంధ్ర మీడియా, దాని ఇన్‌పుట్ల మీద బతికే జాతీయ మీడియా గుర్తించకపోవచ్చు గానీ ఈ స్థాయి సుడిగాలి ప్రచారం దేశంలోనే మరెక్కడా జరగలేదు. మ్యానిఫెస్టోలను సామాన్యుడి దగ్గరిదాకా తీసుకుపోయిన ఏకైక నాయకుడు దేశంలో కేసీఆర్ ఒక్కడే. దాన్ని అరటిపండు ఒలిచినట్టు సామాన్యప్రజలకు వివరించిందీ ఆయనే. ఆ క్రమంలోనే తెలంగాణ అంతా నాది.. నాదే అని సగర్వంగా ఫలితాల్లో చూపించారు. దేశంలో వీచిన మోదీ గాలి సైతం కేసీఆర్‌ధాటికి ఇక్కడ దూదిపింజగా మారింది.

ప్రభుత్వంలో నూతనత్వం..

కల్వకుంట్ల చంద్రశేఖర్‌రావు అనే నేను.. అంటూ తెలంగాణ రాష్ట్ర తొలి సీఎంగా ప్రమాణం చేసిన కేసీఆర్ పాలనలో వినూత్న మార్పులు తెచ్చారు. ప్రమాణంచేసిన రోజునే ఉద్యోగుల సభలో పాల్గొని ఇది మా ప్రభుత్వం అన్న భావనను వారిలో కల్పించారు. తన పాలన ఎలా ఉండబోతున్నది కేవలం రోజుల వ్యవధిలోనే సమీక్షా సమావేశాలతో రుచి చూపించారు. తొలి మంత్రి మండలి సమావేశంలోనే 43 తీర్మానాలతో రికార్డు సృష్టించారు. పంటరుణాల మాఫీ వంటి అంశాన్ని అధికారం చేపట్టిన అనతి కాలంలోనే తీసుకున్నారు.

రిజర్వ్‌బ్యాంకుతో ఎదురైన ఇబ్బందులను దాటుకుని రూ.4,200 కోట్లు విడుదల చేసి రుణమాఫీని విజయవంతంగా అమలు చేశారు. కేసీఆర్ పాలన అంటే ఏమిటో దేశానికంతటికీ రుచి చూపించింది సమగ్ర కుటుంబ సర్వే. నెలల తరబడి ప్రణాళికలు, వారాల తరబడి తిరుగుళ్లకు తప్ప జనగణన పూర్తి కాని వ్యవస్థలో 24గంటల వ్యవధిలో రాష్ట్రంలోని ప్రతి పౌరుడి సమగ్రవివరాల సేకరణ అంటే ఒక సాహసం. చెప్పినట్టుగానే ఒకే రోజులో సర్వే పూర్తి చేయించారు. ఈ ఘనతకు ప్రధాని మోదీ అచ్చెరువొందారు. మిషన్ తెలంగాణకి ఉమాభారతి ఫిదా అయి, ప్రారంభోత్సవానికి వస్తానన్నారు. కేసీఆర్ మానస పుత్రిక కేజీ టు పీజీ.. ఇవాళ బీహార్ సర్కార్‌కు మహామంత్రం.

అసెంబ్లీ భిన్న దృశ్యం…

కేసీఆర్ రాజకీయ చాణక్యానికి అసెంబ్లీ సమావేశాలే ప్రత్యక్ష నిదర్శనం. అసెంబ్లీని పద్ధతిగా.. అంతకుమించి బాద్యతగా నిర్వహించడం.. అదీ ఈ రోజుల్లో సాధ్యపడుతుందా? అనే విధంగా జరిపించారు. కాస్త పక్కనే పక్క రాష్ట్ర అసెంబ్లీ భీషణ ప్రకటనలు.. దుర్భాషలు.. కలకంఠి కన్నీటి దృశ్యాలు.. వాయిదాలతో నడిస్తే.. నిర్మాణాత్మక చర్చలతో.. కోరుకున్నన్ని రోజులపాటు తెలంగాణ అసెంబ్లీ నడిచింది. ఎక్కడా లేనివిధంగా బడ్జెట్ పద్దులు ఏకగ్రీవమయ్యాయి. విద్యుత్తుపై ఏపీ ప్రభుత్వానికి నిరసన తెలిపే తీర్మానానికి టీడీపీతో కూడా అవుననిపించడం కేసీఆర్ చాణక్యానికి పరమావధి! అసెంబ్లీలో బడ్జెట్ చర్చకు కేసీఆర్ సమాధానం కచ్చితంగా ఒక రొటీన్ ప్రకటన కాదు.

ఒక సంకల్పం.. ఒక ప్రతిజ్ఞ. డెఫినెట్‌గా దీవించేవారు దీవిస్తరు, శాపించేవారు శాసిస్తరు అధ్యక్షా! మేం ఏమీ చిన్నబుచ్చుకోదలుచుకోలేదు. ఒక్కటి మాత్రం జరిగితీరుతది.. ఏదన్నా చెప్పడానికి ఆత్మవిశ్వాసం కావాలె.. ధైర్యం కావాలె.. ఢిల్లీకి పోయెనాడు ఐయాం గోయింగ్ ఫ్రం ఆంధ్రప్రదేశ్ స్టేట్.. ఐ విల్ కం బాక్ టు తెలంగాణ స్టేట్ అని చెప్పిన.. ఢిల్లీకి పోయిన నెల పదిహేను రోజుల వ్యవధిలో తెలంగాణ రాష్ట్రంలనే అడుగు పెట్టిన. ఎవరు అవునన్నా, కాదన్నా.. నాలుగేండ్ల తర్వాత కచ్చితంగా ప్రతి ఇంట్లో పరిశుభ్రమైన మంచినీరు ఇచ్చి తీరుతం.

రెండున్నరేండ్లలో రైతులకు 24 గంటల కరెంటును సరఫరా చేసి చూపిస్తం. 45వేల చెరువులు నాలుగేండ్లలో కళకళలాడుతూ ఉంటై. సంతోషపడేవాళ్లు సంతోషపడ్తరు. నిప్పులు పోసుకునే వాళ్లు నిప్పులు పోసుకుంటరు. వాళ్ల ఖర్మ.. అంటూ అసెంబ్లీ సమావేశాల్లో కేసీఆర్ చెప్పిన మాటలు.. తీసుకున్న ప్రతిజ్ఞలు.. రానున్న సంవత్సరాలను ఆయన ఎలా పాలించబోతున్నారో చెప్పకనే చెబుతున్నాయి.

తెలంగాణకు మధుర జ్ఞాపకం.. 2014

-ప్రపంచానికి తెలంగాణ శక్తియుక్తులు చూపిన సంవత్సరం
-బంగారు తెలంగాణకు బలమైన అడుగులు

న్యూఢిల్లీ, డిసెంబర్ 31 (టీ మీడియా): తెలంగాణ ప్రజలకు జీవితాంతం మర్చిపోలేని మధుర జ్ఞాపకాలను అందించిన 2014 సంవత్సరం తెలంగాణ చరిత్రలో అత్యంత ప్రముఖ స్థానం సంపాదించుకున్నది. తెలంగాణ ప్రజల 60 ఏండ్ల స్వపరిపాలన కల నెరవేరింది. ఆ సంవత్సరమే. యావత్ భారత్‌తోపాటు ప్రపంచానికి తెలంగాణ పోరాటయోధుల శక్తి, యుక్తులు, ధర్మ నిరతిని తెలిపిన సంవత్సరం 2014.

రాష్ట్ర సాధనకు 14 ఏండ్ల మలివిడత పోరాటం ఢిల్లీలో కూడా ఉవ్వెత్తున ఎగిసిన సంవత్సరమిది. 2014లో దాదాపు సగభాగం తెలంగాణ ప్రజలు ఢిల్లీవైపే చూస్తూ ఉండిపోయారు. మడమతిప్పని పోరాటంతో స్వరాష్ర్టాన్ని సాధించుకున్నారు. లోక్‌సభలో ఫిబ్రవరి 18వ తేదీన ఆమోదం పొందిన తెలంగాణ బిల్లు రెండు రోజుల అనంతరం ఫిబ్రవరి 20వ తేదీన పలు సవరణలతో రాజ్యసభలో ఆమోదం పొందటంతో తెలంగాణ ఉత్సవాల్లో మునిగితేలింది.

తెలంగాణ రాష్ట్ర సాధనలో 2014లో కొన్ని మైలురాళ్లు

జనవరి 8, 2014: శాసనసభ, శాసనమండలిలో ఏపీ పునర్విభజన బిల్లుపై ప్రారంభమైన చర్చ
జనవరి 21, 2014 : రాష్ట్ర ప్రభుత్వ విజ్ఞప్తి మేరకు బిల్లును తిప్పి పంపడానికి వారం గడువును పొడిగించిన రాష్ట్రపతి
జనవరి 27, 2014: బిల్లును వ్యతిరేకిస్తూ తీర్మానం చేయాలని కోరుతూ శాసనసభ స్పీకర్‌కు నోటీసు ఇచ్చిన కిరణ్‌కుమార్‌రెడ్డి
జనవరి 30 , 2014: బిల్లును వ్యతిరేకించాలని కోరుతూ ప్రవేశపెట్టిన తీర్మానానికి ఆమోదం. రాష్ట్రపతికి పంపరాదని తీర్మానం.
ఫిబ్రవరి 5, 2014 : ఢిల్లీలోని జంతర్‌మంతర్‌లో ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డి ఒక రోజు దీక్ష.
ఫిబ్రవరి 7, 2014 : బిల్లును రాష్ట్రపతికి పంపిన కేంద్ర ప్రభుత్వం.
ఫిబ్రవరి 11, 2014 : కేంద్ర ప్రభుత్వంపై అవిశ్వాస తీర్మానం ప్రవేశపెట్టిన ఆరుగురు సీమాంధ్ర కాంగ్రెస్ ఎంపీల బహిష్కరణ
ఫిబ్రవరి 13, 2014 : అప్పటి హోం మంత్రి సుశీల్‌కుమార్ షిండే లోక్‌సభలో తెలంగాణ బిల్లును ప్రవేశపెట్టారు.
ఫిబ్రవరి 18, 2014: లోక్‌సభలో బిల్లుపై చర్చ, మూజువాణి ఓటుతో లోక్‌సభ ఆమోదం. సభలో పెప్పర్‌స్ప్రే చల్లిన లగడపాటి
ఫిబ్రవరి 20, 2014: రాజ్యసభలో తెలంగాణ బిల్లును ప్రవేశపెట్టిన షిండే, రాత్రి 8.05 గంటలకు మూజువాణి ఓటుతో ఆమోదం

రాజకీయ చాణక్యం..

ఆరు నెలల కాలం అంటే హనీమూన్ పీరియడ్ ముగిసినట్టేననేది రాజకీయ నిర్వచనం. కానీ ఆరు నెలల కాలంలో కేసీఆర్ రాజకీయంగా విశ్వరూపం చూపించారు. తెలంగాణ ప్రకటన వచ్చిననాడు పార్టీని కాంగ్రెస్‌లో విలీనం చేస్తారా? అనే స్థితి ఉండేది. ఇవాళ అదే కాంగ్రెస్ నేతలు తెలంగాణ భవన్ చుట్టూ చక్కర్లు కొడుతున్నారు. రెండేండ్ల క్రితం రాజ్యసభ సభ్యుడు వీ హనుమంతరావు సోనియా తెలంగాణ ఇస్తే.. కేసీఆర్ ఇంటిముందు ఎవరూ మిగలరు అంటూ ప్రకటన చేశారు. కానీ ఇవాళ గాంధీ భవన్‌ముందు జనసంచారం తగ్గిపోయింది. ఇవాళ ఆ పార్టీకి ఒక్క జెడ్పీ కూడా మిగలలేదు.

( నమస్తే తెలంగాణ సౌజన్యంతో )

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *