mt_logo

ఐటీ నియామకాల్లో హైదరాబాద్ టాప్

దేశంలో కొవిడ్‌ పరిస్థితులు సద్దుమణగడంతో ప్రైవేట్‌ రంగంలో ఉద్యోగ నియామకాల ప్రక్రియ పుంజుకొంటున్నది. గత ఏడాదితో పోలిస్తే ఈ ఏడాది మార్చిలో నియామకాలు 6% పెరిగినట్టు మాన్‌స్టర్‌ ఇండియా ఎంప్లాయ్‌మెంట్‌ ఇండెక్స్‌ (ఎంఈఐ) స్పష్టం చేసింది. ఐటీ, సాఫ్ట్‌వేర్‌, హార్డ్‌వేర్‌ రంగాలకు సంబంధించిన ఉద్యోగ నియామకాల్లో హైదరాబాద్‌ 39% వృద్ధిరేటుతో అగ్ర స్థానాన్ని కైవసం చేసుకొన్నది. హైదరాబాద్‌తోపాటు ఢిల్లీ ఎన్‌సీఆర్‌ కూడా 39% వృద్ధిని నమోదు చేసింది. ఆ తర్వాతి స్థానాల్లో చెన్నై (35 శాతం), బెంగళూరు (31 శాతం), ముంబై (29 శాతం) ఉన్నాయి. దేశంలోని 11 మహా నగరాల్లో రెండంకెల వృద్ధి నమోదయిందని, మిగిలిన 2 మెట్రో నగరాల్లో మాత్రం నియామకాలు గతంలో కంటే తగ్గాయని విడుదల చేసిన వార్షిక నివేదికలో ప్రకటించింది. అన్ని రంగాల్లో కలుపుకొని 16% వృద్ధిరేటుతో హైదరాబాద్‌ దేశంలోనే తృతీయ స్థానంలో నిలిచినట్టు వెల్లడించింది. బ్యాంకింగ్‌, ఆర్థిక సేవలు, బీమా, ఐటీ రంగాల్లో నియామకాలు క్రమంగా పెరుగుతున్నట్టు పేర్కొన్నది. ఇంజినీరింగ్‌, సిమెంట్‌, నిర్మాణ, ఇనుము/ఉక్కు తదితర రంగాల్లో ఉద్యోగ నియామకాలు దాదాపు 20% తగ్గినట్టు తెలిపింది. ప్రస్తుతం పలు కంపెనీలు ‘వర్క్‌ ఫ్రం హోం’ విధానానికి స్వస్తి పలికి ‘వర్క్‌ ఫ్రం ఆఫీస్‌’ విధానాన్ని ప్రారంభిస్తుండటంతో మున్ముందు ఉద్యోగ నియామకాలు మరింత పెరిగే అవకాశం ఉన్నదని అంచనా వేసింది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *