mt_logo

బోయింగ్ విమాన సంస్థకు విడిభాగాలు సప్లై చేసిన హైదరాబాద్ కంపెనీ

హైదరాబాద్ కు చెందిన ఆజాద్ ఇంజనీరింగ్ ప్రయివేట్ కంపెనీ బోయింగ్ విమాన సంస్థ విడిభాగాలను అందించడంలో విజయవంతం అయ్యింది. విమానాల విడి భాగాల మొద‌టి క‌న్‌సైన్‌మెంట్‌ను బోయింగ్ సంస్థ‌కు స‌కాలంలో అందించిన‌ట్లు ఆజాద్ ఇంజినీరింగ్ కంపెనీ మేనేజింగ్ డైరెక్ట‌ర్ రాకేశ్ చోప్దార్ వెల్ల‌డించారు. విమాన విడి భాగాల‌ను త‌యారు చేసి, స‌ర‌ఫ‌రా చేయ‌డానికి ఆజాద్ ఇంజినీరింగ్ కంపెనీతో 2021, జులైలో బోయింగ్ సంస్థ ఒప్పందం కుదుర్చుకున్న సంగ‌తి తెలిసిందే. ఈ సంద‌ర్భంగా ఎండీ రాకేశ్ చోప్దార్ మాట్లాడుతూ.. బోయింగ్ సంస్థ‌కు విమానాల విడి భాగాల‌ను అనుకున్న స‌మ‌యానికే అందించామ‌ని తెలిపారు. తమ కంపెనీ త‌యారు చేసిన విమానాల విడి భాగాల‌ను ప్ర‌పంచ వ్యాప్తంగా ఉన్న బోయింగ్ విమానాల‌న్నింటిలో ఉప‌యోగిస్తారు. ఈ క్ర‌మంలో తెలంగాణ‌కు, దేశానికి ఇది ఒక ముఖ్య‌మైన సంద‌ర్భం అని చోప్దార్ పేర్కొన్నారు. త‌యారీ ప్లాంట్ ఏర్పాటు నుంచి మొద‌లుకుంటే.. అనుమ‌తులు, అంచ‌నాలు, ఆడిట్స్ పూర్తి చేసుకుని, విమానాల విడి భాగాల‌ను త‌యారు చేసి స‌రైన స‌మ‌యానికి అందించ‌డం అంత సుల‌భం కాద‌న్నారు. ఈ మైలురాయిని సాధించేందుకు చాలా క‌ష్ట‌ప‌డ్డామ‌ని స్ప‌ష్టం చేశారు. ఈ సంద‌ర్భంగా విమానాల విడి భాగాల‌ను స‌కాలంలో అందించిన ఆజాద్ ఇంజినీరింగ్ కంపెనీకి బోయింగ్ ఇండియా సప్లై చైన్ ఎండీ అశ్వినీ భార్గ‌వ అభినంద‌న‌లు తెలిపారు. ఆజాద్ ఇంజినీరింగ్‌తో సుదీర్ఘ‌మైన‌, విజ‌య‌వంత‌మైన భాగ‌స్వామ్యం కోసం తాము ఎదురుచూస్తున్న‌ట్లు పేర్కొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *