By Anji Babu
హైదరాబాద్… నాలుగువందల యేళ్ల చరిత్ర కలిగిన భాగ్యనగరం ప్రేమ పునాదుల మీద నిర్మించబడింది. చరిత్ర తెలియకుండా మాట్లాడే సూడో ఇంటలెక్చువల్స్ అందరికి చిన్న విన్నపం. ఒక్కసారి మీ చెప్పులు పక్కనపెట్టి నిర్మలంగా కళ్లు తెరిసి చూడండి. షెహనాయ్ రాగంలో మీ దేహం పింఛంలా పురి విప్పుతుంది. గల్లిగల్లీలో పాన్ సుగంధం అలుముకుంటది. దట్ ఈజ్ హైదరాబాద్.
భాగ్యనగర సంస్కృతీ, సంప్రదాయాల గురించి ఏం తెలుసని నోరు పారేసుకుంటున్నారు. వందల యేళ్ల చరిత్ర కలిగిన హైదరాబాద్ ప్రేమపునాదుల మీద వెలిసిందన్న సంగతి మరిచిపోయారా? అవును హైదరాబాదీలు నవాబులే. సంస్కృతిలో నవాబులు. సాంప్రదాయంలో నవాబులు. ప్రేమను పంచడంలో నవాబులు. స్నేహహస్తాన్ని చాటటంలో నవాబులు.
హైదరాబాదీలకు రెండు నాల్కలుండవు. హైదరాబాదీలకు వెన్నుపోటు రాజకీయాలు తెలియవు. పొద్దున లేస్తే ఎవరికి గోతులు తవ్వుదామా అని ఆలోచించరు. కబ్జాలు తెలియవు. కల్లిబొల్లి కబుర్లు తెలియవు. మొసలి కన్నీళ్లు కార్చడం చేతకాదు. సాఫ్ సీదా మాట్లాడుతరు. దోస్తానా చేస్తే ప్రాణమిస్తరు. కష్టం వస్తే..కడుపున పెట్టుకుంటరు. పక్కోడికి కన్నీళ్లొస్తే.. తుడిచే వేలవుతరు. ఆనందమొస్తే పంచుకునే తోడవుతరు. ఆకలైతే కంచంలో పిడికెడు మెతుకులవుతరు. అన్నింటికి మించి తోడబుట్టిన వాళ్లవుతరు.
హైదరాబాదీలు శ్రమైక జీవులు. శ్రమలో ఆనందాన్ని వెతుక్కునే వట్టి వెర్రి బాగులోళ్లు. హైదరాబాదీలు అమాయకులు. బతుకడానికి వచ్చినోళ్లకు దారిపొడవునా దివిటీలవుతరు. హైదరాబాదీలు సోమరిపోతులు కాదు. కష్టజీవులు. సౌందర్యారాధకులు. వాళ్లు శ్రమిస్తేనే భాగ్యనగరం అందంగా ప్రాణం పోసుకుంది. వాళ్లు అహోరాత్రులు కష్టపడితేనే.. ఇవాళ సోకాల్డ్ వలసవాదులు నగరం నీడన సేదతీరుతున్నది. వాళ్ల చెమటచుక్కల ఫలితమే.. ఇవాళ ప్రపంచ పటంమీద హైదరాబాద్ సగర్వంగా చేతులు చాపి నిలబడ్డది.
అవును గానా భజానా చేస్తం. కానీ అది వొళ్లమ్ముకునే నీచ సంప్రదాయంలో కాదు. అందులో పవిత్రతుంది. సౌందర్యముంది. దైవత్వముంది. సాహిత్యముంది. కళాపోషణుంది. అన్నిటికీ మించి కల్లాకపటం లేని సంస్కృతి దాగుంది. హైదరాబాద్ కల్చర్ గురించి నోటికొచ్చినట్లు మాట్లాడే వాళ్లందరికి చిన్న విన్నపం. ఒక్కసారి మీమీ చెప్పులొదిలేసి..కళ్లు తెరుచుకుని హైదరాబాద్‌ని నిర్మల మనసుతో ఆలకించండి. భాగ్యనగరం వజ్రంలా మెరిసిపోతున్న ఓ పాలరాతి శిల్పంలా కనిపిస్తుంది.
హైదరాబాద్ ఒక సుందర స్వప్నలోకం. నయాపూల్ మీద నిలబడి చూడు ఆకాశానికి ప్రేమ బాహువులు చాపిన చార్మినార్ కనిపిస్తది. కళ్లల్లో బారాత్ వెన్నెల వెలుగుల లాడ్ బజార్ కనిపిస్తది. ఆ గాజుల చప్పుడు విను. సెలయేటి అలల్లా చెవికెంత ఇంపుగా ఉంటయో. కొంచెం పాదాలెత్తి చూడు. అరబ్బీ అప్సరసలా ఫలక్‌నామా కనిపిస్తుంది. గర్వంగా నిలబడ్డ గోలకొండను చూడు. అంబారీ ఎనుగును ఎక్కినంత సంబరపడుతవ్.
ఒక్కసారి చుట్టూ తిరిగి చూడు. పూలకొంగును మొఖాన కప్పుకున్న ఆకాశం నీమీద పరుచుకున్నట్లు అనిపిస్తుంది. మీనార్ బురుజుల్లో కువకువలాడుతున్న శాంతికపోతాల్లా జంట నగరాలు కనిపిస్తయ్. ఆ సౌందర్యానికి దండంపెట్టు. ఆ చక్కదనానికి ముచ్చట పడు. ఆ వన్నె తరగని సంస్కృతి ముందు సాష్టాంగపడు. టైం దొరికితే షహనాయ్ రాగంలో కరిగిపో. వెన్నెల రాత్రుల్లో ముషాయిరాలో తడిసిపో.