శాసనమండలి చైర్మన్ గా టీఆర్ఎస్ ఎమ్మెల్సీ స్వామిగౌడ్ 21 ఓట్లతో విజయం సాధించారు. మొత్తం 21 ఓట్లు పోలవ్వగా ఓట్లన్నీ స్వామిగౌడ్ కే పోలయ్యాయి. కాంగ్రెస్ పార్టీ రహస్య ఓటింగ్ ను నిరసిస్తూ శాసనమండలి ఓటింగ్ నుండి తప్పుకుంటున్నట్లు ప్రకటించడంతో ఆ పార్టీ అభ్యర్థికి సున్నా ఓట్లు పోలయ్యాయి. టీడీపీ కూడా రహస్య ఓటింగ్ జరపడాన్ని నిరసిస్తూ ఓటింగ్ ను బహిష్కరించింది. దీనితో స్వామిగౌడ్ గెలిచినట్లు మండలి డిప్యూటీ చైర్మన్ నేతి విద్యాసాగర్ రావు ప్రకటించారు.
ఫలితాలు ప్రకటించగానే స్వామిగౌడ్ ను ఉపముఖ్యమంత్రి మహమూద్ అలీ, మంత్రులు చైర్మన్ పీఠం వద్దకు సాదరంగా తీసుకువచ్చి కూర్చోబెట్టారు. కాంగ్రెస్ ఎమ్మెల్సీలు యాదవరెడ్డి, రాజేశ్వర్ రావు, నేతి విద్యాసాగర్ రావు, భానుప్రసాద్, భూపాల్ రెడ్డి, అమోస్, జగదీశ్వర్ రెడ్డి, రాజలింగం స్వామిగౌడ్ కు ఓటేశారు. ఎమ్మెల్సీ ప్రొ. నాగేశ్వర్ కూడా స్వామిగౌడ్ కే ఓటు వేశారు.
ఈ సందర్భంగా కాంగ్రెస్ ఎమ్మెల్సీ యాదవరెడ్డి మాట్లాడుతూ, తెలంగాణ ఉద్యమంలో స్వామిగౌడ్ పాత్ర కీలకమైందని అన్నారు. 60 ఏళ్ల తర్వాత తెలంగాణ వచ్చిందని, బంగారు తెలంగాణను నిర్మించుకోవాలని, రాష్ట్రంలో తాగు, సాగునీరు, విద్యుత్ సమస్యలను పరిష్కరించడంలో ప్రభుత్వం దృష్టి పెట్టాలని కోరారు. ఆర్ధిక మంత్రి ఈటెల రాజేందర్ తెలంగాణ మొదటి శాసనమండలి చైర్మన్ గా ఎన్నికైన స్వామిగౌడ్ కు శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, సకలజనుల సమ్మెలో స్వామిగౌడ్ పాత్ర మరువలేనిదని, అసెంబ్లీలో స్పీకర్, శాసనమండలిలో చైర్మన్ గా బలహీనవర్గాలకు చెందిన నేతలనే ఎన్నుకున్న ఘనత టీఆర్ఎస్ సర్కారుదని పేర్కొన్నారు.