ఐటీ ఉద్యోగం కావాలంటే గతంలో టెకీలు బెంగళూరు, పుణె, చెన్నై, నేషనల్ క్యాపిటల్ రీజియన్, ముంబై లాంటి ప్రాంతాలకు వెళ్లాల్సి వచ్చేది. కానీ ఇపుడు ఐటీ ఉద్యోగులకు అడ్డాగా మారింది హైదరాబాద్. ఐటీ శిక్షణతోపాటు నియామకాల్లోనూ హైదరాబాద్ గణనీయ అభివృద్ధి సాధించింది. కరోనా వల్ల తీవ్రమైన ప్రతికూల పరిస్థితులు నెలకొన్నప్పటికీ దేశంలో ఈ ఏడాది మార్చి-ఆగస్టు మధ్యకాలంలో జరిగిన ఐటీ ఉద్యోగుల నియామకాల్లో హైదరాబాద్, పుణె నగరాలు 18%తో ద్వితీయ స్థానంలో నిలిచాయి. ఈ జాబితాలో బెంగళూరు 40% నియామకాలతో మొదటి స్థానాన్ని కైవసం చేసుకున్నది. ఐటీ నియామకాల్లో ఢిల్లీ, ముంబై, కోల్‌కతా, చెన్నై లాంటి ప్రముఖ నగరాలు చాలా వెనుకబడి ఉన్నాయని క్వెస్ సంస్థ తన తాజా నివేదికను వెల్లడించింది. బెంగళూరు, హైదరాబాద్, పుణె నగరాల్లోనే దాదాపు 400% వరకు ఉద్యోగావకాశాలు పెరిగినట్టు ఆ నివేదికలో పేర్కొంది. దేశీయ ఐటీ రంగంలో ప్రధానంగా బెంగళూరుతో పోటీపడుతున్న హైదరాబాద్ పలు జాతీయ, అంతర్జాతీయ ఐటీ, ఐటీ ఆధారిత సేవల కంపెనీలను విశేషంగా ఆకర్షిస్తోంది. పెట్టుబడులకు హైదరాబాద్‌లో ఎంతో అనువైన వాతావరణం ఉండటంతో ఇప్పటికే అనేక కంపెనీలు ఇక్కడ తమ కార్యాలయాలను ఏర్పాటు చేసుకున్నాయి. ఫలితంగా గత రెండేళ్లలో హైదరాబాద్‌లో ఐటీ ఉద్యోగావకాశాలు గణనీయంగా పెరిగినట్టు క్వెస్ తెలిపింది. ఏడాది క్రితం హైదరాబాద్‌లో 5.50 లక్షలుగా ఉన్న ఐటీ ఉద్యోగుల సంఖ్య ఇప్పుడు 6.20 లక్షలకు పెరిగినట్టు గణాంకాలు తెలుపుతున్నాయి.
దేశీయ ఐటీ నియామకాల్లో హైదరాబాద్ వాటా:
ఇటీవల దేశవ్యాప్తంగా జరిగిన ఐటీ ఉద్యోగ నియామకాల్లో హైదరాబాద్ పలు విభాగాల్లో సత్తా చాటింది. డాటా ఎనలిటిక్స్ విభాగంలో 40%, ఫుల్ స్టాక్ డెవలపర్స్ విభాగంలో 37%, క్లౌడ్ టెక్ డెవలపర్ల విభాగంలో 26% నియామకాలు హైదరాబాద్‌లోనే జరగడం విశేషం. వీటితో పాటు గేమింగ్, యూనిటీ డెవలపర్స్, సేల్స్‌ఫోర్స్, సాప్ హనా లాంటి విభాగాల్లో కూడా హైదరాబాద్‌లో చాలా మందికి ఉద్యోగాలు లభించాయి. గత రెండు, మూడేండ్ల నుంచి హైదరాబాద్‌లో అనేక జాతీయ, అంతర్జాతీయ కంపెనీలు తమ కార్యకలాపాలను భారీస్థాయిలో విస్తరిస్తుండటమే ఇందుకు కారణమని క్వెస్ వెల్లడించింది.
ఉద్యోగావకాశాలు కల్పించిన ప్రముఖ కంపెనీలు:
కరోనా సమయంలో చాలా ఐటీ కంపెనీలు కొత్త ఉద్యోగులను నియమించుకున్నాయి. వీటిలో టీసీఎస్, యాక్సెంచర్, ఓరాకిల్, కాగ్నిజెంట్, సిటీ, ఉబర్, బజాజ్ ఫిన్‌సర్వ్, ఎల్‌టీఐ, వీఎంవేర్, హర్‌మాన్ ఇంటర్నేషనల్, ఐడీఎం, విప్రో, జెన్‌ప్యాక్ట్, జెపీ మోర్గాన్ చేస్, మోర్గాన్ స్టాన్లీ, వెల్స్ ఫార్గో, ఫ్లిప్‌కార్ట్, ఇన్ఫోసిస్ లాంటి పలు ప్రధాన కంపెనీలు ఉన్నట్టు ఉద్యోగుల నియామక సంస్థ ఎక్స్‌ఫినో వెల్లడించింది.