ముఖ్యమంత్రి శ్రీ కే. చంద్రశేఖర్ రావు పుట్టినరోజు సందర్భంగా ఆదివారం హైదరాబాద్ నెక్లెస్ రోడ్ లోని పీపుల్స్ ప్లాజాలో నమస్తే తెలంగాణ, టీ న్యూస్, తెలంగాణ జాగృతి ఆధ్వర్యంలో అవయవదాన సంకల్ప కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమానికి అన్ని వర్గాల ప్రజలనుండి ప్రతికూల స్పందన వచ్చింది. ఈ సందర్భంగా నిజామాబాద్ ఎంపీ కవిత మాట్లాడుతూ అవయవదానంతో వేలమందికి పునర్జన్మ లభిస్తుందని, చనిపోయిన వ్యక్తిని బతికున్న వాళ్ళలో చూసుకునే అవకాశం కలుగుతుందని అన్నారు. అవయవదానంలో తెలంగాణ మొదటిస్థానంలో ఉందని ఆమె చెప్పారు. కోట్లాదిమంది ప్రజలను పరాయిపాలన నుండి విముక్తి చేసిన గొప్ప నాయకుడు మన ముఖ్యమంత్రి కేసీఆర్ గారని, అడక్కుండానే ఆయన అన్నీ ఇస్తున్నారని, మారుమూల గ్రామంలో పేదతల్లికి కష్టం వస్తే ఇక్కడ ఆయన కండ్లలో నీళ్ళు తిరుగుతాయని అన్నారు.
జమ్మూ కాశ్మీర్ లో సైనికులపై జరిగిన దాడిపట్ల సీఎం కేసీఆర్ గారు కలత చెంది తన పుట్టినరోజు వేడుకలు జరుపుకోవద్దని నిర్ణయం తీసుకున్నారని కవిత చెప్పారు. పుట్టినరోజు సందర్భంగా కేసీఆర్ గారికి మంచి ఆయుష్షును ఇవ్వాలని దేవుడ్ని ప్రార్ధించడం, అవయవదానంతో వేలాదిమంది ఊపిరిపోసుకుని ఆరోగ్యంగా జీవించాలని కోరుకుందామని ఎంపీ కవిత ఈ సందర్భంగా పిలుపునిచ్చారు. తెలంగాణను దేశంలోనే ముందువరుసలో నిలిపిన సీఎం కేసీఆర్ గారు మన భవిష్యత్తుకు బాటలు వేస్తున్నారని, చంద్రుడికో నూలుపోగులా ఆయన జన్మదినం రోజున అవయవదానం కార్యక్రమం మొదలుపెట్టామని, ఇది రాష్ట్రంలోని అన్ని జిల్లాల్లో సంవత్సరమంతా కొనసాగుతుందన్నారు.
కనీసం 50 వేలమందిని చేర్చాలనేది తమ లక్ష్యమని, నిమ్స్ దవాఖానలోని జీవన్ దాన్ ట్రస్ట్ తో కలిసి తెలంగాణ జాగృతి అవయవదాన కార్యక్రమాన్ని ముందుకు తీసుకెళ్తుందని ఎంపీ కవిత స్పష్టం చేశారు. ఈ సందర్భంగా అవయవదానంపై తెలంగాణ జాగృతి, నిమ్స్ ఆధ్వర్యంలోని జీవన్ దాన్ సంస్థ మధ్య ఒప్పందం కుదిరింది. ఎంపీ కవిత, జీవన్ దాన్ చైర్మన్ రమేష్ రెడ్డి ఈ ఒప్పందంపై సంతకాలు చేశారు. అనంతరం ఎంపీ కవిత సహా కార్యక్రమానికి హాజరైన 863 మంది అవయవదాన పత్రాలపై సంతకాలు చేశారు. రాష్ట్రవ్యాప్తంగా మొత్తం 4,353 మంది అవయవదానం చేయడానికి ముందుకు వచ్చారు.