తెలంగాణలో రాగల మూడు రోజుల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ వెల్లడించింది. శుక్రవారం జగిత్యాల, రాజన్న సిరిసిల్ల, కరీంనగర్, పెద్దపల్లి, జయశంకర్ భూపాలపల్లి, సిద్దిపేట, కామారెడ్డి జిల్లాల్లో అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని హెచ్చరించింది. ఆదిలాబాద్, కొమ్రంభీమ్ ఆసిఫాబాద్, మంచిర్యాల, నిర్మల్, నిజామాబాద్, ములుగు, భద్రాద్రి కొత్తగూడెం, మహబూబాబాద్, వరంగల్, హన్మకొండ, మహబూబ్‌నగర్, నాగర్ కర్నూల్, వనపర్తి, నారాయణపేట, జోగులాంబ గద్వాల జిల్లాల్లో భారీ వర్షాలు కురిస్తాయని తెలిపింది. ఆదివారం మంచిర్యాల, నిర్మల్, నిజామాబాద్ జిల్లాల్లో అత్యంత భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని పేర్కొంది. ఈ మేరకు అప్రమత్తంగా ఉండాలని ఆయా జిల్లా కలెక్టర్లను హెచ్చరించింది. రాష్ట్రంలో నైరుతి రుతుపవనాలు చురుగ్గా కదులుతున్నాయి. అహ్మదాబాద్ నుంచి గుణ, జబల్‌పూర్, పెండ్రా, ఝూర్సుగూడ, గోపాల్‌పూర్ మీదుగా నైరుతి అనుకొని తూర్పు మధ్య బంగాళాఖాతం వరకు రుతుపవన ద్రోణి సముద్ర మట్టానికి 1.5 కిలోమీటర్ల వరకు విస్తరించిం ఉంది. ఆవర్తనం దక్షిణ ఒడిశా- ఉత్తరాంధ్ర తీరాలకు ఆనుకొని ఉన్న వాయువ్య,పశ్చిమ మధ్య బంగాళాఖాతం తీరంలో సగటు సముద్ర మట్టం నుంచి 7.6 కిలో మీటర్ల వరకు విస్తరించి, ఎత్తుకు వెళ్లే కొద్ది నైరుతి దిశగా వంపు తిరిగి ఉంది. దీని ప్రభావం తెలంగాణపై బాగా ఉంది. దీంతో రాష్ట్రంలో విస్తారంగా వర్షాలు కురుస్తున్నాయి.