ఆరోగ్య తెలంగాణ కోసం హెల్త్ ప్రొఫైల్‌ను రూపొందిస్తున్నామని సీఎం కే చంద్రశేఖర్‌రావు తెలిపారు. గురువారం ప్రపంచ ఆరోగ్య దినోత్సవం సందర్భంగా రాష్ట్ర ప్రజలకు ఆయన శుభాకాంక్షలు తెలిపారు. ప్రజలు చక్కటి ఆరోగ్యంతో, సుఖసంతోషాలతో జీవించాలని ఆకాంక్షించారు. రాష్ట్ర ప్రజల ఆరోగ్య పరిరక్షణకు రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక శ్రద్ధతో కృషి చేస్తున్నదని వెల్లడించారు. ప్రజా వైద్యం, ఆరోగ్య రంగాల్లో రాష్ట్రం రోజురోజుకు గుణాత్మక పురోగతి సాధిస్తున్నదని వివరించారు. ఇప్పటికే పలు పథకాలను అమలు చేస్తున్న రాష్ట్ర ప్రభుత్వం, ప్రజారోగ్య పరిరక్షణే పరమావధిగా పనిచేస్తున్నదని స్పష్టం చేశారు. వైద్యరంగానికి బడ్జెట్‌లో భారీగా నిధులు పెంచామని, వైద్య శాఖలో కొత్తగా 21,073 పోస్టులు మంజూరు చేశామని తెలిపారు.
బస్తీ దవాఖానలు :
‘ప్రజల వద్దకే వైద్యం’ లక్ష్యంతో బస్తీ దవాఖానలు విజయవంతంగా ప్రజాదరణ పొందుతున్నాయని, దాని స్ఫూర్తితో ఏర్పాటైన పల్లె దవాఖానలు సేవలు అందిస్తున్నాయని సీఎం కేసీఆర్ వెల్లడించారు. జీహెచ్‌ఎంసీ పరిధిలో 350 బస్తీ దవాఖానల ద్వారా 81 లక్షల మందికి, 2,250 పల్లె దవాఖానల ద్వారా 19.61 లక్షల మందికి వైద్యం అందించామని వివరించారు. సూపర్ స్పెషాలిటీ దవాఖానల నిర్మాణం, జిల్లాకు ఒక మెడికల్ కాలేజీ, అనుబంధంగా నర్సింగ్ కాలేజీల ఏర్పాటు, నిర్మాణం, మాతాశిశు సంరక్షణ కేంద్రాలు, యూజీ, పీజీ, సూపర్ స్పెషలిటీ వైద్య సీట్ల పెంపు, నర్సింగ్ కాలేజీ సీట్ల పెంపుతో రాష్ట్రంలో ప్రభుత్వ వైద్య సేవలను విసృ్తతపరుస్తున్నామని పేర్కొన్నారు. అటు.. కేసీఆర్ కిట్, ఆరోగ్య లక్ష్మి వంటి పథకాలు ప్రజారోగ్య రంగంలో గుణాత్మక మార్పునకు దోహదం చేస్తున్నాయని తెలిపారు. తెలంగాణ డయాగ్నస్టిక్ సెంటర్ల ఏర్పాటుతో ఉచిత వైద్య పరీక్షలు నిర్వహిస్తున్నామని, ఇది ప్రభుత్వ అప్రమత్తతకు నిదర్శనమని వ్యాఖ్యానించారు.
ఫీవర్ సర్వే దేశానికే ఆదర్శం :
ఉద్యోగుల వయోపరిమితి పెంపుతో పాటు, వైద్య సిబ్బందికి వేతనాలు పెంచామని, ప్రోత్సాహకాలు అందించామని సీఎం కేసీఆర్ తెలిపారు. అటు.. కరోనా కట్టడిలో భాగంగా ఫీవర్ సర్వే నిర్వహించి దేశానికే ఆదర్శంగా తెలంగాణ నిలిచిందని సీఎం స్పష్టం చేశారు. అటు.. ప్రసూతి కేంద్రాల ఆధునీకరణ, అవయవ మార్పిడి కేంద్రాలు, నిమ్స్, గాంధీ, ఉస్మానియాలో కిడ్నీ, గుండె, ఊపిరితిత్తులు, లివర్ మార్పిడి కేంద్రాలను ఏర్పాటు చేశామని సీఎం తెలిపారు. బోన్‌మారో, స్టెమ్ సెల్ చికిత్స కేంద్రాలు తీసుకొచ్చామని అన్నారు.
ఇక ఐదంచెల ఆరోగ్య వ్యవస్థ :
రాష్ట్రంలో ఆరోగ్య సేవలను మూడంచెల వ్యవస్థ నుండి ఐదంచెల వ్యవస్థకు విస్తరించామని కేసీఆర్ వెల్లడించారు. ప్రాథమిక (పీహెచ్‌సీ, సీహెచ్‌సీ), ద్వితీయ (ఏహెచ్, డీహెచ్), తృతీయ – బోధనా దవాఖాన, కొత్తగా ప్రివెంటివ్, సూపర్ స్పెషలిటీ వైద్యాన్ని అందుబాటులోకి తెచ్చామని వివరించారు. పాలియేటివ్ కేర్ ప్రోగ్రాం, ఎన్‌సీడీ స్రీనింగ్ ప్రోగ్రాం, మిడ్ వైఫరీ ప్రోగ్రాం, ఎక్విప్‌మెంట్ మెయింటెనెన్స్ పాలసీ, పారిశుద్ధ్య నిర్వహణ పాలసీ, దవాఖానల్లో రోగులకు డైట్ చార్జీల పెంపు, సహాయకులకు సబ్సిడీ భోజనం వంటివి అందుబాటులోకి తీసుకొచ్చామని అన్నారు. కాగా, ఉక్రెయిన్ వైద్య విద్యార్థులకు మేలు చేకూర్చేలా చర్యలు చేపట్టామని సీఎం కేసీఆర్ పేర్కొన్నారు.