mt_logo

ప్రభుత్వంపై ఆరోపణలు తప్పని నిరూపించడానికి ఏ సెంటర్ కి రావాలి : ఈటెలకు సవాల్ విసిరిన హరీష్ రావు

హుజురాబాద్ ఎన్నికల ప్రచారం వేడెక్కుతోంది. “తెలంగాణ ప్రభుత్వంపై చేసిన ఆరోపణలు తప్పని నిరూపించడానికి ఎక్కడికి రావాలో చెప్పు” అంటూ మంత్రి హరీష్ రావు, ఈటెల రాజేందర్ కు సవాలు విసిరారు. హుజురాబాద్ ఎన్నికల ప్రచారంలో భాగంగా మంగళవారం పెంచికల్ పేట్ లో ఏర్పాటు చేసిన సభలో మంత్రి హరీష్ రావు మాట్లాడుతూ.. తెరాస ప్రభుత్వం రెండు సంవత్సరాల్లో హుజూరాబాద్ లో డబుల్ బెడ్ రూమ్ ఇళ్లు కట్టించి చూపిస్తుందని హామీ ఇచ్చారు. తనను గెలిపిస్తే సేవ చేస్తా అని చెప్పాల్సింది పోయి, 300 రూపాయలు ఇచ్చి తెరాస సభకు రాకుండా ఇంట్లో ఉండండి అని అంటున్నారు ఈటెల, ఇదెక్కడి సంస్కృతి అని ప్రశ్నించారు. ప్రజల్ని ఎంత మభ్య పెట్టినా అన్ని బంధనాలు తెంపుకొని వచ్చి తెరాస ప్రభుత్వానికే ఓటు వేస్తారని హరీష్ రావు అన్నారు. పేద ప్రజల మీద నిజంగా ప్రేమ ఉంటె సీఎం కేసీఆర్ మంజూరు చేసిన 4వేల డబుల్ బెడ్ రూమ్ ఇళ్ళు కట్టించి ఇస్తే బాగుండేది.. పేదలను ఎంతమాత్రం గుర్తుంచుకోని ఈటెల రాజేందర్ ఇపుడు తనకే ఓటు వేయమని ఏం మొహం పెట్టుకుని అడుగుతారంటూ ఘాటు వ్యాఖ్యలు చేశారు. ఇక గ్యాస్ సిలిండర్ ధరలో రాష్ట్ర ప్రభుత్వ పన్ను 291 రూపాయలని అసత్య ప్రచారాలు మొదలు పెట్టారని, ఇది అబద్దం అని నిరూపించడానికి మేము జమ్మికుంటకైనా.. హుజురాబాద్ అయినా.. ఈరోజైన.. రేపైనా రావడానికి సిద్ధంగా ఉన్నామని, ఒకవేళ అసత్య ఆరోపణ అని తేలితే ఈటెల రాజేందర్ ఎన్నికల నుండి తప్పుకోవాలని సవాల్ విసిరారు. ఈటెల రాజేందర్ చేరింది గ్యాస్ ధరలను ఆకాశానికి చేర్చిన బీజేపీ పార్టీలోనేనని, ధరలు పెంచి ప్రజలకు కష్టం కలిగిస్తున్న పార్టీలో చేరి తన బాగు కోసం ఓటు అడిగే హక్కు రాజేందర్ కు లేదని విమర్శించారు. రాష్ట్రాన్ని అభివృద్ధి బాటలో నడిపిస్తున్న సీఎం కేసీఆర్ గారిని గెలిపించాలని ఈ సందర్బంగా మంత్రి హరీష్ రావు ప్రజలను కోరారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *