mt_logo

ఆటో డ్రైవర్ల వరుస ఆత్మహత్యలపై స్పందించిన హరీష్ రావు

రాష్ట్రంలో జరుగుతున్న ఆటో డ్రైవర్ల వరుస ఆత్మహత్యలపై మాజీ మంత్రి హరీష్ రావు స్పందించారు. గత మూడు నెలల్లో సుమారు 40 ఆటో కార్మికులు ఆత్మహత్య చేసుకున్నారు అని వార్తలు వస్తున్న నేపథ్యంలో వెంటనే ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.

ఆటో నడవటం లేదని మనస్తాపంతో, బతుకు భారమై భార్యతో సహా, నిన్న ప్రాణాలు కోల్పోయిన ఆటో సోదరుడి హృదయ విదారక ఘటన కాంగ్రెస్ ప్రభుత్వాన్ని కదిలించకపోవడం బాధాకరమని పేర్కొన్నారు.

తల్లి, తండ్రిని కోల్పోయి, అనాధగా మారిన ఆ బిడ్డ భవిష్యత్‌కు ఎవరు బాధ్యత వహిస్తారు.. ఎవరు భరోసా ఇస్తారు.. అని ప్రశ్నించారు. నిజామాబాద్‌లో జరిగిన ఈ ఘటన పై ప్రభుత్వం తక్షణం స్పందించి పది లక్షల రూపాయల ఎక్స్‌గ్రేషియా ప్రకటించాలి అని కోరారు.

రాష్ట్రంలో వరుసగా ఆటో కార్మికులు ఆత్మహత్యలు చేసుకుంటున్నా ప్రభుత్వం కనీసం స్పందించడం లేదని.. నిర్లక్ష్యం వీడి, ప్రభుత్వం వెంటనే ఆటో డైవర్ల జీవన సమస్యకు పరిష్కారం చూపాలి.. రూ. 12 వేల భృతి ప్రకటించాలి అని హరీష్ రావు అన్నారు.

ఆటో సోదరులు ధైర్యంగా ఉండాలని, తొందరపాటు చర్యలకు పాల్పడవద్దని పిలుపునిచ్చారు.