శాసనసభలో ప్రశ్నోత్తరాల సందర్భంగా సభ్యులు అడిగిన ప్రశ్నలకు మంత్రి హరీష్ రావు సమాధానం చెప్తూ తెలంగాణకు జీవోలు మాత్రమే ఇస్తామని, ప్రాజెక్టులు కట్టం అనేది గత సమైక్య పాలకుల విధానమని అన్నారు. కరువు ప్రాంతాలకు యుద్దప్రాతిపదికన నీళ్లివ్వాలని సీఎం భావిస్తున్నారు. తెలంగాణకు కృష్ణా జలాల్లో 299 టీఎంసీల నికర జలాలు మనకు రావాల్సి ఉంది. మహేశ్వరం, ఇబ్రహీంపట్నం నియోజకవర్గాలకు పాలమూరు, డిండి ఎత్తిపోతల ద్వారా నీరందిస్తామని చెప్పారు. డిండి ప్రాజెక్టు భూసేకరణ కోసం రూ. 100 కోట్లు విడుదల చేశామని, ఈ ప్రాజెక్టుల కోసం త్వరలోనే టెండర్లు పిలుస్తామని హరీష్ రావు తెలిపారు.
డిండి, పాలమూరులపై ఏపీ ప్రభుత్వం కేంద్రానికి ఫిర్యాదు చేసిందని, టీడీపీ నేతలకు చిత్తశుద్ధి ఉంటే చంద్రబాబును ప్రశ్నించాలని, 9 ఏళ్ళు పాలమూరును దత్తత తీసుకున్న చంద్రబాబు ఒక్క ఎకరానికి కూడా నీళ్ళు ఇవ్వలేదని హరీష్ రావు విమర్శించారు. ఏపీలోని పట్టిసీమకు ఎలాంటి అనుమతులు లేవని, ఉమ్మడి రాష్ట్రంలో సక్రమమైన పాలమూరు ప్రాజెక్టు విడిపోయాక అక్రమం ఎలా అవుతుందని మంత్రి ప్రశ్నించారు.