mt_logo

పాత రాగంలో కొత్త విలాపం!

By: సవాల్‌రెడ్డి..

భల్లూక సరసమంటే బరకడము పీకడమేనని… సామెత! ఎలుగుబంటికి లవ్వు పుట్టుకొస్తే గీకుతుంది.. లేదా పీకుతుంది. పాపం దానికి తెలిసిన వ్యక్తీకరణ అదే. సరిగ్గా రాధాకృష్ణ తెలంగాణ ప్రేమా రైతు ప్రేమా.. భల్లూక సరసమే. అది తెలంగాణ ప్రజలందరికీ తెలుసు.

యతి హృదయం మశుద్ధం తస్య సర్వం విరుద్ధమ్!చిత్తం కళంకితమైన వానికి సర్వము విరుద్ధంగానే ఉంటుంది.
సెంటిమెంట్ పోయిందోచ్ అని రాధాకృష్ణ పాట మొదలు పెట్టినపుడు నిక్కర్లేసుకున్నవారు ఇపుడు పాంట్లేసుకునే వయసుకు వచ్చారు. పాపం ఆయన పాటా మారలేదు. పాట్లూ మారలేదు. వైఫల్యాలు ఎదురవుతాయని తెలిసీ పదేపదే పాత ప్రయత్నాలు చేసే విపరీత వైఖరిని వైద్య పరిభాషలో ఏమంటారో తెలియదు కానీ ఆ సమస్య ఆయనను వెంటాడుతున్నట్టే కనిపిస్తున్నది. అది శ్రుతి మించి తాజా కొత్తపలుకులో డిలీరియమ్ వంటి అదుపుతప్పిన పదాలు వాడేశారు. కేసీఆర్ లక్ష్యంగా సాగిన ముప్పావు పేజీ వచన విలాపంలో ఏముంది? అదే ఏడుపు.. అదే మిడుకుడు. కేసీఆర్ చెబుతాడు చేయడు. ఆంధ్రావాళ్లను అడ్డుపెట్టుకుని రాజకీయాలు చేస్తాడు. ఈ ప్రభుత్వంలో బోలెడంత అవినీతి జరుగుతున్నది. భయపడి ఎవడూ రాసి చావడం లేదు. కేసీఆర్ మాయ చేసి ప్రభుత్వాన్ని నడుపుతున్నాడు. వగైరా వగైరా..!

సరే.. ఏడుపు అనేది వ్యక్తిగత హక్కు. ఎవరైనా వారికి ఓపిక ఉన్నంతవరకూ ఏడ్వవచ్చు. అందులోనూ మీడియా చేతిలో ఉంటే వారానికోసారి వంతు వేసుకుని కరువుదీరా ముప్పాతిక కాకపోతే ఫుల్ పేజీనిండా ఏడ్వవచ్చు. తెలంగాణ ఉద్యమం బీజం పడ్డనాటినుంచి ఈ ఏడుపులు, ముక్కు చీదుళ్లు.. కొత్తేం కాదు. అవి తెలంగాణ వచ్చాకా వినిపిస్తున్నాయి. ప్రజాస్వామ్యదేశం కాబట్టి ఆపలేము. ఎవరైనా ఓదార్పుయాత్రలు చేపట్టేదాకా ఆ ఏడ్పులు ఏడవనిద్దాం.

ఏడ్చేవాళ్లు కూడా నిజాలు కక్కుతారన్న విషయం మాత్రం తాజా కొత్తపలుకులో బయటపడింది.
ఏడిస్తే ఏడ్చాడు కానీ.. ఆర్కే ఓ గొప్ప నిజం కూడా విప్పారు. అప్పట్లో వైఎస్ పత్రికాధిపతులను భోజనానికి పిలిచారు. తెలంగాణ ఉద్యమ వార్తలు, రైతు ఆత్మహత్యల వార్తలు వేయవద్దన్నారుట. అంటారు.. ఎందుకు అనరు? పిలిచిన పాలకులెవరు? వెళ్లిన పత్రికాధిపతులెవరు? అంతా ఆంధ్రామేళమే కదా! మంచిది. అలాగే ఉద్యమం ఉధృతరూపం దాల్చిన కాలంనుంచి మొదలుకుని తెలంగాణ బిల్లు తెచ్చినపుడు, కేసీఆర్ సీఎం వదవి స్వీకరించినపుడు, గురుకుల ఆక్రమణలు కూల్చివేసినపుడు కూడా ఈ గుంపులు ఇలాంటి ఎన్ని మీటింగులు ఎక్కడెక్కడ పెట్టారో.. వాటి ఎజెండాలేమిటో కూడా అన్నీ అదే కాలమ్‌లో పరిచేస్తే బాగుండు. గురుకుల భూముల ఆక్రమణల తొలగింపు సమయంలో సినిమా వాళ్లు, రియల్ వ్యాపారులు, మీడియాధిపతులు, రాజకీయనేతలు ఇలాంటి అర్ధరాత్రి మీటింగొకటి పెట్టారని, ఢిల్లీలోని ఓ వీఐపీతో గంటల తరబడి టెలికాన్ఫరెన్సు సాగించారని అప్పట్లో పాత్రికేయవర్గాల్లో ప్రచారం జరిగింది.

మీరు గవర్నర్ పాలన అంశాన్ని రాజేయండి..నేను ఇటు నరుక్కువస్తానని అటువైపు నుంచి సూచన వచ్చింది; అందుకే మీడియా రెచ్చిపోయి రాసిందని.. ఆ రోజుల్లో వినిపించిన వదంతి. అది నిజమో కాదో కూడా నిర్ధారిస్తే బాగుండు. ఓ సుదీర్ఘ అనుమానానికి జవాబన్నా దొరికేది. ఇక్కడొక్కటే ప్రశ్న.. ఆంధ్రామీడియావాళ్లు సత్తెపూసలే అయితే ఈ మీటింగులెందుకు? అంటే.. మీ ప్రయోజనాల దగ్గరికి వచ్చేసరికి మీరంతా ఒక్కటే. ఏం చేయాలి? ఎలా చేయాలి? ఏం ఆపాలి? అన్నీ అర్ధరాత్రి కూడబలుక్కుని కుట్రలు చేస్తారు. కానీ తెలంగాణ మీడియా మాత్రం తెలంగాణ వాళ్లు తెలంగాణ వైపు ఉండాలనో లేదా ఆంధ్రా మీడియాకుట్రలపై అప్రమత్తంగా ఉండాలనో పిలుపు ఇస్తే రాధాకృష్ణకు అది కేసీఆర్ రాజకీయం లాగా కనిపిస్తది. ఆ రెండు పత్రికలు అని అనుక్షణం వల్లించిన వైఎస్ సైతం చనువుగా మీ చెవుల్లో తెలంగాణ ఉద్యమం మీద గుసగుస పెట్టాడని వెల్లడించి.. మీకు మీరే ఏ గుంపులోని పక్షులో సర్టిఫికెట్ ఇచ్చేసుకున్నారు. ఇంక తెలంగాణ మీడియామీద ఏడుపెందుకు?

ఇక రాధాకృష్ణ తెగ బాధపడి పోతున్న అంశం.. కేసీఆర్ మాటలు కోటలు దాటుతాయి. పనులు మాత్రం జరగవు. కోర్టుల్లో నలుగుతున్న అంశాలు తీసుకువచ్చి అవి ప్రారంభించలేదని..వాటి మీద మాట తప్పాడని ఏ హాకరో పేపర్‌బాయో అన్నాడంటే అర్థం చేసుకోవచ్చు గానీ ముప్ఫైఏండ్ల పాత్రికేయ అనుభవం ఉన్న పత్రికాధిపతి అనడమేమిటి? హుస్సేన్‌సాగర్, కళాభారతి, సచివాలయం అన్నీ న్యాయస్థానాల ముందున్నాయని తెలియదా? అయినా ఇందులోనూ లొసుగులే. కేసీఆర్ అనని మాటలను ఆయన నోట్లో దూర్చేశారు. హుసేన్‌సాగర్ నీరు తోడేయటం ఈ బాపతే. నీరంతా తోడేయడం అనేది అధికారులతో జరిపిన చర్చల్లో సూచనే తప్ప ఆ మేరకు ఏ బహిరంగ ప్రకటన కాదు. ప్రభుత్వంలో ఒక అంశం మీద చర్చ జరుగుతున్నప్పుడు అనేక ప్రతిపాదనలు వస్తాయి.

సీఎం అయినా పీఎం అయినా వారి మనసులోని ఆలోచనను చెప్తారు. వాటి మంచీచెడు సాంకేతిక,న్యాయపరమైన అంశాలన్నీ ఉన్నతాధికారులు విశ్లేషించిన తర్వాత తుది నిర్ణయాలు జరుగుతాయి. ప్రతిపాదనలను నిర్ణయాలుగా ప్రచారం చేయడం.. దాన్ని ఖాయం చేసి తర్వాత సదరు కార్యక్రమం చేయలేదని అనడం సీమాంధ్ర మీడియాకున్న పాతరోగం. కేసీఆర్ మీద ఇలాంటి ప్రచారం మొదటినుంచి అలవాటే. అపుడెపుడో ఏదో స్టూడియో దున్నేస్తానన్నాడంటూ భారీ ప్రచారం. వాస్తవానికి 2001లో ఒక పాత్రికేయుడి కరపత్రంలో పుట్టిన పదివేల నాగళ్ల ఆ నినాదం తెలంగాణ వేదికల మీద వివిధ సంఘాలకు చెందిన నాయకుల నోట లక్ష నాగళ్ల నినాదమైంది తప్ప దానికి కేసీఆర్‌కు సంబంధం లేదు. ఆధారాలున్నాయా? అని ప్రశ్నిస్తే జవాబుండదు. అలాగే ఈ మధ్య ఇంటికో ఉద్యోగం ఇస్తానన్నాడనేది మరో ప్రచారం. ఆ వాగ్దానం టీడీపీది. జాబు కావాలంటే బాబు రావాలంటూ ఊదరగొట్టింది టీడీపీ వాళ్లు.

ఎన్నికల ప్రచారంలో ఇంటికో ఉద్యోగం అంశం మీద బాబు విజయమ్మ సవాళ్లు ప్రతిసవాళ్లు అందరికీ తెలుసు. కేసీఆర్ చెప్పిందల్లా రాష్ట్ర విభజన జరిగితే లక్ష ఉద్యోగాలు అంటే జిల్లాకు కనీసం పదివేల వరకు ఉద్యోగాలు వస్తాయనే. టీఆర్‌ఎస్ మ్యానిఫెస్టో రూపకల్పన సమయంలో ఔత్సాహికులు రెండు లక్షల ఉద్యోగాలిస్తామంటూ హామీ ఇద్దామని ప్రతిపాదన తెచ్చినా మాజీ ఐఏఎస్‌లు వివిధ రాష్ర్టాల విభజన అనుభవాలను ఉటంకిస్తూ ఉద్యోగాల విభజన చిక్కులు, పూర్తి కావడానికి పట్టే సమయం, న్యాయపరమైన ఆటంకాలు విడమరిచి చెప్పి యువతలో హైప్ క్రియేట్ చేయకూడదని నిర్ణయించి ఏ సంఖ్యా కమిట్ కాకుండా ముగించారు. సరే.. కేసీఆర్ ఏదైనా ఒక భవనమో మరో అద్భుత నిర్మాణమో చేద్దామని అనుకుంటే రాధాకృష్ణకు వచ్చిన నొప్పేమిటో అంతుచిక్కని ప్రశ్న. బూర్జ్ దుబాయ్ ఆ దేశానికి ఒక ఆకర్షణగా మారుతున్నపుడు హైదరాబాద్ నగరానికి అదీ ఓ భారీ జలాశయం చేరువలో అలాంటి ఓ నిర్మాణం తళుక్కుమనాలని ఆశిస్తే నేరమా? అందులో ఇబ్బందులు ఉంటే పరిష్కరించుకుంటారు.

కాదూ కూడదనుకుంటే పక్కన పెడతారు. అసలు ఆలోచనలే చేయవద్దనే జబర్దస్తీ ఏమిటి? ఈయనకు ఎందుకంత కంగారు? చంద్రబాబు కట్టిన పాత బోర్న్‌వీటా డబ్బాలాంటి నిర్మాణం తప్ప మరో నిర్మాణం హైదరాబాద్‌లో జరగకూడదా? ప్రజలకు, అధికారులకు సౌకర్యంగా ఉండాలి తప్ప.. సచివాలయం ఎక్కడుంటే ఏంటి? ఆంధ్రా మీడియా పెత్తనమేంటి? మాకేం ఉండాలో ఎక్కడుండాలో మీరే చెప్తారా? చంద్రబాబు పంటపొలాల్లో రాజధాని కడతానంటే నోరెత్తరు. కానీ ఇక్కడ ఓ స్టేడియంలో కళాభారతి కడతానంటే గుండెలు బాదుకుంటారు. కేసీఆర్ ఆలోచనలు చూసి కొన్ని గుంపులకు నాలుక తడారిపోతున్నది. ఆ కల్లోలంలోని గందరగోళమే కొత్తపలుకునిండా కనిపిస్తున్నది.

భల్లూక సరసమంటే బరకడము పీకడమేనని… సామెత! ఎలుగుబంటికి లవ్వు పుట్టుకొస్తే గీకుతుంది.. లేదా పీకుతుంది. పాపం దానికి తెలిసిన వ్యక్తీకరణ అదే. సరిగ్గా రాధాకృష్ణ తెలంగాణ ప్రేమా రైతు ప్రేమా.. భల్లూక సరసమే. అది తెలంగాణ ప్రజలందరికీ తెలుసు. మేం రాయడం వల్లనే అసెంబ్లీలో చర్చించారు కదా అనేది ఆర్కే వాదన. అసెంబ్లీలో ఆ విషయం చర్చ జరగాలనుకున్నారా? లేక రచ్చ జరగాలనుకున్నారా తెలియని అమాయకులా పాఠకులు. సమావేశం ప్రారంభమయ్యేరోజు మీరు పెట్టిన శీర్షికే చెప్పట్లేదా మీ రైతుప్రేమ ఏమిటో! లింబయ్యను ఖచ్చితంగా రుణగ్రస్తుడైన రైతును చేసి తీరాలని వెంటపడడం చెప్పడం లేదా మీ ఎజెండాలేమిటో? మరణాలకు నెంబర్లు వేసి మరీ మీరు సెలబ్రేట్ చేసుకున్న తీరు ఏం చెప్పింది? మీరు అంత మానవతావాద హృదయులే అయితే గోదావరి పుష్కరాలనాడు పాతికమంది చనిపోయినపుడు మీ మానవతా హృదయం ఎక్కడ పెట్టుకున్నారు? ఆ కథనాలు మీ మీడియాలో దక్కించుకున్న చోటెంత? ఆ రోజు తర్వాత ఏమైంది. మృతదేహాలు ఏమయ్యాయి. వాళ్ల బంధువులు ఏమన్నారు? వాళ్ల ఊళ్లలో ఎంత విషాదం నెలకొంది. వాళ్లలో ఎంతమందికి పరిహారం అందింది.

వాళ్ల అంత్యక్రియల తీరుతెన్నులేంది? ఒక్క ముక్క రాశారా? సీఎం ఆరాటాన్ని అనుభవ రాహిత్యంగానో గందరగోళంగానో వీలైతే విదూషకత్వంగానో చిత్రించేందుకు సీమాంధ్ర మీడియా మొదట్నుంచీ చేయని ప్రయత్నం లేదు. కానీ ఇక్కడ విషయం ఏమిటంటే ఇది కొత్త రాష్ట్రం. ప్రణాళికలు, ప్రాధాన్యాలు, ఆలోచనలు అన్నీ కొత్తవే. కొత్తగా పుట్టిన ఈ రాష్ర్టానికి ఏది బాగుంటుందో ప్రభుత్వం ఆలోచన చేస్తుంది. శక్తి మేరకు చేస్తుంది. అంతకన్నా ముఖ్యమైన అంశం ముందుకు వస్తే దీన్ని వెనక్కి తీసుకుంటుంది. ఇందులో తప్పేమిటి? ఇదేం వాగ్దానాలు చేసి మోసం చేయడం కాదే? హైదరాబాద్ బ్రాండ్ నేమ్ పెంచేందుకు ఇవాళ ఆకాశహర్యం అనవచ్చు. రేపు ఇంతకన్నా మంచి ప్రతిపాదన వస్తే దాన్ని స్వీకరించవచ్చు. ఇక్కడ చూడాల్సింది చిత్తశుద్ధినా లేక మాటలనా? ఎవరి ఎజెండాలు ఎలా ఉన్నా.. టీఆర్‌ఎస్ ప్రభుత్వం తెలంగాణకు రోడ్‌మ్యాప్ వేసుకుని మరీ ముందుకు వెళ్తున్నది. మొదటగా పేదలకు ఉపశమనం కోసం రుణమాఫీ, పింఛను,్ల ఆహార భద్రత, కల్యాణ లక్ష్మి, షాదీముబారక్ వంటి పథకాలు తీసుకుంది.

ఆ తర్వాతే మధ్యతరహా పథకం మిషన్ కాకతీయ చేపట్టింది. ఏడాదిన్నర తర్వాత ఉద్యోగ నియామకాలు.. భారీ నిధులు అవసరమయ్యే ఇండ్ల పథకం,వచ్చే ఏడు కేజీ టు పీజీ, ఇలా ప్రాధాన్యాన్ని పాటిస్తున్నది. చాలామంది చాలా డిమాండ్లు పెట్టారు. వాగ్దానాలు విస్మరించారని వెక్కిరించారు. అయితే దేనినీ లెక్క చేయకుండా అనుకున్న ప్రకారం ముందుకు వెళ్తున్నది. నిర్దేశించుకున్న గమ్యం చేరేదాకా ఆ పయనం ఆగదు. ఆగరాదనే ప్రజలూ కోరుకుంటున్నారు.

యతస్సత్యం తతో ధర్మో యతో ధర్మ స్తతో జయః
సత్యమున్న చోట ధర్మం.. ధర్మమున్న చోట జయము తప్పదు.
కొసమెరుపు..
రాధాకృష్ణకు తెలిసిఉండక పోవచ్చు. ఆంధ్రప్రదేశ్ ఏర్పాటు సమయంలోనే నూతన సచివాలయం నిర్మించే ప్రయత్నాలు జరిగాయి. కర్నూలునుంచి వచ్చే అదనపు సిబ్బందికి అప్పటి సచివాలయం సరిపోదని, మరోచోట విశాల భవనాన్ని నిర్మించాలని నాటి సీఎం బూర్గుల ప్రతిపాదించారు. ఇందుకు కోటి రూపాయలు వ్యయం కాగలదని అంచనా వేసి కేంద్రాన్ని నిధులివ్వాలని అర్థించారు. హుసేన్‌సాగర్‌కు అటువైపు (నెక్లెస్ రోడ్డు ఉన్న ప్రాంతం?)తో పాటు ఎర్రమంజిల్ సహా అనేక ప్రదేశాలు చూశారు. కేంద్రం 75 లక్షలు ఇచ్చి అన్నీ అందులోనే సర్దుకోమంది. ఆంధ్ర సిబ్బంది వసతి, బస కోసం సనత్‌నగర్,చింతల్‌బస్తీ, ఎర్రమంజిల్‌లో భవనాల నిర్మాణం, శాసనసభ భవనం విస్తరణ, ఎమ్మెల్యేలకు వసతికోసం రెండున్నర కోట్లు ఖర్చవడంతో నిధులు లేక కొత్త సచివాలయం ప్రతిపాదన పక్కనపడింది. ఉన్న సచివాలయంలోనే కొత్తగా ఓ బ్లాకును నిర్మించారు. బూర్గుల ప్రతిపాదించి తర్వాత పక్కనపెట్టినా నాటి మీడియా ఏదీ? కడతానన్నావు కదా! మాట తప్పావా? అని వెకిలి వ్యాఖ్యలు చేయలేదు.
నమస్తే తెలంగాణ సౌజన్యంతో..

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *