ఎమ్మెల్సీ కవిత అరెస్టును ఖండిస్తూ తెలంగాణ భవన్లో మాజీ మంత్రి, ఎమ్మెల్యే హరీష్ రావు ప్రెస్ మీట్ నిర్వహించారు.
ఈ సందర్భంగా హరీష్ రావు మాట్లాడుతూ.. ఎమ్మెల్సీ కవిత అరెస్టు అక్రమం, అప్రజాస్వామికం, అనైతికం అని అన్నారు. కావాలనే శుక్రవారం రోజు కవితను పధకం ప్రకారం అరెస్ట్ చేశారు.. శని, ఆదివారాలు కోర్టుకు సెలవులు అని కక్షతో అరెస్టు చేశారు అని పేర్కొన్నారు.
సుప్రీంకోర్టులో కేసు పెండింగ్లో ఉండగా కవితను అరెస్టు చేశారు.. అనేక సార్లు కవితను అరెస్టు చేస్తామని బీజేపీ నేతలు చెప్పారు. బీఆర్ఎస్ పార్టీని, కేసీఆర్ను డిమొరలైజ్ చేసే ప్రయత్నం బీజేపీ, కాంగ్రెస్ కలిసి చేశాయి అని తెలిపారు
కవిత అరెస్టుపై న్యాయపోరాటం చేస్తాం.. అక్రమ అరెస్టుపై సుప్రీంకోర్టును ఆశ్రయిస్తాము.. ఎలాంటి చర్యలు తీసుకోవద్దని ఈడీకి సుప్రీంకోర్టు చెప్పింది.. రేపు ఎన్నికల షెడ్యూల్ వస్తుందనగా ఈ రోజు కవితను అరెస్ట్ చేశారు.. 19వ తేదీన సుప్రీం కోర్టులో వాదనలు ఉంటే హడావుడిగా ఎందుకు అరెస్ట్ చేశారు అని హరీష్ ప్రశ్నించారు.
బీజేపీ పాలన ఎమర్జెన్సీని తలపిస్తోంది. మా ఎమ్మెల్యేలను కొనుగోలు చేసే ప్రయత్నం బీజేపీ చేసింది. కవిత అరెస్టుకు నిరసనగా రాష్ట్రవ్యాప్తంగా అన్ని నియోజకవర్గాల్లో నిరసనలు చేయాలని పిలుపునిస్తున్నాం అని అన్నారు.
కాంగ్రెస్, బీజేపీల కుమ్మక్కు కవిత అరెస్టుతో అర్ధం అయింది.. ప్రజాక్షేత్రంలో కాంగ్రెస్, బీజేపీ పార్టీలకు ఓటమి తప్పదు. ముందు సెర్చ్ అని ఆ తర్వాత అరెస్టు అన్నారు.. ముందే ఫ్లైట్ టిక్కెట్స్ బుక్ చేసుకున్నారు. ఉద్యమాలు మాకు కొత్త కాదు అని స్పష్టం చేశారు.