mt_logo

పార్టీ గేట్లు కాదు దమ్ముంటే ప్రాజెక్టు గేట్లు ఎత్తండి… కాంగ్రెస్ వైఫల్యాలపై విరుచుకుపడ్డ హరీష్ రావు

ఎన్నికలలో హామీల అమలులో కాంగ్రెస్ పూర్తిగా విఫలం అయ్యిందని.. వంద రోజుల పాలనలో కాంగ్రెస్ ప్రజల్ని దారుణంగా మోసం చేసిందని మాజీ మంత్రి హరీష్ రావు తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. తెలంగాణ భవన్‌లో ఈరోజు హరీశ్ రావు ప్రెస్‌మీట్ నిర్వహించారు.

ఈ సందర్భంగా హరీష్ రావు మాట్లాడుతూ.. మూడు విచారణలు, ఆరు వేధింపులు అన్నట్లు కాంగ్రెస్ పాలన సాగింది. మొదటి సంతకం రుణమాఫీ అని మాట తప్పారు. కుర్చీ ఎక్కడం మాత్రం రెండు రోజుల ముందు జరుపుకున్నారు. గ్యారంటీలకు మొదటి క్యాబినెట్‌లోనే చట్టబద్ధత తెస్తామని మాట తప్పారు అని పేర్కొన్నారు.

ప్రజా దర్బార్ అని చేయి ఇచ్చారు. ప్రగతి భవన్‌ను కూల్చుతాం, నాలెడ్జ్ సెంటర్ ఏర్పాటు చేస్తామన్నారు. ఈరోజు ఉప ముఖ్యమంత్రి గారు అందులో ఉంటున్నారు. అసెంబ్లీ స్వరూపాన్ని మార్చేస్తా అన్నారు. ఇప్పటివరకు తట్టడం మట్టి కూడా తవ్వలేదు అని అన్నారు.

రైతు భరోసా అన్నారు. మేమిచ్చే రైతు బందును ఇప్పటివరకు పూర్తి చేయలేదు. రుణమాఫీపై అతిగతి లేదు ఒక్క అడుగు ముందుకు పడలేదు. ఆసరా పింఛన్లు పెంచుతామన్నారు ఉన్న పింఛన్లు సరిగా ఇవ్వడం లేదు. కేసీఆర్ తెలంగాణ పరువు పెంచే ప్రయత్నం చేస్తే, రేవంత్ రెడ్డి గారు కరువు పెంచేందుకు పోటీపడుతున్నారు. దేశమంతా కరువు ఉందని మాటలు చెబుతూ రైతుల నోట్లో మట్టి కొడుతున్నారు అని తెలిపారు

కేసీఆర్ పాలనలో పచ్చడి పొలాలు కనిపిస్తే 10 ఏళ్ల తర్వాత కాంగ్రెస్ పాలనలో పంటలకు మంటలు పెట్టే పరిస్థితి వచ్చింది. కేసీఆర్ వ్యవసాయాన్ని శిఖరాగ్రంలో నిలబెడితే రేవంత్ రెడ్డి శిథిలావస్థకు చేర్చుకున్నారు. కేసీఆర్ హయాంలో తాగునీటికి సాగునీటికి లోటు లేని పరిస్థితి ఉంటే, రేవంత్ రెడ్డి పాలనలో కన్నీళ్ళకు కొరత లేని పరిస్థితి. మిషన్ భగీరథతో ఇంటింటికి నీళ్లు మేము తెస్తే రేవంత్ రెడ్డి పాలనలో ఖాళీ బిందెల ప్రదర్శన కనిపిస్తున్నది.. ఆయన నియోజకవర్గం కొడంగల్‌లోనే కనిపిస్తున్నది అని హరీష్ రావు విమర్శించారు.

ఖమ్మం పట్టణంలో ప్రతి మూడు రోజులకు ఒకసారి నల్ల వస్తున్నదట. కర్ణాటక నుండి తాగునీరు తేవడంలో పూర్తిగా వైఫల్యం పొందారు. కృష్ణ బోర్డుకు ప్రాజెక్టులు వచ్చి రాగానే అప్పజెప్పే ప్రయత్నం చేశారు. బీఆర్ఎస్ పార్టీ పోరాటం చేస్తే మళ్లీ తోక ముడిచి అసెంబ్లీలో చేయబోమని ప్రకటన చేశారు. వంద రోజుల్లో గొల్ల కురుమలకు గొర్రెలు ఇస్తామని మాట చెప్పారు. ఒక్కరికి ఇప్పటివరకు ఇవ్వలేదు. కేసీఆర్ కిట్లు ఇస్తే రేవంత్ రెడ్డి తిట్లతో రాష్ట్రాన్ని కలుషితం చేస్తున్నారు అని అన్నారు.

వంద రోజుల్లో మీరు సాధించింది ఏమైనా ఉందా అంటే పదిసార్లు ఢిల్లీ వెళ్లొచ్చారు. తెలంగాణ ఆత్మగౌరవాన్ని ఢిల్లీలో తాకట్టు పెట్టారు. రైతుబంధు పడలేదంటే చెప్పుతో కొట్టాలంటారు. కేసీఆర్ అనారోగ్యంపై దిగజారుడు వ్యాఖ్యలు చేశారు. పార్లమెంట్ ఎన్నికల్లో కాంగ్రెస్ బీజేపీ కుమ్మక్కు అయిందని మొన్నటి బడేబాయ్ వ్యాఖ్యలతో అర్థమైంది. బడే బాయ్ చోటే బాయ్ బంధం బయట పడింది. దేశంలో బద్ద విరోధులమని చెబుతారు తెలంగాణలో మాత్రం బలమైన బంధంగా ఉంటారు అని దుయ్యబట్టారు.

పార్టీ మారితే రాళ్లతో కొట్టాలని అన్నారు రేవంత్ రెడ్డి. ఈరోజు బీజేపీ నాయకుల ఇంట్లోకి వెళ్తున్నాడు. ఫార్మాసిటీ రద్దు అన్నారు. మాట మార్చారు. మెట్రో రైలు వద్దు అన్నారు. మాట మార్చారు. అనేక విషయాల్లో యూ టర్న్ తీసుకున్నారు. యూటర్న్ యూట్యూబ్ పాలనే కనిపిస్తున్నది. వంద రోజుల్లో హామీలు అమలు చేస్తానని మాట తప్పాడు. గేట్లెత్తితే మీ పార్టీలో ఒక్కరు మిగలడని రేవంత్ రెడ్డి అంటాడు పార్టీల గేట్లు కాదు ప్రాజెక్టుల గేట్లు ఎత్తి పంటలకు నీళ్లు ఇవ్వండి అను విమర్శించారు.

పొలాలకు నీళ్లు ఇచ్చి పంటలు కాపాడే ప్రయత్నం చేయండి. తెలంగాణ రైతులు అనేక కష్టాల్లో ఉన్నారు. గొర్లు మేకలు పశువులు పంటలు మేస్తున్నాయి ట్యాంకర్లతో పొలాలకు నీళ్లు అందిస్తున్నారు. హైదరాబాదులో టాంకర్లతో నీటి సరఫరా ఇప్పుడే మొదలైంది కేసీఆర్ గారి హయాంలో ఖాళీ బిందెలు, ట్యాంకర్లు కనిపించాయా. వందరోజుల కాంగ్రెస్ పాలనలో 174 మంది రైతులు ఆత్మహత్య చేసుకున్నారు.. 38 మంది ఆటో డ్రైవర్లు ఆత్మహత్యలు చెందారు. చేనేత కార్మికులు ఆత్మహత్యలు చేసుకుంటున్నారు. ఉమ్మడి పాలనలోని దుర్భర పరిస్థితిలను నేటి కాంగ్రెస్ ప్రభుత్వం గుర్తు చేస్తున్నది అని అన్నారు.

కాంగ్రెస్ వచ్చింది కరువు వచ్చింది. రైతు ఆత్మహత్యలు జరుగుతున్నాయి ఆటో కార్మికుల ఆత్మహత్యలు జరుగుతున్నాయి నేతలను ఆత్మహత్యలు జరుగుతున్నాయి. ఆరు గ్యారంటీలో మొదటి హామీ అమలు చేయలేదు చివరి హామీ అమలు చేయలేదు. ఏం ముఖం పెట్టుకొని పార్లమెంటు ఎన్నికల్లో ఓట్లు అడుగుతారు. రైతుల విషయంలో ఒక్క హామీ కూడా అమలు చేయలేదు. కౌలు రైతులకు ఎకరానికి రూ. 15,000 అన్నారు వ్యవసాయకులకు రూ. 12,000 అన్నారు వరి పంటకు 500 బోనస్ అన్నారు. ఇవన్నీ మోసం దగా అన్యాయం. ఇది కాలం తెచ్చిన కరువు కాదు కాంగ్రెస్ తెచ్చిన కరువు అని హరీష్ రావు పేర్కొన్నారు.

అన్ని వర్గాల ప్రజలకు హామీ ఇచ్చి మోసం చేసింది కాంగ్రెస్ పార్టీ. బాండ్ పేపర్లు మంచి న్యూట్రీలు రాసిచ్చి మోసం చేసింది. మూడు నెలల పాలన చూసి ఓటేయాలని రేవంత్ రెడ్డి అన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం మోసాలను చూసి ఓటేయాలని మేము కూడా కోరుతున్నాం. మేనిఫెస్టోలో అంశాల అమలు గురించి శ్వేతపత్రం విడుదల చేయండి అని తెలిపారు.

ప్రభుత్వ ఉద్యోగులకు మూడు డీఏలు ఇప్పటివరకు ఇవ్వలేదు. నాలుగు డీఏలు ఉపాధ్యాయ ఉద్యోగుల పెండింగ్లో ఉన్నాయి. ప్రజా ఉద్యోగులను కూడా రాష్ట్ర ప్రభుత్వం మోసం చేసింది. రేపు నోటిఫికేషన్ అంటున్నారు నీకు చిత్తశుద్ధి ఉంటే ఈరోజే వాటిని అమలు చేయాలి. ఆటో డ్రైవర్లకు రూ. 12,000 ఆర్థిక సాయం అన్నారు. వారి ఆత్మహత్యలకు ఈ ప్రభుత్వమే కారణం. కాంగ్రెస్ పార్టీని నమ్ముకున్నందుకు ఆటో కుటుంబాలు చేనేత కుటుంబాలు రైతు కుటుంబాలు రోడ్డున పడ్డాయి. ఇది వందరోజుల కాంగ్రెస్ పాలన సాధించిన అప్రతిష్ట అని పేర్కొన్నారు.

ఈ ఆత్మహత్యలకు కాంగ్రెస్ పార్టీ ఏ బాధ్యత వహించాలి. ప్రజాస్వామిక పాలన అని మభ్యపెట్టారు. ప్రశ్నిస్తే చంపుతా చిరుత పేగులు మెడలో వేసుకుంటా అని సీఎం అంటున్నాడు. ముళ్ళ కంచెలు, నిర్బంధాలు, అరెస్టులు పెరిగినాయి. సోషల్ మీడియా వేదికగా ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తే అరెస్టులు చేస్తున్నారు. ప్రభుత్వం అయిపోలేలపై వార్తలు రాస్తే జర్నలిస్టులపై దాడులు జరుగుతున్నాయి అని హరీష్ రావు అన్నారు.

ఉద్యోగాలు పెంచాలని ఇందిరాపార్క్ వద్ద ధర్నాలు చేస్తే టెంట్లు పీకేసి విద్యార్థులు అరెస్టు చేశారు. ఇది సోకాల్డ్ కాంగ్రెస్ ప్రజా పాలన పరిస్థితి. మబ్బుల నీళ్లను చూసి కుండ వలక పోసుకున్నట్లు అయ్యింది పరిస్థితి. వర్షపాతం సరిగా లేనందున పంటలు ఎండిపోతున్నాయని ద వైర్ కు ఇచ్చిన ఇంటర్వ్యూలో సీఎం అన్నాడు. 14 శాతం వర్షపాతం ఎక్కువ ఉంటుందని వాతావరణ శాఖ ఏమో స్పష్టం చేసింది. ప్రభుత్వం మేనేజ్ చేయలేకపోతున్నది. ఇది కాలం చేయక వచ్చిన కరువు కాదు, కాంగ్రెస్ ప్రభుత్వం తెచ్చిన కరువు అని స్పష్టం చేశారు.

వంద రోజులైనా రుణమాఫీ చేయక మోసం చేశారు. యాసంగి పంటకు రూ. 500 రూపాయల బోనస్ ఇస్తేనే పార్లమెంట్ ఎన్నికల్లో ఓటు అడిగే హక్కు మీకుంది. అడుగడుగునా రైతన్నను మోసం చేసినందుకు కాంగ్రెస్ పార్టీ రైతన్నకు క్షమాపణ చెప్పాలి. బీఆర్ఎస్ పనులలో ఏనాడు మోటార్లు కాలలేదు. కాంగ్రెస్ రైతన్నను నట్టేట ముంచింది. కౌలు రైతుల మీద ప్రేమ నటించి మోసం చేశారు. కౌలు రైతులను ప్రశ్నించే ప్రక్రియ కూడా ప్రారంభం కాలేదు. ఏ ఒక్క హామీని కూడా పూర్తిగా అమలు చేయకుండా రైతులను మోసం చేసింది కాంగ్రెస్ పార్టీ అని హరీష్ రావు దుయ్యబట్టారు.

ఎండిపోయిన పంటలకు ఎకరాకు పదివేల రూపాయల నష్టపరిహారం చెల్లించాలని కాంగ్రెస్ ప్రభుత్వం డిమాండ్ చేస్తున్నా. మీ ఫెయిల్యూర్ వల్ల రైతన్నలు చనిపోతున్నారు. ప్రతి మహిళకు రూ. 2500 రూపాయలు ఇస్తా అన్నారు. మూడు నెలల్లో ఇప్పటివరకు మొత్తం రూ. 7500 కోట్లు మహిళలకు బాకీ పడింది.ఏం మొహం పెట్టుకొని మహిళా సదస్సు నిర్వహిస్తారు. కళ్యాణ లక్ష్మితో తులం బంగారం ఇస్తా అన్నారు. లక్ష పైగా పెళ్లిళ్లు జరిగాయి. ఈ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన రోజు నుంచి జరిగిన పెళ్లిళ్లకు మా ఆడబిడ్డలకు తులం బంగారం ఇవ్వాల్సిందే. నెలకు రూ. 4 వేల పింఛన్లు ఇస్తా అన్నారు. జనవరి నెల ఉన్న పింఛన్లు ఎగ్గొట్టారు. అనవసరానికి పోతే ఉన్నవస్త్రం పోయిందన్నట్టుంది. 44 లక్షల మంది పింఛన్దారులు వచ్చే ఎన్నికల్లో కర్రు గాల్చి వాత పెట్టబోతున్నారు. మూడు నెలల కాలంలో ఒక్కొక్కరికి ప్రభుత్వం ఎనిమిది వేల రూపాయలు బకాయి పడింది. ఒక్కొక్కరికి ఎనిమిది వేల రూపాయలు ఇచ్చిన తర్వాతనే ఓటు అడిగే హక్కు ఈ కాంగ్రెస్ పార్టీకి ఉంది అని తెలిపారు.

ప్రభుత్వం తక్షణమే వారందరికీ 8 వేల రూపాయలు పెన్షన్లు ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నా. నిరుద్యోగులకు రూ. 4,000 భృతి అన్నారు. అసెంబ్లీలో మేము ఎప్పుడు చెప్పలేదని మాట దాటవేశారు. రాష్ట్రంలో ప్రధానమైన అన్ని వర్గాలను కాంగ్రెస్ మోసం చేసింది. మేము ఇచ్చిన ఉద్యోగాలే తప్ప మీరు ఇచ్చిన కొత్త నోటిఫికేషన్లు ఏమున్నాయి. మా హయాంలో జరిగిన నియామకాలను కాంగ్రెస్ ఖ్యాతిగా గొప్పలు చెప్పుకుంటున్నారు. ఏడాదిలో రెండు లక్షల ఉద్యోగాలు ఇస్తా అన్నారు. రెండు లక్షల ఉద్యోగాలు కాంగ్రెస్ ప్రభుత్వం నింపి తీరాలి అని డిమాండ్ చేశారు.

కాంగ్రెస్ పార్టీ ప్రతిపక్షాల మీద దాడులు చేస్తున్నది. మా నాయకుల మీద కార్యకర్తల మీద అక్రమంగా కేసులు బనాయిస్తున్నది. వందరోజుల కాంగ్రెస్ పాలన అరచేతిలో వైకుంఠం చూపింది. కాంగ్రెస్ హస్తం.. భస్మాసుర హస్తంగా మారింది. మెడ మీద కత్తి పెట్టి నాయకులను పార్టీలో చేర్చుకుంటున్నాం అని అనుకుంటున్నారు కావచ్చు. ప్రజలు అన్నీ గమనిస్తున్నారు. నీతి నిజాయితీ ఉంటే చీము నెత్తురు ఉంటే ఇచ్చిన మాటని కాంగ్రెస్ పార్టీ అమలు చేసి చూపించాలి. అప్పుడే రాష్ట్ర ప్రజలను ఓటు అడగాలని డిమాండ్ చేస్తున్నాం అని హరీష్ తెలిపారు.