mt_logo

180 మంది రైతులు, 38 మంది ఆటో సోదరులు చనిపోతే కాంగ్రెస్ నుండి స్పందన లేదు: హరీష్ రావు

బీఆర్ఎస్ పార్టీ మెదక్ నియోజకవర్గ ముఖ్య కార్యకర్తల సమావేశంలో మాజీ మంత్రి, ఎమ్మెల్యే హరీష్ రావు పాల్గొన్నారు. ఈ సందర్భంగా హరీష్ రావు మాట్లాడుతూ.. ఎంపీగా వెంకట్రాం రెడ్డి గారిని మంచి మెజార్టితో గెలిపించాలి. రోజుకు 18 గంటలు కష్టపడే గొప్ప మనసున్న వ్యక్తి ఆయన అని అన్నారు.

రూ. 2 లక్షల రుణమాఫీ అన్నారు మాట తప్పారు.. రూ. 500 బోనస్ ఇచ్చి వడ్లు కొంటా అని మాట తప్పారు.. మహాలక్ష్మి పేరిట రూ. 2500 మహిళలకు ఇస్తా అని మోసం చేశారు.. అవ్వా, తాతలకు రూ. 4 వేల పింఛన్ అన్నారు.. ఇప్పటికి ఒక్కొక్కరికి 8 వేలు బాకీ పడ్డారు అని గుర్తు చేశారు.

రైతుబంధు రూ. 15 వేలకు పెంచుతా అని మోసం చేశారు.. కౌలు రైతులకు కూడా ఇస్తామని దగా చేశారు.. కళ్యాణ లక్ష్మితో పాటు తులం బంగారం ఇస్తామన్నారు.. మాట తప్పారు.. ఈ హామీలు అమలు చేసే దాకా కాంగ్రెస్‌ను నీలదీయాలి అని శ్రేణులకు పిలుపునిచ్చారు.

బీజేపీ మత రాజకీయాలు చేస్తున్నది.. కేసీఆర్ గారు యాదాద్రి నిర్మించారు.. అయనకన్నా పెద్ద దైవ భక్తుడు ఎవరు అని అడిగారు. అదాని, అంబాని తప్ప ఎవరు బాగుపడ్డారు. రఘునందన్ రావును 50 వేల పైగా ఓట్లతో చిత్తుగా ఓడించారు.. పోరాటం బీఆర్ఎస్ పార్టీకి వెన్నతో పెట్టిన విద్య అని హరీష్ పేర్కొన్నారు.

కాంగ్రెస్ హామీలు అమలు కావాలన్నా, ఢిల్లీలో ప్రశ్నించాలన్నా ఎంపీగా బీఆర్ఎస్ అభ్యర్థి గెలవాలి.. మోడీ ఎప్పుడు ఉత్తర భారతదేశం వైపే చూస్తారు.. కానీ దక్షిణ భారతం వైపు చూడరు.. బీజేపీ గెలిస్తే తెలంగాణకు ప్రయోజనం ఉండదు అని అన్నారు.

అసెంబ్లీలో కేవలం ట్రైలర్ మాత్రమే చూపెట్టాం.. రానున్న రోజుల్లో మొత్తం సినిమా చూపిస్తాం.. చెప్పిన హామీలు అమలు చేసేదాకా వెంటబడతాం.. నిలాదీస్తాం అని స్పష్టం చేశారు.

రేవంత్ రెడ్డి సోషల్ మీడియా వేదికగా ఫేక్ వార్తలు ప్రచారం చేస్తున్నాడు.. 180 మంది రైతులు, 38 మంది ఆటో సోదరులు చనిపోతే కనీసం స్పందన లేదు.. మనసు లేని కాంగ్రెస్ ప్రభుత్వం ఇది.. ప్రజలు అర్థం చేసుకుంటున్నారు అని తెలిపారు. డిపాజిట్లు రాని బీజేపీకి మళ్ళీ అదే గతి పడుతుందని హరీష్ అభిప్రాయపడ్డారు.