mt_logo

ఆరు గ్యారంటీలకు రాహుల్ గాంధీ జిమ్మేదార్ అన్నాడు.. ఏమాయే: హరీష్ రావు

సిద్దిపేట నియోజకవర్గం నారాయణరావుపేట మండల బీఆర్ఎస్ కార్యకర్తల సమావేశంలో మాజీ మంత్రి ఎమ్మెల్యే హరీశ్ రావు పాల్గొన్నారు. ఆరు గ్యారంటీలకు నాది జిమ్మేదార్ అన్న రాహుల్ గాంధీ సమాధానం చెప్పాలని మాజీ మంత్రివర్యులు, సిద్దిపేట ఎమ్మెల్యే తన్నీరు హరీశ్ రావు డిమాండ్ చేశారు.

ఎన్నికల సమయంలో రాహుల్ ఇచ్చిన హామీలు 120 రోజులు అయినా నెరవేరలేవని, నేడు రాహుల్ గాంధీ విడుదల చేస్తున్న జాతీయ మేనిఫెస్టోను ఎవరూ నమ్మరన్నారు. అధికారంలోకి రాగానే 6 గ్యారంటీలకు చట్టబద్ధం చేస్తామని రేవంత్ రెడ్డి మోసం చేశాడన్నారు. రుణమాఫీ, రైతు భరోసా, తులం బంగారం, నిరుద్యోగ భృతి, విద్యార్థులకు స్కూటీ, మహాలక్ష్మి పథకం ఇలా ఒక్కటి కూడా అమలు చేయడం లేదన్నారు.

రేవంత్ రెడ్డి మన వెటర్నరీ కళాశాలను కొడంగల్‌కు తీసుకుపోయాడు, రూ. 150 కోట్ల అభివృద్ధి పనులను రద్దు చేశాడని, ఇది అన్యాయం కాదా అని ఆయన ప్రశ్నించారు. అధికారంలో ఉన్నా లేకున్నా సిద్దిపేట గడ్డకు తక్కువ చేయననన్నారు. నాటి నుండి నేటి వరకు నారాయణరావుపేట బీఆర్ఎస్‌కు భారీ మెజారిటీ అందించిందని, నేడు కూడా ఎంపీ అభ్యర్థి వెంకట్రామరెడ్డికి ఘన విజయం అందించాలన్నారు. ట్రస్టు సేవలు మీకు ఎంతో ఉపయోగకరంగా ఉంటాయన్నారు.

రఘునందన్ రావు ధోఖా చేయడంతోనే దుబ్బాకలో ఓడగొట్టారని, నేడు కూడా డిపాజిట్ కోల్పోవడం ఖాయమన్నారు. బీజేపీ ఒక్క మంచి పని చేసిందా, పెట్రోల్, డీజిల్ ధరలు పెంచారని, నిరుద్యోగం పెంచారని, గ్యాస్ ధరలు పెంచారన్నారు. ప్రభుత్వ పనులే కాదు, నా వ్యక్తిగతంగా కూడా మీకు అండగా ఉంటామన్నారు. కాళేశ్వరం తొలి ఫలితం నారాయణరావుపేటలోనే  వచ్చింది. నాకు ఎక్కువ ఏకగ్రీవాలు ఇచ్చిన మండలం కూడా ఇదేనని మిమ్మల్ని మరువలేమన్నారు.

కలెక్టర్‌గా ఖ్యాతి ఇచ్చిన ఈ గడ్డే నాకు రాజకీయ జీవితం కూడా ఇవ్వాలని బీఆర్ఎస్ మెదక్ ఎంపీ అభ్యర్థి పి వెంకట్రామరెడ్డి పేర్కొన్నారు. నేను మీ జిల్లా కలెక్టర్‌గా, జాయింట్ కలెక్టర్‌గా ఇక్కడ పనిచేయడం జరిగిందని పేర్కొన్నారు. పార్లమెంటులో ఒక మాజీ కలెక్టర్‌గా అడుగుపెట్టే అవకాశం ఇవ్వాలన్నారు.

పరిపాలనా అనుభవంతో మీ సమస్యల పరిష్కారం సులువవుతుందన్నారు. కలెక్టర్‌గా పనిచేసే సమయంలో నా దగ్గరికి వచ్చే వాళ్లలో నా తోబుట్టువులను చూశానని, బాధ్యతతో పనిచేయడం జరిగిందన్నారు. ఎంపీ గానే కాకుండా.. నా ఉమ్మడి కుటుంబ సభ్యుల సహకారంతో రూ. 100 కోట్లతో ట్రస్ట్ ఏర్పాటు చేసి మీకు అండగా ఉంటామన్నారు.

యువతీ, యువకులకు కోచింగ్ కేంద్రాలు, వృత్తి శిక్షణ కేంద్రాలు ఏర్పాటు చేసి తర్వాత జాబ్ మేళా వేసి ఉద్యోగ, ఉపాధి అవకాశాలు కల్పిస్తామన్నారు. మహిళలకు సైతం కుట్టు శిక్షణ కేంద్రాలు ఏర్పాటు చేసి అండగా నిలుస్తామన్నారు. అలాగే బీఆర్ఎస్ కార్యకర్తలు, నిరుపేదల కోసం 7 నియోజకవర్గంలలో ఫంక్షన్ హాళ్లు నిర్మించి కేవలం ఒక్క రూపాయితో వారికి అందిస్తామన్నారు.