mt_logo

కాంగ్రెస్ ప్రభుత్వం రైతుల ఉసురు పోసుకుంటోంది: జహీరాబాద్‌లో హరీష్ రావు

జహీరాబాద్‌లో నిర్వహించిన పార్లమెంట్ ఎన్నికల బీఆర్ఎస్ సన్నాహక సమావేశంలో మాజీ మంత్రి హరీష్ రావు పాల్గొన్నారు. ఈ సందర్భంగా హరీష్ రావు మాట్లాడుతూ..అసెంబ్లీ ఎన్నికల తర్వాత కాంగ్రెస్ ఊపు తగ్గింది.. అరచేతిలో వైకుంఠం చూపించి హామీలను అమలు చేయకుండా మోసం చేసిన కాంగ్రెస్‌కు ఓట్లు వేసే పరిస్థితి లేదు.. ఆరు గ్యారంటీలను అమలు చేస్తామని బాండ్ పేపర్ రాసిచ్చి మరీ మోసం చేశారు అని అన్నారు.

వంద రోజుల్లో అమలు చేస్తామని చెప్పి, ఇప్పడు ఎన్నికల కోడ్ అడ్డం పెట్టుకుంటున్నారు.. వంద రోజుల తర్వాతే కోడ్ వచ్చింది. రూ. 2 లక్షల రుణమాఫీ, వడ్లకు, మక్కలకు రూ. 500 బోనస్, రూ. 4 వేల ఫించన్, రైతుబంధు రూ. 15 వేలు, మహిళలకు రూ. 2,500, కళ్యాణ లక్ష్మి కింద తులం బంగారం, రూ. 4 వేల నిరుద్యోగ భృతి, ఆడపిల్లలకు ఉచిత స్కూటీ అందినవాళ్లే కాంగ్రెస్‌కు ఓటేయండి, అందనివాళ్లు బీఆర్ఎస్‌కు ఓటేయండి అని పిలుపునిచ్చారు.

కాంగ్రెస్ ప్రభుత్వం రైతుల ఉసురు పోసుకుంటోంది. ఎన్నికల హామీలను కాంగ్రెస్ మెడలు వంచి అమలు చేయిస్తాం.. వీటిపై అసెంబ్లీలో ప్రశ్నించాలంటే బీఆర్ఎస్‌కు బలమివ్వాలి.. ప్రశ్నించే గొంతును గెలిపించండి అని అన్నారు.

ఎంపీ ఎన్నికల్లో మోసపోతే ఐదేళ్లు ప్రజల ముఖం చూడరు. తెలంగాణ అభివృద్ధి కోసం కష్టపడిన బీఆర్ఎస్ పార్టీని గెలిపించండి.. కేసీఆర్ చేసిన అభివృద్ధిని, పథకాలను అడ్డుకుంటున్నారు. నీళ్లు రావడం లేదు, కేసీఆర్ కిట్ అందడం లేదు.. అన్ని వర్గాలను కాంగ్రెస్ కష్టాలపాలు చేసింది అని విమర్శించారు.

బీఆర్ఎస్‌కు ద్రోహం చేసిన బీజేపీ అభ్యర్థిగా బరిలోకి దిగాడు బీబీ పాటిల్.. అతణ్ని ఖచ్చితంగా ఓడగొట్టి మూడో స్థానంలో నిలబెట్టాలి. డబ్బులకు, పదవులకు ఆశపడేవాళ్లు మాత్రమే పార్టీలు మారుతున్నారు.. ఉద్యమకారులను కాంగ్రెస్ కొనలేదు అని హరీష్ పేర్కొన్నారు.

బీజేపీ పాలనలో గ్యాస్, పెట్రోల్ ధరలు పెరిగాయి.. ఆ పార్టీ ప్రజలకు చేసిందేమీ లేదు. కాంగ్రెస్, బీజేపీ దొందూదొందే.. దేవుడి పేరుతో రాజకీయాలు చేయడం కాదు, చేసిన అభివృద్ధి ఏంటో చెప్పాలని అడిగారు.

జహీరాబాద్ కార్యకర్తలు కష్టపడి పనిచేసి అనిల్ కుమార్ గారిని గెలిపించాలి.. తెలంగాణ ఉద్యమంలో పాల్గొన్న అనిల్‌ను గెలిపించుకోవడం మన బాధ్యత..కార్యకర్తలు భయపడాల్సిన పనిలేదు.. అవసరమైతే మా ప్రాణాలను అడ్డుపెట్టి కాపాడుకుంటాం అని స్పష్టం చేశారు.

దేశవ్యాప్తంగా కాంగ్రెస్ ప్రభుత్వాలు పడిపోతున్నాయి. తెలంగాణలోనూ అదే జరుగుతుంది.. మళ్లీ వచ్చేది మన ప్రభుత్వమే.. వడ్డీతో సహా బదులు తీర్చుకుంటాం అని అన్నారు.