mt_logo

ప్రజల కష్టాల గురించి రాస్తున్న కొడంగల్ జర్నలిస్టులకు బెదిరింపులు వస్తున్నాయి: హరీష్ రావు

కొడంగల్ నియోజకవర్గంలోని కోస్గిలో నిర్వహించిన మహబూబ్‌నగర్ పార్లమెంటు నియోజకవర్గ బీఆర్ఎస్ ఎన్నికల సన్నాహక సమావేశంలో మాజీ మంత్రి, ఎమ్మెల్యే హరీష్ రావు పాల్గొన్నారు. ఈ సందర్భంగా హరీష్ రావు మాట్లాడుతూ.. ప్రజల కష్టాల గురించి రాస్తున్న ఇక్కడి కొడంగల్ జర్నలిస్టులకు బెదిరింపులు వస్తున్నాయి. ప్రధాన ప్రతిపక్షంగా ఎన్నికల హామీల అమలుకు పోరాడాల్సిన బాధ్యత మనపైన ఉంది.. ఓడినా, గెలిచినా ప్రజలవైపే అని స్పష్టం చేశారు.

పదేళ్లలో కేసీఆర్ ప్రభుత్వం అన్ని వర్గాల సంక్షేమానికి వంద పథకాలను అమలుచేసింది. మరి బీజేపీ చేసిందేమిటి? పెట్రోల్, డీజిల్, గ్యాస్ ధరలు పెంచి పేదల నడ్డి విరిచింది. 20 కోట్ల ఉద్యోగాలిస్తామని చెప్పి 6 లక్షలు కూడా ఇవ్వకుండా నిరుద్యోగులను మోసం చేసింది. చెప్పుకోడానికి పథకాలు లేవు కనుక చిత్రపటాలు, అక్షింతలు, చీరలు పంచుతున్నారు అని అన్నారు.

తెలంగాణకు మెడికల్ కాలేజీలు, నర్సింగ్ కాలేజీలు, నోవదయ స్కూళ్లు ఇవ్వకుండా మొండిచేయి చూపింది బీజేపీ ప్రభుత్వం. పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టుకు జాతీయ హోదా ఇవ్వలేదు. కరువు కాటకాలతో అల్లాడే ఈ ప్రాంతానికి కేసీఆర్ నీళ్లిచ్చిండు. ఆరు నెలల్లో పూర్తికావాల్సిన కరివేన ప్రాజెక్టును పూర్తి చేయకుండా రేవంత్ ప్రభుత్వం టెండర్లు రద్దు చేసింది అని పేర్కొన్నారు.

ఆరు గ్యారంటీలను అమలు చేస్తామన్న కాంగ్రెస్ ప్రభుత్వం వంద రోజులు దాటినా అమలు చేయలేదు. సీఎం నియోజకవర్గంలోనే 2 లక్షల రుణమాఫీ కాలేదు.. రైతులకిచ్చిన రూ. 15 వేల రైతు బంధు, వడ్లకు మక్కలకు రూ. 500 బోనస్ ఇవ్వలేదు. రైతులు చేసేదేం లేక రూ. 1700లకు అమ్ముకుంటున్నరు అని విమర్శించారు.

కేసీఆర్ రైతులకు ఇచ్చి మాట నిలబెట్టుకున్నడు. ఇవ్వని హామీలను కూడా అమలు చేసిండు. 24 గంటల ఉచిత కరెంట్, రైతు బీమా, రైతుబంధు ఇచ్చిండు. ఆసరా పింఛన్ రూ. 4 వేలు ఇస్తామని రేవంత్ అవ్వాతాతలను కూడా మోసం చేసిండు. నెలకు రూ. 2,500 ఇస్తామని మహిళలను మోసం చేసిండు. కాంగ్రెస్ ఓట్లడగడానికి వస్తే నాలుగు నెలలకు కలిపి రూ. 10 వేలు ఇవ్వాలని డిమాండ్ చేయాలి ఆని హరీష్ అన్నారు.

నిరుద్యోగులకు రూ. 4 వేలు ఇస్తామని వాళ్లనూ మోసం చేసిండు రేవంత్ . అసలు ఆ హామీనే ఇవ్వలేదని డిప్యూటీ సీఎం అసెంబ్లీ సాక్షిగా చెప్పిండు. కళ్యాణ లక్ష్మి కింద ఆడపిల్లలకు తులం బంగారం ఇస్తామని అదీ ఎగ్గొట్టిండు. కేసీఆర్ కిట్లు బంద్ అయినవి, తిట్లు స్టార్ట్ అయినవి. కొత్త పథకాలు లేవు.. కోత పథకాలు వస్తున్నయ్ అని దుయ్యబట్టారు.

హామీలు అమలు చేయడం చేతకాక ఎన్నికల కోడ్‌ను అడ్డం పెట్టుకుంటున్నారు. రైతులు, పేదలు, మహిళలు, ఉద్యోగులు, విద్యార్థులు, నిరుద్యోగులను.. అన్ని వర్గాలను కాంగ్రెస్ మోసం చేసింది అని స్పష్టం చేశారు.

హకీంపేట, ఎర్రంపల్లి వంటి నాలుగు గ్రామాల రైతుల భూములను ఫార్మా కంపెనీ కోసం లాక్కుంటున్నారు. పొల్యూషన్ కంపెనీ మాకొద్దని ప్రజలు అంటున్నారు. మేం రైతులకు అండగా ఉండి పోరాడతాం. కాంగ్రెస్ మెడలు వంచి హామీలను అమలు చేయాలంటే పార్లమెంటు ఎన్నికల్లో బీఆర్ఎస్‌కు ఓటేసి మన్నె శ్రీనివాస్ రెడ్డిని గెలిపించుకోవాలి అని పిలుపునిచ్చారు.