mt_logo

పదవుల నుండి దించుడు నీకు, నీ గురువు చంద్రబాబుకి అలవాటు… రేవంత్‌పై హరీష్ రావు ఫైర్

గజ్వేల్ నియోజకవర్గంలోని తూప్రాన్ మండలం వెంకటాయపల్లి గ్రామంలో ఛత్రపతి శివాజీ విగ్రహావిష్కరణ కార్యక్రమంలో మాజీ మంత్రి హరీష్ రావు పాల్గొన్నారు.

ఈ సందర్భంగా హరీష్ రావు మాట్లాడుతూ.. ఛత్రపతి శివాజీ మహారాజ్ విగ్రహాన్ని ప్రారంభించుకోవడం సంతోషంగా ఉంది. శివాజీ పాలనలో అన్ని వర్గాలు సంతోషంగా జీవించేవి.. మత సామరస్యానికి ప్రతీక శివాజీ.. శివాజీ ఏ ఒక్క వర్గానికో పరిమితమైన వ్యక్తి కాడు.. ఆయన సైన్యంలో కీలక స్థానాల్లో ముస్లింలు కూడా పని చేశారు.. కొందరు శివాజీని ఓట్ల కోసం వాడుకుంటూ ఉంటారు అని పేర్కొన్నారు.

ఛత్రపతి శివాజీ స్ఫూర్తితో కేసీఆర్ 14 ఏళ్లు పోరాడి తెలంగాణను సాధించారు. కేసీఆర్ శివాజీ బాటలో పది సంవత్సరాలు అద్భుతంగా పరిపాలించారు.. మూడు నెలల కాంగ్రెస్ పాలన చూస్తున్నాం.. ఎన్నెన్నో హామీలు ఇచ్చారు.. వాటి అమలుపై శ్రద్ధ చూపడం లేదు ఆని విమర్శించారు.

రైతులు సమస్యలతో అల్లాడుతున్నారు.. పొలాలకు నీరందక రైతాంగం రోజంతా పరేషాన్‌లో ఉన్నారు.. సామాజిక న్యాయం సాక్షాత్తూ ఉప ముఖ్యమంత్రికే దొరకడం లేదు.. సామాన్యుడికి ఏం దొరుకుతుంది.. సీఎం రేవంత్ రెడ్డి చెప్పిందేమో కొండంత.. చేస్తుందేమో గోరంత.. మాటలు ఎక్కువ చేతలు తక్కువ అని అన్నారు. 

రేవంత్ రెడ్డి మాట్లాడే భాష బజారు భాష కంటే హీనంగా ఉంది.. ఒక ముఖ్యమంత్రి లాగా మాట్లాడడం లేదు బజారు మనుషులు కూడా ఆ రకంగా మాట్లాడుకోరు. సీఎం పదవి దిగజారే విధంగా రేవంత్ రెడ్డి మాట్లాడుతున్నారు అని హరీష్ రావు దుయ్యబట్టారు.

చీము నెత్తురు ఉంటే డిసెంబర్ 9న 2 లక్షల రుణమాఫీ చేస్తానన్న హామీ ఏమైంది.. ఎందుక చేయలేదు అని అడుగుతున్న.. వంద రోజుల్లో ఆరు గ్యారంటీలు.. 13 హామీలు ఎక్కడ పోయాయి.. మా అక్కచెల్లెళ్లకు ఇస్తానన్న రూ. 2,500 ఎక్కడపోయాయి రేవంత్ రెడ్డి అని అడుగుతున్న.. మా అవ్వ తాతలకు ఇచ్చే రూ. 4 వేల పెన్షన్ ఎక్కడ అని రేవంత్ రెడ్డికి ప్రశ్నించారు.

నువ్వు బోనస్ ఎగపెట్టినవ్, రైతు రుణమాఫీ ఎగపెట్టినవ్, రూ. 15 వేల రైతు బంధు ఎగపెట్టినవ్, తులం బంగారం ఎగపెట్టినవ్, ఇంకా సిగ్గు లేకుండా ఏ మొఖం పెట్టుకొని మాట్లాడుతున్నావ్, నోరు పెంచుకోవడం కాదు విజ్ఞతతో పాలన చేయు రేవంత్ రెడ్డి.. నిన్ను ఎవడో దించుతాడు దించుతాడు అని మాట్లాడుతున్నావ్.. నిన్ను ఎవరు దించరు.. నువ్వు గిట్ల హామీలు నేరవేర్చక పోతే 5 ఏళ్ల తర్వాత జనమే తిరగపడతారు, తెలంగాణ ప్రజలే నిన్ను దించుతరు జాగ్రత్త అని హెచ్చరించారు.

దించుడు నీకు నీ గురువు చంద్రబాబుకి అలవాటు. ఓటుకి నోటు కేసులో పట్ట పగలు దరికింది నువ్వు . నిన్ను ప్రజలే దించుతరు. అడ్డదారిలో నడవడం నీకు నీ గురువుకి అలవాటు. మాకు ఆ ఆలోచన లేదు. మేం ప్రజలను నమ్ముకుంటాం. చిల్లర చేష్టలు మాకు అవసరం లేదు అని స్పష్టం చేశారు.

కాళేశ్వరంతో ఎండా కాలంలో కూడా నీళ్ళు పారినయి. ఏదో రెండు పిల్లర్లు దెబ్బతింటే బాగు చేయటం చేతకాక కేసీఆర్‌ని తిడతావా.. మీ పాలనలో కడెం వాగు, పాలెం వాగు కొట్టుకుపోలేదా? దేవాదుల పైపులు పగల్లేదా? నీళ్ళిచ్చి రైతులని కాపాడు. 24 గంటల కాడ 16 గంటల కరెంట్ వస్తుంది. మోటార్లు కాలుతున్నయి అని హరీష్ రావు అన్నారు

బోనస్‌కి దిక్కు లేదు. మాయ మాటలు చెప్పి సిగ్గు లేకుండా ఎన్నాళ్ళు బతుకుతవు? యాసంగి వడ్లకు రూ. 500 బోనస్ ఇచ్చి ఎంపీ ఎన్నికల్లో ఓట్లడుగు అని ఎద్దేవా చేశారు.

మొన్న మోడీ వేస్తే సాష్టాంగ నమస్కారం పెట్టిండు. బడే భాయి అంటుండు.. ఏడికెల్లి వచ్చిండు బడే భాయి. బడే భాయి, చోటే భాయి ఒక్కటైండు.. బీజేపీతో కుమ్మక్కయి బీఆర్ఎస్ లేకుండా చేద్దామనుకుంటున్నరు.. తెలంగాణ ప్రజల కోసం కొట్లాడే పార్టీ బీఆర్ఎస్.. ఎవరెన్ని కుట్రలు పన్నినా తెలంగాణ ఉన్నంత వరకు బీఆర్ఎస్ ఉంటది అని తెలిపారు.

రేవంత్ రెడ్డిది ఎన్నడైనా జై తెలంగాణ ఆన్న మొఖమా? తెలంగాణ కోసం 4 నెలలు జైల్లో ఉన్న.. తెలంగాణ ప్రజల పార్టీ బీఆర్ఎస్ తెలంగాణ ప్రయోజనాలు ఢిల్లీలో కాపాడాలంటే పార్లమెంటులో బీఆర్ఎస్ బలంగా ఉండాలి అని అన్నారు