mt_logo

రేవంత్ రెడ్డి అంటే మాటల కోతలు.. కాంగ్రెస్ అంటే కరెంట్ కోతలు: హరీష్ రావు

సంగారెడ్డి జిల్లా కొండాపూర్‌లో బీఆర్ఎస్ ముఖ్య నాయకులతో మాజీ మంత్రి హరీష్ రావు సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా హరీష్ రావు మాట్లాడుతూ..ఆగస్టు 15 లోపు 39 వేల కోట్ల రూపాయలు రుణమాఫీ చేయకపోతే రేవంత్ రెడ్డి రాజీనామా చేస్తావా ఆని ప్రశ్నించారు.

రైతు బంధు పూర్తిగా ఇవ్వలేదు ఇంకా ఆగస్టు 15 లోపు రుణమాఫీ చేస్తా అంటున్నాడు. ఈ పార్లమెంట్ ఎన్నికల్లో మీరిచ్చిన గ్యారెంటిలే మీకు భస్మాసురహస్తం అవుతాయి అని దుయ్యబట్టారు.

సీఎం రేవంత్ రెడ్డి నన్ను ఎందుకు ఓడించాలో చెప్పాలి అన్నారు. మిమ్మల్ని ఓడించడానికి 100 కారణాలు ఉన్నాయి. రైతు రుణమాఫీ, రైతు భరోసా, ధాన్యానికి బోనస్, ఆసరా పెన్షన్ పెంపు, మహిళలకు 2500 రూపాయల సహయం, కళ్యాణాలక్ష్మికి తులం బంగారం, నిరుద్యోగ భృతిపై మాట తప్పినందుకు కాంగ్రెస్‌ని ఓడించాలి. రేవంత్ రెడ్డి అంటే మాటల కోతలు.. కాంగ్రెస్ అంటే కరెంట్ కోతలు అని విమర్శించారు.

నాలుగున్నర నెలల్లోనే సీఎం ఏదేదో చేసినట్టు ఓటేయకపోతే పథకాలు బంద్ అవుతాయని బ్లాక్ మెయిల్ చేస్తున్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చాక రైతుల ఆత్మహత్యలు మొదలయ్యాయి. కాంగ్రెస్ అంటే కరువు, కరెంట్ కోతలు, మంచినీళ్ల కష్టాలు, అవినీతి అని హరీష్ ధ్వజమెత్తారు

2014, 2019 రెండు సార్లు దేశంలో కాంగ్రెస్‌కి ప్రతిపక్ష హోదా దక్కలేదు.. మీ పాలన వద్దని ప్రజలు అనుకుంటున్నారు. మీ పార్టీ నాయకులు మోత్కుపల్లి, హనుమంతరావులే మా సీఎం కలవట్లేదు అని అంటున్నారు. మెడలో పేగులేసుకుంటా,మానవ బాంబునై పేలుతా, డ్రాయర్ ఊడగొడుతా అని సీఎం పదవికి అర్థం లేకుండా మాట్లాడుతున్నారు అని అన్నారు.