mt_logo

మద్యం పాలసీ కేసులో కాంగ్రెస్ హైకమాండ్‌ది ఓ దారి, రేవంత్‌ది మరో దారి: హరీష్ రావు

మద్యం పాలసీ కేసులో ఈడీ, సీబీఐ వ్యహరిస్తున్న తీరుపై కాంగ్రెస్‌ పార్టీ జాతీయ నాయకులు మ‌ల్లిఖార్జున ఖర్గే, రాహుల్‌ గాంధీలు స్పందిస్తున్న తీరుకు పూర్తి వ్య‌తిరేకంగా రాష్ట్ర కాంగ్రెస్‌ అధ్యక్షుడు, ముఖ్యమంత్రి రేవంత్‌ రెడ్డి మాట్లాడుతున్నారు అని మాజీ మంత్రి, ఎమ్మెల్యే హరీష్ రావు విమర్శించారు.

రేవంత్‌ రెడ్డి తీరు చూస్తుంటే బీజేపీకి బీ టీం లీడర్ లాగా మాట్లాడుతున్నట్టున్నది త‌ప్ప‌.. జాతీయ కాంగ్రెస్‌కు రాష్ట్ర ప్రతినిధిగా వ్య‌వ‌హ‌రిస్తున్న‌ట్టు ఏ కోశానా క‌నిపించ‌డం లేదని.. ఆయన ఖ‌ర్గే, రాహుల్ నాయకత్వంలో పనిచేయడం లేద‌ని, కాంగ్రెస్ విధానాల‌కు వ్యతిరేకంగా, బీజేపీకి, మోదీకి అనుకూలంగా పనిచేస్తున్నారని మరోసారి తేటతెల్లమయింది అని హరీష్ అన్నారు.

మద్యం పాలసీ కేసు విష‌యంలో ఇన్నాళ్లుగా మేము ఏమి చెప్తున్నామో ఇప్పుడు మల్లిఖార్జున ఖ‌ర్గే , రాహుల్ గాంధీ అదే చెప్పారు. మోదీ ప్రభుత్వం కేంద్ర దర్యాప్తు సంస్థలను తమకు అనుకూలంగా మార్చుకుందని, లిక్కర్ స్కామ్ పేరుతో రాజకీయ వేధింపుల కోసం వాడుకుంటున్నదని ఆరోపించాం. ఇప్పుడు మా వాదనను ఏఐసీసీ కూడా బలపరిచింది. లిక్కర్ స్కామ్ అనేది పూర్తిగా క‌ల్పిత‌మ‌ని, కేంద్ర ప్రభుత్వం దర్యాప్తు సంస్థలను ఉపయోగించి రాజకీయ ప్రత్యర్థులపై తప్పుడు కేసులు పెడుతున్న‌ద‌ని, అక్రమంగా అరెస్టులు చేస్తున్నారని మల్లిఖార్జున ఖర్గే, రాహుల్ గాంధి ఆరోపించారు అని పేర్కొన్నారు.

కానీ.. రేవంత్ రెడ్డి, రాష్ట్ర కాంగ్రెస్ నాయకులు మాత్రం ఏఐసీసీ నాయకులు మాట్లాడిన దానికి విరుద్ధంగా మాట్లాడుతున్నారు. లిక్క‌ర్ స్కామ్ జరిగిందని, అందులో నిందితులను అరెస్టు చేయడం ఆల‌స్యం అయ్యిందంటూ వ్యాఖ్యానిస్తున్నారు. రేవంత్ రెడ్డి కాంగ్రెస్ మనిషి కాదని, ఆరెస్సెస్ భావ‌జాలం నిండి ఉన్న మోదీ మనిషి అని మేము ముందు నుంచీ చెప్తున్నాం.. అదిప్పుడు నిజమని తేలింది అని హరీష్ గుర్తు చేశారు.

తాను కాంగ్రెస్‌లో ఉన్న విష‌యం కూడా మ‌ర్చిపోయి.. కేవ‌లం బీఆర్ఎస్‌ను రాజకీయంగా ఇబ్బంది పెట్టేందుకు బీజేపీ త‌ర‌ఫున వ‌కాల్తా పుచ్చుకొని బీఆర్ఎస్‌పై అస‌త్యాలు ప్ర‌చారం చేస్తున్నారు అని అన్నారు.