mt_logo

బీఆర్ఎస్ కంచుకోట మెదక్‌లో మరోసారి విజయం ఖాయం: హరీష్ రావు

నర్సాపూర్‌లో మాజీ మంత్రి హరీష్ రావు మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా హరీష్ మాట్లాడుతూ.. బీఆర్ఎస్ ఓటమి ఎరుగని సీటు మెదక్.. బీఆర్ఎస్ కంచుకోటలో మరోసారి గెలుపు ఖాయం. ఒకరి మతంతో మరొకరు కులంతో పోటీకి వస్తే మేము చేసిన అభివృద్ధిని చూపుతూ వస్తున్నాము అని పేర్కొన్నారు.

దుబ్బాకలో చెల్లని రూపాయి ఇప్పుడు మెదక్ పార్లమెంట్ ఎన్నికల్లో చెల్లుతుందా. ఒక్కసారి గెలిపిస్తే ఎందుకు గెలిపించాం అని ప్రజలు బాధపడ్డారు. వెంకట్రామ రెడ్డి జీవితం తెరిచిన పుస్తకం.. ఆయనపై దుష్ప్రచారం చేయడం సరికాదు. మంచి వ్యక్తి, మానవతావాది.. పేదలను కుటుంబ సభ్యులుగా చూశారు.  20 ఏళ్లు సేవ చేసి ప్రజల హృదయాలు గెలిచారు అని తెలిపారు.

భూసేకరణ ఆయన ఇంటి కోసం చేయలేదు.. అలా మాట్లాడుతున్నారు. దేశంలోనే బెస్ట్ ఆర్ అండ్ ఆర్ కాలని నిర్మించారు.. మంచి ప్యాకేజీ ఇచ్చా.. మండుటెండలో గోదావరి నీళ్ళు గల గల పారాయి.. లక్షల ఎకరాల్లో పంట పండింది అంటే దాని వెనుక వెంకట్రామరెడ్డి చెమట చుక్కలు ఉన్నాయి అని అన్నారు.

ఈరోజుల్లో చాలా జిల్లాల్లో పంటలు ఎండిపోయాయి.. ఆర్ అండ్ ఆర్ కాలనిలో కూడా బీఆర్ఎస్ పార్టీకి మెజార్టీ వచ్చింది. రఘునందన్ మంచి చేస్తే ఎందుకు ఓడించారు.. మొన్న ప్రభుత్వ ఉద్యోగులను ఏడిపించారు..వెంకట్రామరెడ్డి మీద బురదజల్లే ప్రయత్నం చేస్తున్నారు. నీళ్ళు ఇవ్వడం తప్పు, ఆయన చేసింది తప్పు అయితే ఓడించండి.. మంచి అయితే గెలిపించండి అని హరీష్ పిలునిచ్చారు.

ప్రజలు ఈ విషయం మీద చర్చ చేయాలి.. డబ్బులు సంపాదించదానికీ రాజకీయాల్లోకి రాలేదు. ప్రజలకు సేవ చేసేందుకు రాజకీయాల్లోకి వచ్చారు. వడ్లు కొనాలి అంటే నూకలు బుక్కుర్రి అని బీజేపీ వాళ్ళు అన్నారు. పీయూష్ గోయల్ ఏం ముఖం పేట్టుకొని తెలంగాణలో ఓటు అడిగేందుకు వచ్చావు.. బీజేపీ రైతులకు చేసిన ఒక్క మేలు ఉందా.. రఘునందన్ సమాధానం చెప్పు అని అడిగారు.

నల్ల చట్టాలు తెచ్చి 700 మంది రైతులను చంపింది బీజేపీ.. వ్యవసాయానికి మద్దతు ధర తెస్తాం అని రైతులను మోసం చేసింది బీజేపీ. స్వామినాథన్ కమీషన్ అమలు చేస్తా అని మాట తప్పారు.. తెలంగాణ ప్రజలు బీజేపీకి ఎందుకు ఓటు వేయాలి. బీసీలకు మంత్రిత్వ శాఖ పెట్టమంటే అన్యాయం చేశారు.. వర్గీకరణ చేస్తున్నామని దళితులను మోసం చేశారు.. పార్లమెంట్‌లో ఎందుకు బిల్లు పెట్టలేదు.. మేనిఫెస్టోలో ఎందుకు పెట్టలేదు అని హరీష్ ప్రశ్నించారు.

ఉమ్మడి మెదక్ జిల్లాకు కేసీఆర్ గారు మూడు మెడికల్ కాలేజీలు ఇచ్చారు..కేంద్రం 157 మెడికల్ కాలేజీలు మంజూరు చేస్తే.. తెలంగాణకు ఒక్కటి ఇవ్వలేదు. తెలంగాణపై బీజేపీకి సవతి తల్లి ప్రేమ. మొదటి దశలో తెలంగాణకు ఎందుకు బుల్లెట్ ట్రైన్ ఇవ్వలేదు. ఏం చెప్పి ఇక్కడ ఓటు అడుగుతారు బీజేపీ వాళ్లు అని దుయ్యబట్టారు.

రూ. 13 లక్షల కోట్లు బడా కంపెనీలకు మాఫీ చేశావు.. రైతులకు మాత్రం రూపాయి మాఫీ చేయలేదు.. ఎన్ని గోబెల్స్ ప్రచారం చేసిన మెదక్ ఎంపీగా వెంకట్రామరెడ్డి గెలుపు ఖాయం. బీజేపీ వాళ్లు ఓటమి భయంతో ఫేక్ వార్తలను సోషల్ మీడియాలో ప్రచారం చేస్తున్నారు.. ఎన్నికల కమీషన్‌కు ఫిర్యాదు చేస్తున్నాం.. ప్రజలు నమ్మొద్దని విజ్ఞప్తి చేస్తున్నాను అని కోరారు.