mt_logo

కేంద్ర కార్యదర్శులతో భేటీ అయిన మంత్రి హరీష్ రావు..

రాష్ట్ర భారీ నీటిపారుదల శాఖామంత్రి హరీష్ రావు ఈరోజు ఢిల్లీలో కేంద్ర జౌళి శాఖ కార్యదర్శి సంజయ్ కుమార్ పాండాను, కేంద్ర పౌరసరఫరాల శాఖ కార్యదర్శి వింద్రా సారుప్ లను కలిశారు. పత్తి కొనుగోలు కేంద్రాల సంఖ్యను పెంచడంతోపాటు కాటన్ కార్పొరేషన్ తరపున సిబ్బందిని కూడా నియమించాలని గతంలో పలుమార్లు విజ్ఞప్తి చేసినా, స్పందన కనిపించకపోవడంతో రైతులు పడుతున్న ఇబ్బందులను జౌళిశాఖ కార్యదర్శి సంజయ్ కుమార్ పాండాకు వివరించారు. పత్తికి కనీస మద్దతు ధర రూ. 5వేలకు పెంచాలని, 20 శాతం తేమ ఉన్నా పత్తిని కొనుగోలు చేసేలా చర్యలు తీసుకోవాలని హరీష్ ఈ సందర్భంగా కోరారు.

అనంతరం కేంద్ర పౌరసరఫరాల శాఖ కార్యదర్శి వింద్రా సారుప్ తో భేటీ అయ్యి మొక్కజొన్నకు సబ్సిడీ ఇవ్వాలని హరీష్ రావు విజ్ఞప్తి చేశారు. అంతేకాకుండా పౌరసరఫరాలకు సంబంధించిన మరిన్ని అంశాలపై ఈ సందర్భంగా చర్చించారు. ఈ సమావేశంలో మంత్రి వెంట ఎంపీలు వినోద్ కుమార్, జితేందర్ రెడ్డి, కొత్త ప్రభాకర్ రెడ్డి, ప్రభుత్వ ప్రత్యేక ప్రతినిధి రామచంద్రు తేజావత్ తదితరులు ఉన్నారు. సమావేశం అనంతరం మంత్రి హరీష్ రావు మీడియాతో మాట్లాడుతూ రాష్ట్రంలోని పత్తి రైతుల సమస్యలు కార్యదర్శి దృష్టికి తీసుకెళ్ళామని, పత్తికి మద్దతు ధర రూ. 4,100 నుండి రూ.5వేలకు పెంచాలని కోరామని చెప్పారు. వారంలో మూడురోజులు మాత్రమే పత్తిని కొనుగోలు చేస్తున్నారని, కనీసం ఐదు రోజులు కొనుగోలు చేసేలా చర్యలు తీసుకోవాలని కోరినట్లు తెలిపారు. గత సంవత్సరం ఇదే సమయానికి లక్ష క్వింటాళ్ళ పత్తిని కొనుగోలు చేస్తే ఈ ఏడాది 15 వేల క్వింటాళ్ళ పత్తిని మాత్రమే కొనుగోలు చేశారని కార్యదర్శికి వివరించామని హరీష్ రావు పేర్కొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *