వరంగల్ లోక్ సభ ఉప ఎన్నికల ప్రచారం ఊపందుకుంది. ఆరు అసెంబ్లీ నియోజకవర్గాల్లో ఆదివారం జరిగిన కార్యకర్తల విస్తృత స్థాయి సమావేశాల్లో మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు పాల్గొని ప్రసంగించారు. వరంగల్ లోక్ సభ ఎన్నిక సీఎం కేసీఆర్ పనితీరుకు గీటురాయిగా మారనున్నదని, టీఆర్ఎస్ అభ్యర్థి పసునూరి దయాకర్ ను అత్యధిక మెజార్టీతో గెలిపించి ప్రతిపక్షాల గుండె జల్లుమనేలా సమాధానం ఇవ్వాలని పంచాయితీ రాజ్, ఐటీ శాఖల మంత్రి కేటీఆర్ అన్నారు. సార్వత్రిక ఎన్నికల్లో వచ్చిన మెజారిటీ కన్నా ఒక్క ఓటు తగ్గినా ప్రతిపక్షాలు మేకపోతు గాంభీర్యాన్ని ప్రదర్శిస్తాయని మంత్రి పేర్కొన్నారు. రాష్ట్రంలో గత ప్రభుత్వాలు 60 ఏళ్లలో చేయని అభివృద్ధిని సీఎం కేసీఆర్ నాయకత్వంలోని తెలంగాణ ప్రభుత్వం 60 నెలల్లో చేసి చూపిస్తుందని అన్నారు. ఇప్పటివరకు ఏ సీఎం కూడా జిల్లాలోని మురికివాడల్లో తిరగలేదని, అలాంటిది సీఎం కేసీఆర్ మూడురోజులు వరంగల్ లో మకాం వేసి పేద ప్రజల ఇళ్ళలోకి వెళ్లి వారి సమస్యలు తెలుసుకుని డబుల్ బెడ్ రూమ్ ఇళ్ళ పథకాన్ని అమలుచేశారని కేటీఆర్ గుర్తు చేశారు.
ఇదిలాఉండగా పాలకుర్తిలో నియోజకవర్గ ఇన్ చార్జి సుధాకర్ రావు అధ్యక్షతన జరిగిన సభలో డిప్యూటీ సీఎం కడియం శ్రీహరి మాట్లాడుతూ దళిత నిరుపేద బిడ్డ, ఉద్యమకారుడు పసునూరి దయాకర్ కు ఈ నియోజకవర్గం నుండి లక్ష మెజారిటీ సాధించాలని కార్యకర్తలకు పిలుపునిచ్చారు. 16 నెలల పాలనలో సీఎం కేసీఆర్ అభివృద్ధికి పాటుపడుతుంటే ప్రతిపక్షాలు విమర్శలకు దిగడం సిగ్గుచేటన్నారు. రైతు ఆత్మహత్యలపై మాట్లాడే అర్హత కేంద్రంలోని బీజేపీకి లేదని, రాష్ట్ర ప్రభుత్వం క్రాఫ్ ఇన్సూరెన్స్ పై కేంద్రానికి నివేదిక పంపిస్తే ఎందుకు పట్టించుకోవడం లేదని కడియం ప్రశ్నించారు. పత్తికి మద్దతు ధర ఇప్పించలేని ఎన్డీయే నాయకులు చిల్లర రాజకీయాల కోసం మార్కెట్ల చుట్టూ తిరగడం సిగ్గుచేటని, రైతులే బీజేపీ, టీడీపీ నేతలను తరిమి కొడుతున్నారని కడియం శ్రీహరి పేర్కొన్నారు.