mt_logo

గుట్టగుడికి స్వర్ణగోపురం

రాష్ట్రంలో ప్రముఖ పుణ్యక్షేత్రమైన యాదగిరిగుట్ట లక్ష్మీనరసింహస్వామి దేవస్థానాన్ని తిరుమల తిరుపతి దేవస్థానం తరహాలో అభివృద్ధి చేస్తామని ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్‌రావు చెప్పారు. రాష్ట్రంలోనే ప్రత్యేక కేంద్ర బిందువుగా తీర్చిదిద్దుతామని అన్నారు. లక్ష్మీనరసింహస్వామి ఆలయ గర్భగుడి గోపురం ఎత్తు పెంచడంతోపాటు స్వర్ణ గోపురం నిర్మిస్తామని ప్రకటించారు. ఆలయ మండపం ఇరుకుగా ఉన్నందున ఉత్తర, దక్షిణాలవైపు విస్తరణను శాస్త్రోక్తంగా చేపడతామని తెలిపారు. గుట్టపైనున్న ఇతర అస్తవ్యస్థ నిర్మాణాలను సైతం ఆగమశాస్త్ర నిబంధనల ప్రకారం పునర్నిర్మిస్తామని సీఎం అన్నారు. రాబోయే రెండు మూడేళ్లలో పూర్తిస్థాయి టెంపుల్ సిటీగా యాదగిరిగుట్టను తీర్చిదిద్దుతామని ప్రకటించారు.

– తిరుమల తరహాలో యాదగిరిగుట్ట
– రెండేండ్లలో టెంపుల్ సిటీగా అభివృద్ధి
– బ్రహ్మోత్సవాలకు సీఎంనుంచి పట్టువస్త్రాలు
– గుట్టచుట్టూ అభివృద్ధి కార్యక్రమాలు
– 1600 ఎకరాల్లో ఆధ్యాత్మిక కేంద్రాలు
– 400 ఎకరాల్లో జింకల సంరక్షణ కేంద్రం
– యాదగిరిగుట్ట సందర్శనలో సీఎం కేసీఆర్
– హెలికాప్టర్‌లో విహంగవీక్షణ
– ఆలయ సన్నిధిలో అపరిశుభ్రత అశుభం
– మళ్లీ 15 రోజుల్లో వచ్చి పరిశీలిస్తానని హెచ్చరిక
సీఎం హోదాలో తొలిసారి నల్లగొండ జిల్లాకు వచ్చిన కేసీఆర్.. యాదగిరి గుట్ట లక్ష్మీనరసింహస్వామిని దర్శించుకున్నారు. అంతకుముందు గుట్ట పరిసర ప్రాంతాలను హెలికాప్టర్ ద్వారా ఏరియల్ సర్వే చేశారు. దైవదర్శనం అనంతరం జిల్లా ముఖ్య అధికారులు, ప్రజాప్రతినిధులతో అభివృద్ధిపై సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా విలేకరులతో మాట్లాడిన సీఎం.. గుట్ట చుట్టూ రెండు వేల ఎకరాల భూమిలో ఆధ్యాత్మిక, పర్యాటక సంబంధిత కార్యక్రమాలు చేపడతామన్నారు.

తిరుమల దేవాలయానికి ప్రణాళిక రూపకల్పన చేసిన తమ్మన్నను పిలిపించి.. 1600 ఎకరాల్లో ఉద్యానవనాలు, ఆధ్మాత్మిక కేంద్రాలు, విల్లాలు, కాటేజ్‌లు నిర్మిస్తామని తెలిపారు. మిగిలిన 400 ఎకరాల భూమిని నృసింహ అభయారణ్యంగా తీర్చిదిద్ది, జింకల సంరక్షణ కేంద్రం ఏర్పాటు చేస్తామని చెప్పారు. ఈ అభయారణ్యం రెండు కొండలు, చెరువును కలుపుకొని ఉంటుందన్నారు. దేవస్థానం ఆధ్వర్యంలో వేద పాఠశాలను ప్రారంభిస్తామని ముఖ్యమంత్రి హామీనిచ్చారు. గుట్ట పైన బంచరాయిగా ఉన్న 103 ఎకరాల భూమి దేవస్థానం పరిధిలోకి తీసుకొచ్చే విధంగా కలెక్టర్‌ను ఆదేశించినట్లు చెప్పారు.

గుట్ట కింద భవానీనగర్‌లో ఎప్పటినుంచో ఉంటున్న 73 ఇండ్ల నిర్మాణాన్ని అనుమతిస్తూ పట్టాలు జారీ చేస్తామని హామీనిచ్చారు. నృసింహుడి సన్నిధిలో 23 ఏళ్లుగా పని చేస్తున్న ఎన్‌ఎంఆర్ సిబ్బంది 43 మందిని రెగ్యులరైజ్ చేస్తున్నామని ప్రకటించారు. చెత్తాచెదారంతో అపరిశుభ్రంగా ఉన్న ఆలయ ఆవరణను గమనించిన సీఎం.. ఆలయ పరిసరాలను పరిశుభ్రంగా తీర్చిదిద్దే చర్యలను అధికారులకు సూచించానని వివరించారు. పవిత్రమైన ఆలయ సన్నిధిలో అపరిశుభ్రత శుభసూచకం కాదని అన్నారు. 15 రోజుల్లో మళ్లీ వచ్చి పరిశీలిస్తానని హెచ్చరించారు.

జైన సంస్థ యాదగిరిగుట్ట మండలం మాసాయిపేట, సైదాపూర్ గ్రామాల సమీపంలో రూ.3వేల కోట్లతో ఆధ్మాత్మిక సంస్థను ఏర్పాటు చేయనున్నందున.. వారు అడిగిన రాయితీలు పరిశీలిస్తామని సీఎం కేసీఆర్ చెప్పారు. గుట్ట అభివృద్ధిలో పారిశ్రామికవేత్తల సహకారంసైతం తీసుకుంటామన్న ముఖ్యమంత్రి.. రాబోయే రెండు మూడేండ్లలో పూర్తిస్థాయి టెంపుల్ సిటీగా యాదగిరిగుట్టను తీర్చిదిద్దుతామని చెప్పారు. సుమారు రూ.60 కోట్లకు పైగా ఆదాయంతో, రూ.30 కోట్ల మిగులు ఉన్న దేవస్థానానికి టీటీడీ తరహాలో స్వయం ప్రతిపత్తి కలిగిన ప్రత్యేక బోర్డు ఏర్పాటు చేస్తామన్నారు. బ్రహ్మోత్సవాల సందర్భంగా ముఖ్యమంత్రి స్వయంగా పట్టు వస్త్రాలు సమర్పించే ఆనవాయితీని అమలు చేస్తామని చెప్పారు.

సీఎం పర్యటన సాగిందిలా..: 12 గంటలకు హెలికాప్టర్‌లో యాదగిరిగుట్ట చేరుకున్న సీఎం.. భువనగిరి ఎంపీ బూర నర్సయ్యగౌడ్, ఆలేరు ఎమ్మెల్యే గొంగిడి సునీత, జిల్లా కలెక్టర్ చిరంజీవులుతో కలిసి ఏరియల్ రివ్యూ చేశారు. లక్ష్మీనరసింహుడి దర్శనం అనంతరం ముఖ్య అధికారులు, ప్రజాప్రతినిధులతో అభివృద్ధిపై సమీక్షించి, విలేకరుల సమావేశం తర్వాత హైదరాబాద్‌కు తిరిగి వెళ్లారు. తొలిసారిగా జిల్లా పర్యటనకు వచ్చిన ముఖ్యమంత్రికి ప్రజాప్రతినిధులు, అధికారులు, టీఆర్‌ఎస్ నాయకులు ఘనస్వాగతం పలికారు.

కార్యక్రమంలో జిల్లా మంత్రి జీ జగదీశ్‌రెడ్డి, శాసనమండలి డిప్యూటీ చైర్మన్ నేతి విద్యాసాగర్, జడ్పీ చైర్మన్ బాలూనాయక్, ఎంపీ బూర నర్సయ్యగౌడ్, ఎమ్మెల్యేలు గొంగిడి సునీత, పైళ్ల శేఖర్‌రెడ్డి, గాదరి కిశోర్, కూసుకుంట్ల ప్రభాకర్‌రెడ్డి, వేముల వీరేశం, ఎమ్మెల్సీలు కర్నె ప్రభాకర్, పూల రవీందర్, కలెక్టర్ చిరంజీవులు, ఎస్పీ ప్రభాకర్‌రావు, జేసీ ప్రీతిమీనా, ఆలయ ఈవో కృష్ణవేణి, ధర్మకర్త నరసింహమూర్తి, టీఆర్‌ఎస్ జిల్లా అధ్యక్షుడు బండా నరేందర్‌రెడ్డి, నాయకులు పల్లా రాజేశ్వర్‌రెడ్డి, దుబ్బాక నర్సింహారెడ్డి, చాడ కిషన్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు.

నమస్తే తెలంగాణ సౌజన్యంతో..

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *