![](https://i0.wp.com/missiontelangana.com/wp-content/uploads/2023/08/InShot_20230822_083101293.jpg?resize=1024%2C575&ssl=1)
ప్రాణాలకు తెగించి కొట్లాడి తెచ్చుకొన్న తెలంగాణలో సీఎం కేసీఆర్ ఎవరూ ఊహించనంత అభివృద్ధి చేశారు. నీళ్లు, నిధులు, నియామకాలు అనే ఉద్యమ నినాదాన్ని ఒక్కొక్కటిగా సాకారం చేశారు. మొదట వ్యవసాయరంగంపైన దృష్టి సారించి, పసిడి పంటల తెలంగాణగా తీర్చిద్దారు. కాళేశ్వరం ప్రాజెక్టు కట్టడంతోపాటు మిషన్‌కాకతీయతో బీడు భూములకు జలాలను తరలించి, పసిడి పంటల తెలంగాణగా మార్చేశారు. రైతుబంధు, రైతుబీమా, వ్యవసాయానికి 24 గంటల కరెంట్, ఎరువులు, రుణమాఫీతో అన్నదాతకు వెన్నుదన్నుగా నిలిచి, ఎవుసాన్ని పండుగ చేశారు. తెలంగాణను దేశానికే అన్నపూర్ణగా మార్చేశారు.
తన విజన్‌తో విద్య, వైద్యం, పారిశ్రామికరంగాల్లో విప్లవాత్మక ప్రగతిని సాధించారు. కులం, మతం, జాతి అనే భేదం లేకుండా సబ్బండ వర్ణాలకు సంక్షేమ ఫలాలు అందజేసి, తెలంగాణలోని ప్రతి ఇంటిలో వెలుగులు నింపారు. తాను చేసిన అభివృద్ధిపై నమ్మకంతోనే ముఖ్యమంత్రి కేసీఆర్ అసెంబ్లీ సీట్ల కేటాయింపులో సిట్టింగ్‌లకే మళ్లీ చాన్స్ ఇచ్చి రాజకీయ పండితులనే ఆశ్చర్యపరిచారు. రాబోయే అసెంబ్లీ ఎన్నికల్లో తమ పార్టీనుంచి పోటీచేసే అభ్యర్థుల మొదటిజాబితాను సోమవారం విడుదల చేసి, ప్రతిపక్షాల గుండెల్లో బాంబులు పేల్చారు. 119 స్థానాలకు కేవలం నాలుగింటిని వదిలేసి 115 స్థానాలకు అభ్యర్థులను ప్రకటించి దమ్మున్న లీడర్ అని నిరూపించుకొన్నారు. అందరికంటే ముందుగా జాబితా ప్రకటించి 115 మంది గెలుపు గుర్రాలని చెప్పకనే చెప్పారు.
ప్రతిపక్షాలకు అభ్యర్థులేరీ?
తెలంగాణలో కేసీఆర్‌ను గద్దె దించి, తాము అధికారంలోకి వస్తామంటే తాము వస్తామని ప్రగల్భాలకు పోయిన బీజేపీ, కాంగ్రెస్ పార్టీలకు అభ్యర్థులే కరువయ్యారు. ఆ రెండు పార్టీలకు 119 నియోజకవర్గాల్లో కేవలం మూడు, నాలుగు చోట్ల తప్ప మిగతా చోట్ల సరైన అభ్యర్థులే లేకపోవడంతో అసెంబ్లీ స్థానాలకు పోటీచేసే అభ్యర్థుల జాబితాను విడుదల చేసేందుకు జంకుతున్నాయి. బీఆర్ఎస్‌లో టికెట్ దక్కని అసంతృప్తులు ఎవరైనా ఉంటే తమవైపునకు తిప్పుకోవాలని ప్లాన్ వేస్తున్నాయి. సీట్లు దక్కనివారికి గాలం వేసి, తమ పార్టీ తరఫున పోటీ చేయించాలని ఉవ్విళ్లూరుతున్నాయి. సీఎం కేసీఆర్ బీఆర్ఎస్ అభ్యర్థుల జాబితాను ప్రకటించడంతో ఆ రెండు జాతీయపార్టీల్లోనూ టెన్షన్ మొదలైంది. బీఆర్ఎస్ అసంతృప్తులు తమ గూటికి చేరుతారా? లేక కేసీఆర్‌తోనే ఉంటారా? అనేది తేల్చుకోలేక సతమతమవుతున్నాయి.
ఇదిలా ఉండగా, బీఆర్ఎస్ సర్కారును గద్దెదించుతామని ఇప్పటివరకూ ఊదరగొట్టిన బీజేపీ, కాంగ్రెస్‌కు అభ్యర్థులే కరువుకావడంపై సోషల్ మీడియాలో సెటైర్లు పేలుతున్నాయి. అభ్యర్థులే లేని జాతీయ పార్టీలకు బీఆర్ఎస్ పార్టీతో పోటా? అంటూ నెటిజన్లు ప్రశ్నిస్తున్నారు. జాతీయపార్టీలమని, దేశాన్ని ఏలామని గప్పాలుకొట్టే పార్టీలకు రాష్ట్రంలో అభ్యర్థులు కరువా? అంటూ చురకలంటిస్తున్నారు. బీఆర్ఎస్ అసంతృప్తులే వారికి దిక్కా? అని ప్రశ్నిస్తున్నారు. టికెట్ దక్కని బీఆర్ఎస్ నేతలెవరూ కేసీఆర్‌ను వీడి పోరని, ఇలాంటి సమయంలో కాంగ్రెస్, బీజేపీ ఆశలు ఎలా నెరవేరుతాయో వేచి చూడాల్సిందేనని రాజకీయ విశ్లేషకులు అంటున్నారు.